Advertisement

Advertisement


Home > Politics - Political News

ఏం మాట్లాడుతున్నావ్ బాబూ.. నీకైనా అర్థమౌతోందా!

ఏం మాట్లాడుతున్నావ్ బాబూ.. నీకైనా అర్థమౌతోందా!

"ఎక్కడుంది అభివృద్ధి అని అడుగుతున్నాను. ఎక్కడుంది సంక్షేమం అని అడుగుతున్నాను. రాష్ట్రాన్ని బంగారు పల్లెంలో పెట్టి అప్పగిస్తే, సర్వనాశనం చేశారు. అప్పుల ఊబిలోకి నెట్టారు." తాజాగా చంద్రబాబు ఇచ్చిన స్టేట్ మెంట్ ఇది. ఆయన రాష్ట్రాన్ని బంగారు పల్లెంలో పెట్టి అప్పగించారట. ఈ శతాబ్దంలో ఇంతకంటే పెద్ద జోక్ ఉండదేమో.

పదే పదే చంద్రబాబు అండ్ కో చెప్పేమాట ఒకటే. రాష్ట్రాన్ని బంగారు పల్లెంలో పెట్టి జగన్ కి ఇచ్చారని, దాన్ని జగన్ సర్వనాశనం చేశారనేది వారి వాదన. వాస్తవానికి రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు అధికారం చేపట్టే నాటికి ఏపీ తలపై ఉన్న అప్పు 96 వేల కోట్ల రూపాయలు. ఈ విషయాన్ని అప్పట్లో చంద్రబాబే శ్వేతపత్రం విడుదల చేసి మరీ చెప్పారు. ఇక చంద్రబాబు దిగిపోయే నాటికి 3.65 లక్షల కోట్లు.

లోటు బడ్జెట్ తో ప్రయాణం మొదలు పెడితే పాలన ఎంత జాగ్రత్తగా ఉండాలి. అయితే అది వదిలేసి మరింత దారుణమైన అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని నెట్టివేశారు చంద్రబాబు. 2016లోనే కాగ్ ఈ విషయంలో చంద్రబాబుకి మొట్టికాయలు వేసింది. చంద్రబాబు పాలన పూర్తయ్యే నాటికి సగటున ప్రతి రాష్ట్ర పౌరుడిపై 42,500 రూపాయలు అప్పు మిగిల్చారు. అది బంగారు పళ్లెమా, లేక బిచ్చగాడి జోలె సంచా అనేది ఆయనే చెప్పాలి.

దుబారాకు చిరునామా చంద్రబాబు..

అప్పుల్లో కూడా దుబారా చేయడం చంద్రబాబుకే చెల్లింది. ఉన్న వాటికే మళ్లీ శంకుస్థాపనలు చేసి తన గొప్ప చూపించు కోవాలనుకున్నారు బాబు. తాత్కాలిక నిర్మాణాల పేరుతో చంద్రబాబు కట్టిన అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు భవనాల సొగసు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చంద్రబాబు టూర్లకి ప్రత్యేక విమానాలు, వర్షాల కోసం రెయిన్ గన్లు.. ఇలా చంద్రబాబు దుబారా చేయని అంశమంటూ లేదు. రాజధాని డిజైన్ల పేరుతో సింగపూర్, జపాన్ కంపెనీలకు అడ్వాన్సులివ్వడం ఎవరికి తెలియని బాగోతాలు ఇవన్నీ.

పుష్కరాల సమయంలో చంద్రబాబు చేసిన హడావిడి, పెట్టిన అదనపు ఖర్చు, సినీ దర్శకులతో చేసిన షూటింగ్ హడావిడి, దాని కారణంగా పోయిన ప్రాణాలు.. ఇవన్నీ ప్రజలకు ఇంకా గుర్తున్నాయి కూడా. దుబారాకు చంద్రబాబు ఇచ్చిన ఫినిషింగ్ టచ్ ఏంటంటే.. ప్రభుత్వం తరపున 5వేల కోట్ల రూపాయల అప్పు చేసి, దాన్ని ఎన్నికల తాయిలాలుగా పసుపు కుంకుమల పేరుతో పంచిపెట్టడం. 

కేవలం టీడీపీకి ఓట్లు వేయించుకోడానికి చేపట్టిన ఈ కార్యక్రమానికి అయిన ఖర్చంతా ఏపీ ప్రజల నెత్తిన పడింది. ఇలా దుబారాకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన చంద్రబాబు.. బంగారుపల్లెంలో పెట్టి రాష్ట్రాన్ని జగన్ కు అప్పగించానంటూ కామెడీ చేస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక కూడా అప్పులు చేయక తప్పని పరిస్థితి. దీనికి కారణం చంద్రబాబే అయినా.. లక్ష కోట్ల రుణాలు తెచ్చి అభివృద్ధి, సంక్షేమ పథకాలు నడపాల్సిన అవసరం జగన్ పై ఏర్పడింది. 

జగన్ తెచ్చే అప్పుల్లో ఏదీ దుబారా కాదనే వాస్తవాన్ని ప్రజలు గ్రహించారు. పింఛన్లు పెంచడం, ఇళ్ల పట్టాల పంపిణీ కోసం స్థలాలు సేకరించడం, అమ్మఒడి, విద్యాదీవెన, నాడు-నేడు, వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు జీతాలు.. వీటన్నిటికీ అప్పులు అవసరమే. ఇళ్లపట్టాలు, నాడు-నేడు వంటి కార్యక్రమాల కోసం చేసిన అప్పులు శాశ్వత అభివృద్ధికి బాటలు వేశాయి.

చంద్రబాబు చేసిన అప్పులు దుబారాకు కారణం అయితే, జగన్ తెస్తున్న రుణాలు సంపద సృష్టికి కారణం అవుతున్నాయి. అప్పుల కుప్పలా ఏపీని మార్చారంటూ తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో తను చేసిన తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు బాబు. అందుకే బంగారు పల్లెం, వెండి కంచం అంటూ కామెడీ చేశారు. తన మాటల్ని జనం చాన్నాళ్ల కిందటే పట్టించుకోవడం మానేశారనే విషయాన్ని బాబు తెలుసుకోలేకపోతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?