cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

బాబు ద‌మ‌నకాండ ... విన్నారా? క‌న్నారా?

బాబు ద‌మ‌నకాండ ... విన్నారా? క‌న్నారా?

సీపీఐ నాయ‌కుల పోల‌వ‌రం ప్రాజెక్టు సంద‌ర్శ‌న‌ను పోలీసులు అడ్డుకోవ‌డంపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు మండిప‌డ్డారు. పోల వ‌రం ప్రాజెక్టు నిషిద్ధ ప్రాంత‌మా? అక్క‌డ‌కు వెళ్ల‌కుండా నేత‌ల‌ను అడ్డుకునే హ‌క్కు పోలీసుల‌కు ఎవ‌రిచ్చారు? అని ఆయ‌న తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

చంద్ర‌బాబు మాట‌లు వింటుంటే గురువింద గింజ సామెత గుర్తుకొస్తోంది. 2018, సెప్టెంబ‌ర్ 4న ఇదే సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కె.రామ‌కృష్ణ‌తో పాటు సీపీఎం నాయ‌కుల‌ను త‌న సొంత గ్రామం నారావారిప‌ల్లెలో అడుగుపెట్ట‌నివ్వ‌ని గొప్ప చ‌రిత్ర బాబు పాల‌న‌కు ఉంది. ఇవేవీ ఆయ‌న‌కు గుర్తున్న‌ట్టు లేదు. ఆ విష‌యాల గురించి ఒక‌సారి చంద్ర‌బాబుకు గుర్తు చేద్దాం.

పోల‌వ‌రం సంద‌ర్శ‌న యాత్ర చేప‌ట్టిన సీపీఐ నాయ‌కుల‌ను పోలీసులు అడ్డ‌గించ‌డంపై చంద్ర‌బాబు ఒక ప్ర‌క‌ట‌న‌లో ఖండించారు. ముందుగా ఆ ఖండ‌న వివ‌రాలు చూద్దాం.

‘పోల‌వ‌రం ప్రాజెక్టు  సంద‌ర్శ‌న‌కు బ‌య‌ల్దేరిన సీపీఐ నాయ‌కుల‌ను నిర్బంధించ‌డం, గృహ నిర్బంధం చేయ‌డం గ‌ర్హ‌నీయం. తెలుగుదేశం హ‌యాంలో పోల‌వ‌రం ప‌ర్యాట‌క ప్రాంతంగా మారింది. ప్ర‌భుత్వమే ప్ర‌జ‌ల‌ను తీసుకెళ్లి  అక్క‌డ జ‌రిగే ప‌నుల్ని చూపించింది. 72 శాతం మేర ప‌నుల‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేసింది. 

తాజాగా ఎత్తు త‌గ్గింపు ప్ర‌చారం నేప‌థ్యంలో ప్రాజెక్టు సంద‌ర్శ‌న‌కు వెళ్లే సీపీఐ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల్ని అడ్డుకోవ‌డం ద‌మ‌న‌కాండ‌కు ప‌రాకాష్ట . సీపీఐ నాయ‌కుల‌ను వెంట‌నే విడుద‌ల చేయాలి. ప్ర‌తిప‌క్షాల‌పై అక్ర‌మ కేసులు ఎత్తి వేయాలి. పోల‌వ‌రం ప‌రిశీల‌న‌కు వ‌చ్చే వారిని అనుమ‌తించాలి’ అని చంద్ర‌బాబు డిమాండ్ చేశారు.

‘గురువింద గింజ తన కింద నలుపు ఎరుగదు’ అనే సామెత బాబు తాజా స్పంద‌న గుర్తు చేస్తోంది. ద‌మ‌న‌కాండ‌కు రోల్ మోడ‌ల్‌గా చంద్ర‌బాబు ఐదేళ్ల పాల‌న సాగింద‌నే విమ‌ర్శ‌లున్నాయి. దీనికి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా ఇదే రామ‌కృష్ణను అడ్డుకున్న ఉదంతం గురించి బాబుకు గుర్తు చేయాల్సిన స‌మ‌యం ఇది. అధికారంలో ఉన్న‌ప్పుడు ఒక‌లా, లేన‌ప్పుడు మ‌రోలా మాట్లాడ్డం బాబుకు తెలిసిన‌ట్టు మ‌రెవరికీ తెలియ‌దు. రెండేళ్ల క్రితం మాట‌. అప్పుడు చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్నారు.

2018, సెప్టెంబ‌ర్ 4. సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కె.రామ‌కృష్ణ‌, సీపీఎం కేంద్ర క‌మిటీ స‌భ్యుడు వి.శ్రీ‌నివాసరావును చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని నారావారిప‌ల్లిలో అడుగు పెట్ట‌నివ్వ‌కుండా పోలీసులు అడ్డుకున్నారు.

ముఖ్యమంత్రి చంద్ర‌బాబు స్వగ్రామమే నారావారిపల్లి. ఆ గ్రామ‌ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించడానికి  వెళ్లిన సీపీఐ, సీపీఎం నేతలకు పోలీసులు చుక్క‌లు చూపించారు. జ‌ర్న‌లిస్టుల‌ను కూడా  నారావారిపల్లిలోకి వెళ్లకూడదంటూ కొన్ని కిలో మీటర్ల దూరంలోని రంగంపేట క్రాస్‌లోనే, నారావారిపల్లి రోడ్డుకు అడ్డంగా బ్యారీకేడ్లు పెట్టి దారి మూసేశారు. 

పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వి.శ్రీనివాసరావు తదితర ముఖ్య నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.

వామపక్ష నేతలు బస్సు దిగి బ్యారీకేడ్లను దాటుకుని వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తాము ఆందోళనలు  చేయడానికి రాలేదని, సీఎం స్వగ్రామంలోని ఆస్పత్రిలో ప్రజలకు ఎలాంటి వైద్య సేవలు అందుతున్నాయో చూడ్డానికి వచ్చామని వామ‌ప‌క్ష నేతలు  ఎంత చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. ముఖ్యమంత్రి స్వగ్రామానికి వెళ్లేందుకు మాత్రం పోలీసులు అనుమ‌తించ‌లేదు.  

అప్ప‌ట్లో ఇదే రామ‌కృష్ణ మాట్లాడుతూ  తిరుపతి నుంచి పీలేరుకు బ‌స్సు యాత్ర‌గా వెళుతూ నారావారిపల్లి ఆస్పత్రిని చూద్దామ నుకుంటే పోలీసులతో అడ్డుకుంటారా? అని ప్ర‌శ్నించారు. ఆస్పత్రిని చూడటం ఏమైనా నేరమా? అధికార పక్షం ఎందుకు అంతగా భయపడిపోతోందని ప్ర‌శ్నించారు. 

పోలీసులతో ఎంతకాలం నెట్టుకొస్తారో చూస్తామ‌ని హెచ్చ‌రించారు.  సెప్టెంబర్‌ 15వ తేదీ విజయవాడ మహాగర్జన సభ తరువాత మళ్లీ నారావారిపల్లికి వస్తామ‌ని కూడా అప్ప‌ట్లో ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఏ విధంగా అడ్డుకుంటారో అడ్డుకోండి మేమూ చూస్తాం అని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ నాడు తీవ్రంగా హెచ్చరించారు.

ఇక ప్ర‌స్తుతానికి వ‌స్తే బాబును అధికారం నుంచి ప్ర‌జ‌లు దింపేశారు. ముఖ్య‌మంత్రి ప‌ద‌వి పోయి ప్ర‌తిప‌క్ష హోదా వ‌చ్చింది. దీంతో ఆయ‌న నాలుక కూడా మ‌డ‌త ప‌డింది. అప్పుడు త‌న గ్రామంలోకి ఎవ‌రినైతే రాకుండా అడ్డుకున్నారో. ఇప్పుడు వాళ్ల గురించి మొస‌లి క‌న్నీళ్లు కారుస్తున్నారు. 

పోలవ‌రం ప్రాజెక్టు నిషిద్ధ ప్రాంత‌మా? అక్క‌డ‌కు వెళ్ల‌కుండా నేత‌ల‌ను అడ్డుకునే హ‌క్కు పోలీసుల‌కు ఎవ‌రిచ్చారని ఇప్పుడు నిల‌దీస్తు బాబు నాటి దురాగ‌తాలు క‌ళ్ల ముందు క‌ద‌లాడుతున్నాయి. నారావారి మాట‌ల‌కు అర్థాలే వేరులే అంటే ఇదేనేమో!

గ్రేటర్ కొడతాడా? ఇజ్జత్ నిలుస్తుందా?

 


×