cloudfront

Advertisement


Home > Politics - Political News

బాబు లెక్క.. బీజేపీకి సీట్లు బాగానే వస్తాయ్!

బాబు లెక్క.. బీజేపీకి సీట్లు బాగానే వస్తాయ్!

ఒకవైపు అనునిత్యం భారతీయ జనతా పార్టీ మీద దుమ్మెత్తిపోసే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆ పార్టీకి వచ్చే సీట్ల విషయంలో చెప్పిన నంబర్ ఆసక్తిదాయకంగా ఉంది. బీజేపీకి సొంతంగా 170 ఎంపీ సీట్లు దక్కుతాయని చంద్రబాబు నాయుడు అన్నారు. బాబు ప్రస్తుతం చేస్తున్న పనేంటో చెప్పనక్కర్లేదు. బీజేపీ మీద, మోడీ మీద తీవ్రంగా విరుచుకుపడటమే బాబు పనిగా పెట్టుకున్నారు. నాలుగున్నర సంవత్సరం పాటు ఎన్డీయేలో భాగస్వామిగా కొనసాగి చంద్రబాబు నాయుడు గత ఆరు నెలలుగా కమలం పార్టీపై దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు.

బీజేపీకి వ్యతిరేకంగా కర్ణాటక, తమిళనాడులకు వెళ్లి సైతం ప్రచారం చేశారు చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలో బీజేపీ మీద అంతకసి ఉన్నా చంద్రబాబు నాయుడు ఆ పార్టీకి నూటాడెబ్బై ఎంపీ సీట్లు దక్కే అవకాశాలున్నాయని ప్రకటించడం విశేషమే. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీ అయినా నూటాడెబ్బై ఎంపీ సీట్లను సాధించుకుందంటే అది మంచి విజయం సాధించినట్టే లెక్క! అది బీజేపీ అయినా నూటా డెబ్బై సీట్లను సాధించిందంటే.. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలబడినట్టే.

గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి వందసీట్లు తగ్గితే తగ్గవచ్చు గాక.. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీనే నిలబడుతుంది. చంద్రబాబు లెక్కల ప్రకారం కూడా అదే జరగబోతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఎంత మెరుగైన ప్రదర్శన చేసినా వంద సీట్ల దరిదాపుల్లోకి రావొచ్చు. ఈ లెక్కన చూస్తే.. బీజేపీనే మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు. మెజారిటీకి బీజేపీకి వందసీట్లు తక్కువ వచ్చినా.. ఇరవై ఎంపీ సీట్ల రేంజ్ లో సాధించగల ఐదుగురు మిత్రపక్షాలు కలిసివచ్చినా బీజేపీకే ఎడ్జ్ ఉంటుంది!

కేసీఆర్, నవీన్ పట్నాయక్, జగన్.. వంటి వాళ్లను కలుపుకున్నా.. బీజేపీ మళ్లీ అధికారానికి దగ్గర అయినట్టే. ఇదీ చంద్రబాబు నాయుడు ఇన్ డైరెక్టుగా చెబుతున్న విషయం. అయినా బాబు లెక్కల్లోనే బీజేపీకి 170 ఎంపీ సీట్లు వస్తాయంటే.. అసలు ఫలితాల్లో బీజేపీ రెండువందల మార్కును టచ్ అయినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏతావాతా మళ్లీ బీజేపీకే ఛాన్స్ అని బాబు ఒప్పుకుంటున్నట్టే అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

తెలుగుదేశంలోనూ విజయం మీద ఫుల్ కాన్ఫిడెన్స్!

నాని ఇంటర్వ్యూలో చెప్పినట్లు జెర్సీ సినిమా ఉందా?