cloudfront

Advertisement


Home > Politics - Political News

బాబుగారి హైటెక్ పాలన తీరిది...

బాబుగారి హైటెక్ పాలన తీరిది...

ఎక్కడ ఏం జరిగినా తన డ్యాష్ బోర్డులో అన్నీ తెలిసిపోతాయ్.. టెక్నాలజీతో తుఫాన్లను ఆపేశాం.. వర్షాలు లేకుండా పంటలు పండిస్తాం.. ఇవీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు. ఎక్కడా తన హైటెక్ రేంజ్ తగ్గకుండా, అంతర్జాతీయ స్థాయి అనే ముచ్చట లేకుండా బాబు సమీక్షలు ఉండవు.

కలెక్టర్లతో సమావేశం అయినా, మరో రకంగా పాలనా పరమైన సమీక్ష సమావేశాలు నిర్వహించినా చంద్రబాబు నాయుడు చెప్పే మాటలకు హద్దూఅదుపూ ఉండదు. తన పాలన అద్భుతం అని.. ప్రపంచమంతా కుళ్లుకుని చస్తోందన్నట్టుగా.. దేన్నైనా చిటికెలో చేసేస్తాను అన్నట్టుగా.. చిటికెల పందిళ్లు వేస్తూ చంద్రబాబు పాలన సాగిస్తున్నాడు.

అయితే ఈ హైటెక్ పాలనలో ప్రమాదాలు మాత్రం కొనసాగుతూ ఉన్నాయి. విషాదాలు జరుగుతూ ఉన్నాయి. గోదావరి పుష్కరాల దుర్ఘటన దగ్గర నుంచి ప్రతి రెండు మూడు నెలలకూ ఏపీలో అలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అనేక మంది బాధితులు అవుతున్నారు. కృష్ణా నదిలో బోటు ప్రమాదం చోటు చేసుకుంది కొన్ని నెలల కిందట. అప్పుడు బాధితులకు నష్టపరిహరం ప్రకటించారు. సమీక్షలు నిర్వహించారు.

అక్రమ పద్ధతిలో నడుస్తున్న బోట్ల పర్మిట్ల గురించి హడావుడి చేశారు. ఆ తర్వాత మళ్లీ మామూలే. అప్పుడే ఎంత దారుణంగా వ్యవహరించారంటే.. పర్యాటక శాఖకు సంబంధించిన బోటు ప్రమాదానికి గురి అయితే ఆ శాఖ మంత్రి దానికి బాధ్యత వహించలేదు. ఆఖరికి బాధితులను పరామర్శించేందుకు కూడా ఆమెకు తీరిక దొరకలేదు. ఇప్పుడు గోదావరి నదిలో ప్రమాదం.. మళ్లీ అదే వ్యథ. నది మారింది, బోటు మారింది, బాధితులు మారారు. ముఖ్యమంత్రి మళ్లీ సమీక్ష నిర్వహించాడు.

ఏ ఉత్తరాఖండ్లోనో మరెక్కడో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటే.. ఆ రాష్ట్రాలు ఇంకా వెనుకబడే ఉన్నాయి, అందుకే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని మనకు మనం సమాధానాలు చెప్పుకుంటాం. ఏపీలో కూడా ఇలాంటి వరస ప్రమాదాలే జరుగుతున్నాయి. ఇప్పుడు ఏపీ ఎక్కడ ఉందో.. చంద్రబాబు లాంటి హైటెక్ పాలకుడి పాలనతో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవడానికి ఇంతకన్నా ఏం కావాలి?