Advertisement

Advertisement


Home > Politics - Political News

బాబు ఇన్ని తప్పులు చేసారా?

బాబు ఇన్ని తప్పులు చేసారా?

నిజమైన మిత్రుడు అంటే స్నేహితుడి తప్పు ఒప్పులు సమానంగా ఎత్తిచూపగలిగిన వాడు. అలాకాకుండా స్నేహితుడి తప్పులు అన్నీ కప్పిపుచ్చి, అతగాడి పతనానికి కారణమయ్యేవాడు మిత్రుడుకాదు శతృవే అవుతాడు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు తెలుగుదేశం అంటే వీరాభిమానం. ఇది మనం చెప్పేమాట కాదు, జనం అనుకునేమాట.

గత అయిదేళ్లుగా ఆయన చంద్రబాబు మీద ఈగ వాలనివ్వలేదు. చంద్రబాబు కోసం, ఆయన పార్టీ కోసం రాధాకృష్ణ దాదాపు తన పత్రికనే పణంగా పెట్టారు. కానీ చెప్పాల్సిన టైమ్ లో చంద్రబాబు చేస్తున్న తప్పులు మాత్రం చెప్పలేకపోయారు. ఆ విధంగా ఆర్కే అతి పెద్ద తప్పు చేసారు. దానికి మూల్యం చంద్రబాబు చెల్లించారు.

* చంద్రబాబు మార్క్‌ పాలన కనిపించడం లేదని తొలి ఏడాదే ప్రజలలో అభిప్రాయం ఏర్పడినా.. దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నించలేదు.

* పార్టీ శాసనసభ్యుల విచ్చలవిడితనాన్ని అరికట్టవలసిందిపోయి నిస్సహాయుడిగా ఉండిపోయారు. బలమైన వ్యక్తులు– శక్తులు తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న విషయాన్ని పట్టించుకోలేదు.

* కమ్యూనిజానికి కాలం చెల్లిందంటూ అప్పట్లో అఖిలపక్ష సమావేశాలకు కూడా కమ్యూనిస్టులను ఆహ్వానించకుండా అహం ప్రదర్శించారు. ఇప్పుడు కూడా కమ్యూనిస్టులు, ఇతర పార్టీల ఉనికిని గుర్తించడానికి ఆయన ఇష్టపడలేదు.

* రాజధాని అమరావతికి శంకుస్థాపన వంటి ప్రధాన ఘట్టాలలో కూడా రాజకీయ పార్టీలకు, ఇతర ముఖ్యులకు చోటు లేకుండా చేశారు. ఇలాంటి ఒంటెత్తు పోకడల వల్ల ఎన్నికల నాటికి చంద్రబాబు ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడేవారే కరువయ్యారు.

* చంద్రబాబు పాలనలో అవినీతి తారస్థాయికి చేరిందన్న ప్రచారం గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగినా లెక్క చేయలేదు. దీంతో అభివృద్ధి తెరమరుగై అవినీతి మాత్రమే ప్రజలకు కనిపించింది.

* పైసా ఖర్చులేకుండా రాజధాని కోసం 30 వేలకు పైగా ఎకరాలు సేకరించిన ఘనతను ప్రజలు మరిచిపోయేలా కుంభకోణం జరిగిందన్న ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోయారు. ఈ ప్రచారం ఎంతవరకు వెళ్లిందంటే ‘‘రాజధానిని మా కోసం కడుతున్నారా? కమ్మ సామాజికవర్గం కోసం కడుతున్నారు’’ అని ఇతర సామాజికవర్గాలు భావించేవరకు సాగింది.

* ఇసుక సరఫరా, జన్మభూమి కమిటీల వల్ల చెడ్డ పేరు వస్తున్నప్పటికీ పరిస్థితులను చక్కదిద్దకుండా బేఖాతరు చేశారు.

* కొందరు శాసనసభ్యులు, మంత్రులు అరాచకంగా ప్రవర్తించినా కట్టడి చేయలేకపోయారు.

ఆర్కే లేటెస్ట్ ప్రవచనాల్లో ఇవి మచ్చుకి కొన్ని మాత్రమే. ఇన్ని తప్పులు చంద్రబాబు చేసారని, ఆయన గత అయిదేళ్లలో గట్టిగా చెప్పివుంటే బాగుండేది. అలా చేయలేదు. పైగా చంద్రబాబు వీరుడు, శూరుడు, ఆ పార్టీని కొట్టేమగాడే లేడు అంటూ రాసుకువచ్చారు.

అదే సమయంలో జగన్ అనేవాడు అస్సలు పనికిరాడు, అతన్ని గెలిపించకూడదు అన్నట్లుగా వార్తలు వండి వార్చారు. కానీ అంతా ఆ పైవాడికి తెలుసు అన్నట్లుగా, జనాలకు అన్నీ తెలుసు. అందుకే సరైన తీర్పు ఇచ్చారు.

ఇప్పుడు ఆర్కే, తను ఇన్నాళ్లు దాచిపెట్టిన నగ్న సత్యాలు బయటకు తీసి, వచిస్తున్నారు. కానీ ఇప్పుడేం లాభం. చేతులు పూర్తిగా కాలిపోయాక, ఆకులు ఏమీ చేయలేవు కదా?

టీడీపీ స్థానాన్ని బీజేపీ ఆక్రమించగలదా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?