Advertisement


Home > Politics - Political News
పోరాడుతున్నారుగా... కళ్లనీళ్లెందుకు?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంతో చేసే పోరాట నాటకంలో అలసిపోతున్నారా? ఎన్‌డీఏ నుంచి బయటకు రాలేక, లోపల ఉండలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? ఈరోజు చంద్రబాబు అసెంబ్లీలో ప్రసంగిస్తూ తీవ్ర భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నట్లు సమాచారం. దేశంలోకెల్లా సీనియర్‌ నాయకుడినని, అవినీతి మచ్చలేని నిప్పులాంటివాడినని, విభజన చట్టంలోనివి సాధించేవవరకు పోరాటం సాగిస్తానని రోజూ చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కళ్లనీళ్లు పెట్టుకునేంత బేలగా ఎందుకు మారిపోయారు?

ప్రతిపక్షం లేని అసెంబ్లీలో ప్రతిరోజు విభజన సమస్యలు చెప్పుకోవడమే సీఎం పని. చెప్పిన కథలే చెబుతున్నారు. అవే లెక్కలు వల్లె వేస్తున్నారు. మిత్రపక్షమో, శత్రుపక్షమో తెలియని బీజేపీపై, కేంద్రంపై విమర్శలు చేస్తూ, వైకాపాను తిడుతూ కాలక్షేపం చేస్తున్నారు. చెప్పిందేచెప్పి చేతకాక కళ్లనీళ్లు పెట్టుకున్నారేమో...!

'రాజధాని అంటే డ్రీమ్‌ సిటీ అని హేళన చేస్తారా?' అని మండిపడ్డారు. 'పొరుగు రాష్ట్రాల కంటే గొప్పగా రాజధాని నిర్మించాలని నా కల' అన్నారు. సమైక్యాంధ్ర ముసుగేసుకున్న వ్యక్తి (జగన్‌) ప్రతిపక్షంలో కూర్చున్నాడు. విభజనకు కారణమైన వ్యక్తి రోడ్లపై తిరుగుతున్నాడు' అని జగన్‌ను విమర్శించారు. రాష్ట్ర విభజనలో తన పాత్ర లేదని చంద్రబాబు అదే పనిగా చెప్పుకుంటున్నారు. విభజనకు అంగీకరిస్తూ రెండుసార్లు కేంద్రానికి లేఖలు ఇచ్చిన సంగతి గుర్తులేదా? రాష్ట్ర విభజనకు అంగీకరించిన తరువాత చంద్రబాబు ఏపీలో సమైక్యాంధ్ర ఉద్యమం నడిపారు కదా. సీపీఎం మినహా అన్ని పార్టీలూ విభజనకు అంగీకరించాయి. చేయల్సిందంతా తాను చేసి జగన్‌ మాత్రమే పాపాత్ముడన్నట్లుగా బాబు ప్రచారం చేస్తున్నారు.

'రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీపడే ప్రసక్తే లేదు. బీజేపీ నేతలకు మొహమాటం ఉండొచ్చు. నాకెలాంటి మొహమాటం లేదు. నాకు భయం లేదు. లాలూచీ పడేదిలేదు' అన్నారు చంద్రబాబు. మనం ఇదంతా రివర్సుగా అర్థం చేసుకోవాలి. నిజానికి బీజేపీ మొదట్నుంచీ బాబు సర్కారుపట్ల మొహమాటం లేకుండా  వ్యవహరిస్తోంది. మొహమాటం లేకపోబట్టేకదా అన్నింటికీ పంగనామం పెట్టింది. మొహమాటం ఉన్న బాబు గట్టిగా ఏదీ అడగలేకపోయారు. కేంద్రం చెప్పిన ప్రతిదానికీ తల ఊపారు. బీజేపీకి మొహమాటం లేదు కాబట్టే రైల్వే జోన్‌ ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. రాజధాని నిర్మాణానికి, రెవెన్యూ లోటు భర్తీకి ఇంతకుమించి డబ్బులిచ్చేది లేదని మొహం మీదనే చెప్పింది. తనకు భయం లేదని, లాలూచీ పడలేదని చెప్పుకున్న సీఎం ఎన్‌డీఏ నుంచి ఎందుకు బయటకు రావడంలేదు? దీనికి జవాబు ఉండదు. ఇదొక వ్యూహమని చెబుతుంటారు.

కాని దీని వెనక భయమూ, లాలూచీ ఉన్నాయని జనం అనుకుంటున్నారు. ఎన్‌డీఏలోనే ఉంటూ కేంద్రంపై వీరోచితంగా పోరాడుతున్నానని బిల్డప్‌ ఇస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఘోరంగా విఫలమైన బాబు దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఏదేదో మాట్లాడుతున్నారు. తనను ధైర్యవంతుడిగా చిత్రీకరించుకుంటున్నారు. తప్పులన్నీ ఎదుటివారిపై తోసి తాను పులుకడిగిన ముత్యాన్నని ప్రచారం చేసుకుంటున్నారు. చంద్రబాబు నిజంగా ధైర్యవంతుడే అయితే కళ్లనీళ్లు పెట్టుకోవడం ఎందుకు?