cloudfront

Advertisement


Home > Politics - Political News

బాబు మాటలకు అర్థాలు ఏమిటో...!

బాబు మాటలకు అర్థాలు ఏమిటో...!

'ఆడవారి మాటలకు అర్థాలు వేరులే' అనే సామెత తెలిసిందే. అందులోని నిజానిజాల విషయం పక్కన పెడితే రాజకీయ నాయకుల మాటలకు అర్థాలు వేరుగా ఉంటాయనేది కాదనలేని సత్యం. అందులోనూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మాటలకు అర్థాలు వేరుగా ఉండటమే కాకుండా అసలు అర్థంకావు కూడా. గందరగోళంగా మాట్లాడటంలో, మాటలతో ప్రజలను అయోమయంలో పడేయటంలో  సిద్ధహస్తుడు.

చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. నీతి నిజాయితీ, నిబద్ధత లేనివారు ఇంతకుమించి ఏం చేయగలరు? ఏపీలో ప్రత్యేక హోదా పెద్ద రాజకీయాంశంగా, ప్రధాన ఎజెండాగా, సెంటిమెంటుగా మారడంతో ముఖ్యమంత్రి దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఏం చేయాలో పాలుపోవడంలేదు. ప్రత్యేక హోదా సంజీవిని కాదు, దానివల్ల ప్రయోజనం కలగదని ఊదరగొట్టిన సీఎం ఇప్పుడు ప్రత్యేక హోదా పాట పాడుతున్నారు. అయితే ప్రత్యేక హోదా కచ్చితంగా ఇవ్వాల్సిందేనని, అది తప్ప మరేమీ అంగీకరించబోమని గట్టిగా చెప్పడంలేదు.

తాజాగా ఆయన 'ప్రత్యేక హోదా ఇచ్చినా, ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినా ఫర్వాలేదు. హోదాలో ఉన్న అన్ని ప్రయోజనాలూ దక్కాల్సిందే' అన్నారు. ప్రత్యేక హోదా తప్ప ఏదీ అంగీకారం కాదని వైకాపా, ఇతర ప్రతిపక్షాలు ఘోషిస్తుండగా, ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినా ఫర్వాలేదనడం ఏమిటి? మరోపక్క 'ప్రత్యేక హోదాను సెంటిమెంటుగా చేసి ప్రతిపక్ష నేత (జగన్‌) ప్రజలను రెచ్చగొడుతున్నారు' అని మండిపడుతున్నారు.

హోదా కావాలని డిమాండ్‌ చేయడం, దానికోసం ఉద్యమించడం ప్రజలను రెచ్చగొట్టడం ఎలా అవుతుందో అర్థం కావడంలేదు. 'రాష్ట్రానికి ఎలాగైనా న్యాయం జరగకూడదనే దుర్భుద్దితోనే జగన్‌ రాజీనామాల నాటకం ఆడుతున్నాడు' అని విమర్శించారు. ఎంపీలు రాజీనామాలు చేస్తామనడంలో దుర్భుద్ధి ఏముంది? జగన్‌ తన మార్గంలో తాను పోరాటం చేస్తున్నారు అంతే.

వైకాపా ఎంపీలు రాజీనామా చేస్తామంటే ఈయన ఎందుకు ఉలిక్కిపడుతున్నారో తెలియదు. ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికీ ఇవ్వడంలేదని చెబితే ప్యాకేజీకి ఒప్పుకున్నామని బాబు పదే పదే చెబుతున్నారు. హోదా ఇవ్వడానికి తాము అడ్డుపడలేదని పద్నాలుగో ఆర్థిక సంఘం చెప్పిన తరువాత కూడా బాబు కేంద్రాన్ని నిలదీయలేదు. వాస్తవానికి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించింది ప్రత్యేక ప్యాకేజీ కాదు, ప్రత్యేక ఆర్థిక సాయం మాత్రమే.

అందుకే దీనికి ఇప్పటివరకు చట్టబద్ధత కల్పించలేదేమో. దాని విషయంలోనూ బాబు కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేదు. ఇకమీదట ఏ రాష్ట్రానికీ హోదా ఇవ్వబోమని, హోదా పొందుతున్న రాష్ట్రాలకూ బంద్‌ చేస్తామని కేంద్రం చెప్పింది. కాని ఆ గడువు ముగియగానే మరో పదేళ్లపాటు ఆయా రాష్ట్రాలకు 2027 వరకు హోదా పొడిగించింది.

ఈ సంగతి తెలిసినా బాబు ఎందుకు ప్రశ్నించలేదు? ఇప్పుడేమో ప్రత్యేక హోదా ఇతర రాష్ట్రాలకు ఎలా ఇచ్చారు? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. వేరే వాళ్లకు ఇచ్చినప్పుడు మాకూ ఇవ్వాల్సిందేనన్నారు. గతంలోనేమో 'అన్ని రాష్ట్రాల కంటే మనమే ఎక్కువ సాధించాం' అని చెప్పుకున్నారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ఒక్కటేనని బాబు అభిప్రాయం కావొచ్చు. ప్రత్యేక హోదాతో ఏవైతే ప్రయోజనాలు కలుగుతాయో అవన్నీ ప్రత్యేక ప్యాకేజీలో ఇస్తామని కేంద్రం నమ్మబలికినప్పుడు బాబు గుడ్డిగా నమ్మేశారు. ప్రత్యేక ప్యాకేజీ అనకుండా ప్రత్యేక ఆర్థిక సాయమని ఎందుకు పేరు పెట్టారో కూడా అడగలేదు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో పరిశ్రమలు పెట్టినవారిలో తెలుగువారు చాలామంది ఉన్నారు.

అలాంటి ఒక పారిశ్రామికవేత్త ఓ టీవీ చర్చలో మాట్లాడుతూ ప్రత్యేక హోదాతో వచ్చే ప్రయోజనాలు ప్రత్యేక ఆర్థిక సాయం వల్ల రావన్నారు. ప్రత్యేక ఆర్థిక సాయం 'వన్‌ టైమ్‌ బెనిఫిట్‌' మాత్రమేనని, ప్రత్యేక హోదా ఇస్తే దాని కింద వచ్చే ప్రయోజనాలు కొన్నేళ్లపాటు నిరంతరం కొనసాగుతాయని చెప్పారు. హోదా ఉంటేనే పరిశ్రమలు వస్తాయన్నారు. ప్రత్యేక హోదా పొందుతున్న రాష్ట్రాల్లో పరిశ్రమలు బాగా వచ్చాయని, తద్వారా లక్షలాదిమందికి ఉపాధి, ఉద్యోగాలు దొరికాయని ఆ పారిశ్రామికవేత్త చెప్పారు.

దీన్నిబట్టి చూస్తూ ప్రత్యేక హోదాను, ప్రత్యేక ప్యాకేజీని గురించి బాబు అధ్యయనం చేయలేదని అర్థమవుతోంది. చివరకు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఏదేదో మాట్లాడుతున్నారు. ఇదే అదనుగా బీజేపీ నేతలు గతంలో బాబు కేంద్ర సాయంపై పాజిటివ్‌గా చేసిన ప్రకటనలను, అసెంబ్లీలో ప్రసంగాలను బయటపెట్టి 'ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు' అని గట్టిగా నిలదీస్తున్నా  సమాధానం చెప్పే స్థితిలో ముఖ్యమంత్రి లేరు.