cloudfront

Advertisement


Home > Politics - Political News

బాబు పుట్టింటికి వెళ్లడం కూడా త‌ప్పేనా?

బాబు పుట్టింటికి వెళ్లడం కూడా త‌ప్పేనా?

టీడీపీ అధినేత‌, సీఎం చంద్రబాబునాయుడు పుట్టింటికి వెళ్లడం కూడా త‌ప్పైంది. పుట్టింటి వారికి ఆప‌న్నహ‌స్తం అందిస్తే ప్రతిప‌క్షాలు నానాయాగీ చేస్తున్నాయి. ఇదెక్కడి గోల‌. ఏపీలో చంద్రబాబును ప్రతి ఒక్కరూ విమ‌ర్శించేవారే. ప్చ్‌... పెద్దాచిన్నా లేకుండా కాంగ్రెస్‌కు టీడీపీని బాబు తాక‌ట్టు పెట్టారంటారా? 68ఏళ్ల  జీవితంలో 40ఏళ్ల బాబు రాజ‌కీయంలో తాళిక‌ట్టడం త‌ప్ప తాక‌ట్టు అనేమాటే ఎన్నడూ విన‌లేదు, క‌న‌లేదు. అస‌లు కాంగ్రెస్‌తో లాలూచా? క‌ల‌లో కూడా అలాంటివి వాటికి చోటులేదు. కేవ‌లం సాక్షి పేప‌ర్లో, చాన‌ల్‌లోనే బాబూ లాలూచీల‌కు చోటు.

చిత్తూరుజిల్లా చంద్రగిరి నియోజ‌క‌వ‌ర్గంలోని నారావారిప‌ల్లెలో చంద్రబాబు జ‌న్మించారు. విద్యార్థి ద‌శ నుంచే అత‌నికి రాజ‌కీయాల‌పై ఆస‌క్తి, కాలేజీ విద్య చ‌దివే రోజుల్లో యువ‌జ‌న కాంగ్రెస్‌లో కీల‌కంగా వ్యవ‌హ‌రించేవారు. ఎస్వీ యూనివ‌ర్సిటీ విశ్వ విద్యాల‌యం అత‌నిలోని రాజ‌కీయ నాయ‌కుడిని రాటుదేల్చింది. 1978లో యువ‌త‌కు 20శాతం సీట్లు కేటాయించాల‌ని నిర్ణయం తీసుకోవ‌డంతో చంద్రగిరి అసెంబ్లీ టికెట్ చంద్రబాబుకు ద‌క్కింది. 28 ఏళ్లలో ఎమ్మెల్యేగా ఎన్నికైన బాబు, ఆ త‌ర్వాత అంజ‌య్య కేబినెట్‌లో ప‌లు మంత్రిత్వశాఖ‌ల బాధ్యత‌లు స‌మ‌ర్థవంతంగా నిర్వర్తించారు. 1982లో సొంత మామ ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినా వెళ్లలేదు. 1983లో చంద్రగిరి నుంచి కాంగ్రెస్ త‌ర‌పున పోటీచేసి టీడీపీ చేతిలో ఓట‌మి పాల‌య్యారు.

ఎన్టీఆర్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొన్ని నెల‌ల‌కే మామ పంచ‌న చేరారు. టీడీపీని క్షేత్రస్థాయిలో బ‌లోపేతం చేస్తూ, తానూ పార్టీలో బ‌ల‌ప‌డుతూ ప్రత్యేక వ‌ర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. జాతీయ‌స్థాయిలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ సార‌ధ్యంలో నేష‌న‌ల్ ఫ్రంట్ ఏర్పాటు చేశారు. తెలుగ‌వారి ఆత్మగౌర‌వం నినాదంతో ఇందిరాగాంధీకే చెమ‌ట‌లు ప‌ట్టించారు. అలాంటి ఎన్టీఆర్‌ను గ‌ద్దెదింపి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన చంద్రబాబు అసామాన్యుడ‌ని పేరు తెచ్చుకున్నారు. గిట్టని వారు ద్రోహి, వంచ‌కుడు, వెన్నుపోటుదారుడ‌ని విమ‌ర్శిస్తారు.

2004లో అధికారం కోల్పోయిన‌ప్పటికీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్సార్‌ను ప్రతిప‌క్ష నేత‌గా స‌మ‌ర్థవంతంగా ఎదుర్కొన్నారు. అయినా ప్రజ‌లు 2009లో కూడా బాబును న‌మ్మలేదు. అనంత‌ర కాలంలో వైఎస్సార్ మ‌ర‌ణం రాష్ర్టంలో అనేక విప‌త్కర ప‌రిస్థితుల‌కు దారితీసింది. సీఎం కిర‌ణ్‌కుమార్‌రెడ్డిని కాపాడేందుకు ప్రతిప‌క్షంలో ఉన్న టీడీపీ అండ‌గా నిలిచింది. మ‌నకోసం సిద్ధాంతాలే త‌ప్ప‌.. వాటి కోసం మ‌నం కాద‌నేది చంద్రబాబు ఫిలాస‌పీ.

2014లో విభ‌జిత ఆంధ్రప్రదేశ్‌కు మొట్టమొద‌టి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టారు. బీజేపీతో వ్యవ‌హారం చెడ‌టంతో యూపీఏ మిత్రప‌క్షాల‌కు ఆయ‌న చేరువ‌య్యారు. క‌ర్నాట‌క ముఖ్యమంత్రిగా కుమార‌స్వామి ప్రమాణ స్వీకారంలో కాంగ్రెస్ అధినేత రాహుల్‌, చంద్రబాబు చేతులు, మ‌న‌సులు క‌లిశాయి. పాత‌రోజులను రాహుల్‌కు చెప్పార‌ట‌. ఆ బంధం రోజురోజుకూ బ‌ల‌ప‌డుతూ వ‌చ్చింది. నిన్నటికి నిన్న రాజ్యస‌భ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక‌లో కాంగ్రెస్ అభ్యర్థికి టీడీపీ మ‌ద్దతు తెలిపింది.

దీన్ని రాద్ధాంతం చేయ‌డం త‌గునా? అవును, కాంగ్రెస్ పార్టీ బాబుకు మాతృసంస్థ‌. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీ ఆవిర్భవించ‌డం నిజ‌మే. కాని టీడీపీ పుట్టే నాటికి ఆయ‌న‌ కాంగ్రెస్‌లోనే ఉన్నారు. అలాంట‌ప్పుడు టీడీపీ సిద్ధాంతాల‌తో బాబుకు ఏంటి సంబంధం. ఇప్పుడు చంద్రబాబు సిద్ధాంతాల‌తో టీడీపీ న‌డుస్తోంది. అందుకే కాంగ్రెస్‌కు ద‌గ్గరైంది. ఇదంతా విన్న త‌ర్వాత కూడా చంద్రబాబును విమ‌ర్శిస్తే.. చెప్పను, చేసి చూపిస్తా. అంతే మ‌రి.
-సొదుం