Advertisement

Advertisement


Home > Politics - Political News

బాబు రాజ‌కీయ అస్త‌మ‌యానికి వేళైంది...

బాబు రాజ‌కీయ అస్త‌మ‌యానికి వేళైంది...

కొన్ని నెల‌లుగా యావ‌త్ ప్ర‌చంచాన్ని క‌రోనా వైర‌స్ అనే మ‌హ‌మ్మారి వ‌ణికిస్తోంది. కంటికి క‌నిపించ‌ని ఆ వైరస్ చైనాలో పుట్టి...లోక‌మంతా చుట్టేస్తూ క‌కావిక‌లం చేస్తోంది. ఆ వైర‌స్ ఆగ‌డాల‌ను అరిక‌ట్టేందుకు ఇంత వ‌ర‌కూ వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో జ‌నాలు పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు ఛిన్నాభిన్నం అయ్యాయి, అవుతున్నాయి. క‌రోనా మ‌హ‌మ్మారి సృష్టించిన విధ్వంసం అంతాఇంతా కాదు.

క‌రోనా ల‌క్ష‌ణాల‌ను బ‌ట్టి వెంట‌నే వైద్య ప‌రీక్ష‌ల‌కు వెళ్లి త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం ఒక్క‌టే మాన‌వ స‌మాజానికి ఉన్న ఏకైక ప్ర‌త్యామ్నాయం. జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రం, ఒళ్లు నొప్పులు...క‌రోనా ల‌క్ష‌ణాల‌ని మొద‌ట్లో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డించింది. ఆ త‌ర్వాత దాని ల‌క్ష‌ణాలు మ‌రిన్ని బ‌య‌ట‌ప‌డ్డాయి. వాంతులు, విరేచ‌నాలు, రుచి, వాస‌న తెలియ‌క పోవ‌డం కూడా క‌రోనా ల‌క్ష‌ణాల‌ని తేల్చి చెప్పారు. దీంతో ఆ ల‌క్ష‌ణాలు క‌నిపించిన వాళ్లంతా పోలోమ‌ని ఆస్ప‌త్రిబాట ప‌ట్ట‌డం చూస్తున్నాం. మ‌రి కొంద‌ర్లో ఎలాంటి ల‌క్ష‌ణాలు లేకుండా క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అవుతూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

ఈ క‌రోనా ల‌క్ష‌ణాల‌కు, టీడీపీ అధినేత చంద్ర‌బాబు రాజ‌కీయ అస్త‌మ‌యానికి ద‌గ్గ‌రి పోలిక‌లు క‌నిపిస్తున్నాయి. ఇప్పుడాయ‌న  70 ఏళ్ల మార్క్‌ను దాటారు. ఇటీవ‌ల త‌నే త‌న వ‌య‌స్సు, ఆరోగ్యం గురించి ప్ర‌స్తావించారు. ఇక మ‌హా అయితే ఆరోగ్యం బాగుంటే ప‌దేళ్లు రాజ‌కీయాల్లో ఉంటాన‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. కానీ ఆయ‌న‌లో వ‌య‌స్సుతో పెరిగిన చాద‌స్తం, ఓట‌మి క‌లిగించిన నైరాశ్యం...ఏం మాట్లాడుతున్నారో త‌న‌కే తెలియ‌డం లేదు.

పైపెచ్చు పార్టీ అధినాయ‌కుడిగా చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు ఆయ‌న్ను అభాసుపాలు చేస్తున్నాయి. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం, పాల‌నానుభ‌వం ఉన్న చంద్ర‌బాబేనా ఇలా మాట్లాడేద‌నే అనుమానం, జాలి క‌లిగిస్తున్నాయి. బాబుకు ఆయ‌న పార్టీలోని బుడ్డా వెంక‌న్న‌కు ఏమంత పెద్ద తేడా క‌నిపించ‌డం లేదు. ఎమ్మెల్సీ వెంక‌న్న కూడా ప్ర‌తిరోజూ ఓ ఉద్యోగంలా వైసీపీ నేత‌ల‌కు ట్విట‌ర్‌లో కౌంట‌ర్లు ఇస్తుంటారు.

బాబు విష‌యానికి వ‌స్తే మూడు రోజుల క్రితం హైద‌రాబాద్ నుంచి జూమ్‌లో మీడియా మాట్లాడుతూ జ‌నం స‌ర్కార్ అసెంబ్లీ ర‌ద్దుకు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాన‌ని డెడ్‌లైన్ విధించారు. మూడు రాజ‌ధానుల‌పై ప్ర‌జాభిప్రాయం కోరాల‌ని, ఒక‌వేళ తిరిగి జ‌గ‌న్‌నే ఎన్నుకుంటే త‌న‌కెలాంటి అభ్యంత‌రం లేద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌న స‌వాల్‌ను స్వీక‌రిస్తే స‌రేస‌రి అని, లేనిప‌క్షంలో మ‌ళ్లీ తాను మీడియా ముందుకు వ‌స్తాన‌ని ప్ర‌క‌టించారు.

మ‌ళ్లీ ఆయ‌న బుధ‌వారం సాయంత్రం తిరిగి మీడియా ముందుకొచ్చారు. జ‌గ‌న్ స‌వాల్‌ను స్వీక‌రించ‌ని నేప‌థ్యంలో చంద్ర‌బాబే రాజీనామాల బాట ప‌డుతారేమోన‌ని అంద‌రూ ఊహించారు, ఆశించారు. అబ్బే అలాంటిదేమీ లేదు. మ‌ళ్లీ జ‌గ‌న్‌కు తానొక బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. అమ‌రావ‌తిలోనే రాజ‌ధాని కొన‌సాగిస్తే...త‌మ సభ్యులు రాజీనామాలు చేస్తార‌ట‌...త‌మ‌కు ఏ ప‌ద‌వులు వ‌ద్ద‌ట‌.

ఈ మాట‌లు సిల్లీగా అనిపించ‌లేదా? ఇదేమైనా చిన్న‌పిల్ల‌లు ఆడుకునే ఆటా?  నువ్వు నేను చెప్పిన‌ట్టు చేస్తే 5 స్టార్ చాక్లెట్ ఇస్తాన‌ని, అవిఇవి ఇస్తాన‌ని చిన్న పిల్ల‌లకు ఆశ పెడుతుంటారు. అలాగుంది జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు ఇచ్చిన ఆఫ‌ర్‌. 40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం నేర్పింది, నేర్పుతున్న‌ది ఇదా? 14 ఏళ్ల పాటు ముఖ్య‌మంత్రి హోదా ఇచ్చిన ప్ర‌జానీకం కోసం చంద్ర‌బాబు ఏమీ చేయ‌రా?

ప్ర‌జ‌ల కోసం క‌నీసం ఇప్పుడైనా రాజీనామా చేయాల‌నిపించ‌లేదా? ఎంత సేపూ త్యాగాలు ఇత‌రుల‌వి, హోదాలు మాత్రం త‌మ‌రికా? ఇలాంటి అతి తెలివి తేట‌లు, మ‌భ్య పెట్ట‌డాల‌కు కాలం చెల్లింద‌నే విష‌యాన్ని చంద్ర‌బాబు మ‌రిచిపోయారా?

బుధ‌వారం చంద్ర‌బాబు మాట‌ల‌ను చూస్తే ఆయ‌న‌లో స్ప‌ష్టంగా రాజ‌కీయ అస్త‌మ‌య ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. మాట‌ల్లో ప‌స లేదు. బీజేపీని ప్ర‌శ్నించ‌డానికి ద‌మ్ము లేదు. మ‌రోవైపు బీజేపీ మాత్రం టీడీపీని క‌బ‌ళించేందుకు క‌రోనాలా ఉధృతంగా దూసుకొస్తోంది. 2024 టార్గెట్‌తో టీడీపీని ధ్వంసం చేసి, ఆ ఓటు బ్యాంకును త‌న‌వైపు తిప్పుకునే స్ప‌ష్ట‌మైన అజెండాతో క‌త్తి ప‌ట్టి స‌వాల్ విసురుతున్నా...బాబుకు నోరు మెద‌ప‌లేని స్థితి. అస‌లు ఆయ‌న‌కు భ‌య‌మెందుకో అర్థం కావ‌డం లేదు.

రాజ‌కీయాల్లో హీరోయిజాన్ని మాత్ర‌మే ప్ర‌జ‌లు గౌర‌విస్తారు, ఆద‌రిస్తారు. ఈ వేళ జ‌గ‌న్‌లో వాటిని చూడ‌డం వ‌ల్లే ఆయ‌న‌పై ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా అక్కున చేర్చుకున్నార‌నే విష‌యాన్ని మ‌రిచిపోవ‌ద్దు. బాబులో మునుప‌టి ప్ర‌శ్నించే, నిల‌దీసే త‌త్వం చ‌చ్చి పోయింది. బాబు రాజ‌కీయ చ‌తుర‌త‌, ఎత్తుగ‌డ‌ల‌న్నీ గ‌త వైభ‌వ‌మే. అంతేకాదు, కుట్ర‌ల‌కు కూడా కాలం చెల్లింది. ప్ర‌తి అంశాన్ని క్షుణ్ణంగా ప‌రిశీలించి ప‌ట్టుకునే సాంకేతిక‌త అభివృద్ధి చెందిన ద‌శ‌లో  బాబు నిస్స‌హాయుడు కావ‌డం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

భ‌విష్య‌త్ రాజ‌కీయం ఆశాజ‌న‌కంగా క‌నిపించడం లేదు. రాజకీయ చ‌ర‌మాంకంలో ఉన్న చంద్ర‌బాబు నైజం అందరికీ తెలు సొచ్చింది. ఎవ‌రూ న‌మ్మ‌లేని ప‌రిస్థితి. బ‌హుశా దేశ రాజ‌కీయాల్లో ఇలాంటి దుస్థితి మ‌రే ఇత‌ర నాయ‌కుల‌కు వ‌చ్చి ఉండ‌దేమో. బీజేపీ-జ‌న‌సేన మూడో ప్ర‌త్యామ్నాయమంటూ టీడీపీ, వైసీపీల‌కు దూర‌మ‌ని ఇప్ప‌టికే స్ప‌ష్టంగా ప్ర‌క‌టించాయి.

ఈ స్థితిలో పొంత‌న లేని స‌వాళ్లు, ఆఫ‌ర్లు అంటూ నేల‌బారు రాజ‌కీయ ప్ర‌క‌ట‌న‌లే బాబు రాజ‌కీయ అస్త‌మ‌య ల‌క్ష‌ణాలు. మ‌నిషి ప‌త‌నానికి భ‌యం పునాది వేస్తుంది.  చంద్ర‌బాబులో గూడు క‌ట్టుకున్న భ‌య‌మే ఆయ‌న‌ రాజ‌కీయ అస్త‌మ‌యానికి బీజం వేసింది. మ‌రోవైపు ఇక బాబు ప‌నై పోయింద‌నే భావ‌న ప్ర‌జ‌ల్లోకి బాగా వెళ్లిపోతోంది. ఒక్క‌సారి ప్ర‌జ‌ల్లో నాయ‌క‌త్వంపై అప‌న‌మ్మ‌కం ఏర్ప‌డితే, తిరిగి సాధించుకోవడం అసాధ్యం.

చంద్ర‌బాబు విష‌యంలో ఇప్పుడ‌దే జ‌రుగుతోంది. బాబు త‌న అస‌మ‌ర్థ‌త‌, నిస్స‌హాయ‌త‌, భ‌యం వ‌ల్ల బీజేపీ -జ‌న‌సేన కూట‌మి బ‌లోపేతానికి పునాది వేస్తున్న‌ట్టైంది. గ‌త మోస‌పూరిత అనుభ‌వాల దృష్ట్యా చంద్ర‌బాబును కాదు క‌దా, ఆయన నీడ‌ను కూడా న‌మ్మే ప‌రిస్థితిలో బీజేపీ లేదు. దీనికి సోము వీర్రాజు విమ‌ర్శ‌లే నిద‌ర్శ‌నం. చంద్ర‌బాబు తానొక్క‌డిగా జ‌గ‌న్‌ను నిలువ‌రించ‌డం అసాధ్య‌మ‌నే నిర్ణ‌యానికి వ‌చ్చారు.

మ‌రోవైపు ఆయ‌న సుపుత్రుడు లోకేశ్ ప్ర‌తిభ కూడా బాబు మ‌నో వ్య‌థ‌కు కార‌ణ‌మ‌ని విశ్లేష‌కుల అభిప్రాయం. ఇలా ఏ ర‌కంగా చూసినా బాబుకు రాజ‌కీయ భ‌విష్య‌త్ క‌నుచూపు మేర‌లో క‌నిపించ‌డం లేదు. ఆ ఒత్తిడే బాబుతో మ‌తిస్థిమితం లేని మాట‌లు మాట్లాడిస్తూ అభాసుపాలు చేయిస్తోంది. పాపం బాబు.

ఇలా చేస్తే కరోనా రాదు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?