Advertisement


Home > Politics - Political News
చీకటి రాజకీయం.. అర్థరాత్రి నిర్ణయాలు

ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నిర్ణయాలు, అనుసరిస్తున్న వైఖరి సమస్తం చీకటిలోనే జరిగింది. హోదాకు సంబంధించి మొదట్నుంచి చంద్రబాబు చీకటి రాజకీయం చేస్తూనే ఉన్నారు. గత ఎన్నికల సమయంలో రాష్ట్ర విభజన జరిగే ప్రాసెస్ లో రెండు కళ్ల సిద్ధాంతం అంటూ ఏపీ ప్రజల్ని నట్టేట ముంచారు. ఆ నిర్ణయం కూడా అర్థరాత్రి తీసుకున్నదే. విభజనకు అనుకూలంగా మద్దతు తెలుపుతూనే, ఏపీ, తెలంగాణ రెండు కళ్లంటూ అప్పట్లో చంద్రబాబు రెండు రాష్ట్రాల ప్రజల కళ్లుపొడిచారు. అప్పటి రాజకీయం ఇప్పటికీ చాలామందికి గుర్తే.

రాష్ట్రం విడిపోయి, ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత తన మార్క్ రాజకీయాలకు మరింత పదునుపెట్టారు చంద్రబాబు. మరీ ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో బాబు అనుసరించిన విధానం చూస్తే సిగ్గుతో తలదించుకోవాలి. ప్రత్యేక హోదా కావాలంటూ డిమాండ్ చేసిన బాబు, ప్రత్యేక ప్యాకేజీ పేరెత్తగానే సైలెంట్ అయిపోయారు. ప్యాకేజీ అనే పదం దేశం నేతలకు కమ్మగా అనిపించింది. వెంటనే అర్థరాత్రి రాజకీయాలు షురూ అయిపోయాయి.

రాత్రికి రాత్రి ప్రెస్ మీట్లు పెట్టి ప్యాకేజీ సూపర్ అనేశారు. హోదా కంటే ప్యాకేజీనే ఏపీకి అవసరం అంటూ బుకాయించారు. దానికి అప్పట్లో అనుకూల మీడియా భారీగా ప్రచారం కూడా తెచ్చిపెట్టింది. ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి మరీ జైట్లీకి శాలువా కప్పి వచ్చారు బాబు.

ప్యాకేజీలతో ఈ నాలుగేళ్లు బాగానే పబ్బం గడిపారు దేశం నేతలు. ఇప్పుడు ఎన్నికలు తరుముకొస్తున్న వేళ, మరోసారి చీకటి రాజకీయాలకు తెరదీశారు. రాత్రికి రాత్రి ప్యాకేజీ పనిచేయలేదంటూ కొత్త రాగం అందుకున్నారు. ఇలా 3రోజులు గడిచాయి. మరో అర్థరాత్రి మరో నిర్ణయం. ప్రత్యేక హోదానే కావాలంటూ నినాదం. ఇక్కడ కూడా అనుకూల మీడియా బాబును వెనకేసుకొచ్చింది తప్ప కనీసం కారణాలు అగడలేదు.

అంతెందుకు.. మొన్నటికి మొన్న పార్లమెంట్ లో అవిశ్వాసం పెట్టాలనే నిర్ణయాన్ని కూడా చంద్రబాబు అర్థరాత్రి తీసుకున్నారు. నిద్రలేచిన వెంటనే మాటమార్చారు. కేవలం ప్రత్యేక హోదాపైన మాత్రమే కాదు, రాష్ట్రానికి కీడు చేసే ఎన్నో "కీలక" నిర్ణయాల్ని చంద్రబాబు రాత్రి 12తర్వాతే తీసుకుంటారు. తను రోజుకు 20గంటలు పనిచేస్తానని చెప్పుకునేది ఇందుకేనేమో.

ప్రస్తుతం హోదాపై పిల్లిమొగ్గలు వేస్తున్న చంద్రబాబు.. ఏ అర్థరాత్రి ఎలా మారిపోతారో అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయపడి చస్తున్నారు. తెల్లారితే బాబు నుంచి ఎలాంటి ప్రకటన వినాల్సి వస్తుందోనని టెన్షన్ తో నిద్రలేస్తున్నారు.