cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

కుప్పంలో ఓడిపోయాం కానీ.. బాబు ఆక్రోషం

కుప్పంలో ఓడిపోయాం కానీ.. బాబు ఆక్రోషం

పంచాయతీ ఎన్నికల్లో చంద్రబాబుకి తన సొంత నియోజకవర్గంలో ఎదురైన పరాభవంతో మీడియాకు దూరంగా ఉంటారేమోనని అనుకున్నారంతా. కానీ అసహ్యాన్ని సైతం జయించిన బాబు.. మూడో విడత పంచాయతీ ఎన్నికలపై కూడా ప్రెస్ మీట్ పెట్టి అనర్గళంగా మాట్లాడేశారు. 

ఎన్నికల్లో అన్యాయాలు జరిగాయని, అక్రమాలతో వైసీపీ బలపరచిన అభ్యర్థులు గెలిచారని, అర్థరాత్రి వరకు కౌంటింగ్ జరిపి తమకు అనుకూలంగా ఫలితాలు తారుమారు చేశారని అన్నారు. మూడో విడతలో కూడా టీడీపీ జోరు కనిపించిందని, వైసీపీ పతనానికి ఇదే నాంది అనే పడిగట్టు డైలాగ్ ని మాత్రం మిస్ చేయలేదు చంద్రబాబు.

కుప్పంలో వైసీపీ గెలవలేదట..?

మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో వచ్చిన ఫలితాలు హాట్ టాపిక్ గా మారాయి. ఏకగ్రీవాలు పోను 89 పంచాయతీలకు ఎన్నికలు జరగగా.. 74 స్థానాల్లో వైసీపీ బలపరచిన అభ్యర్థులు గెలవడం టీడీపీకి పెద్ద షాక్.

మూడు దఫాలు ముఖ్యమంత్రి మరో మూడు దఫాలు ప్రతిపక్షనేత అంటూ చెప్పుకునే చంద్రబాబు.. తన సొంత నియోజకవర్గంలో సైతం అభ్యర్థుల్ని గెలిపించుకోలేకపోయారంటే అది సిగ్గుచేటని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఇదే విషయాన్ని గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తూ.. కుప్పం నియోజకవర్గానికి ప్రత్యామ్నాయం వెతుక్కోమంటూ చంద్రబాబుపై సెటైర్లు వేస్తున్నారు. దీంతో కుప్పం టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది.

అయితే చంద్రబాబు మాత్రం కుప్పంలో వైసీపీ విజయానికి తనదైన లాజిక్ చెప్పారు. కుప్పంలో వైసీపీ విజయాన్ని పరోక్షంగా ఒప్పుకుంటూనే.. అక్కడ ఆ పార్టీ గెలవలేదని, ప్రజాస్వామ్యం ఓడిపోయిందని సినిమా డైలాగులు కొట్టారు. కాకి లెక్కలు చెప్పే బాబు.. కుప్పంలో సగానికి సగం స్థానాలు గెలిచామని చెప్పుకునే సాహసం మాత్రం చేయలేదు. ఎలాగూ రాష్ట్రవ్యాప్తంగా తప్పుడు లెక్కలే చెబుతున్నాం కదా.. కుప్పాన్ని కూడా శృతిలో కలిపేద్దామనుకోలేదు.

కుప్పంలో తమ ఓటమిని ఒప్పుకుంటూనే.. వైసీపీ విజయాన్ని మాత్రం గుర్తించలేదంటున్నారు. మంచివారు, నీతి, నిజాయితీతో కూడినవారు ఉండే కుప్పం నియోజకవర్గాన్ని వైసీపీ కలుషితం చేసిందని అక్కసు వెళ్లగక్కారు.

ఈసీ కొరడా ఏమైంది..?

ఇటీవల తరచూ ఎన్నికల కమిషన్ పై ఫిర్యాదులు చేస్తున్న చంద్రబాబు.. మూడో విడతలో కూడా ఎన్నికల నిర్వహణలో ఈసీ విఫలం అయిందని విమర్శించారు. ఓవైపు ఎస్ఈసీ నిమ్మగడ్డ మూడో విడత ప్రశాంతంగా ముగిశాయని సర్టిఫికెట్ ఇస్తుంటే.. బాబు మాత్రం అదంతా వారి వైఫల్యమేనని తేల్చి చెబుతున్నారు. 

ఎన్నికల కమిషన్ కొరడా ఏమైంది..? వారికి పవర్ లేదా? బలవంతపు ఏకగ్రీవాలపై ఏం చెబుతారంటూ ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ కి విస్తృత అధికారాలున్నాయంటూ కోర్టు చెప్పినా కూడా ఈసీ నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తోందని, అందుకే వైసీపీ అరాచకం చేస్తోందని మండిపడ్డారు.

పురపోరులో కూడా విజయం మాదే..

పంచాయతీ ఎన్నికలకే దిక్కులేదు కానీ, త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం టీడీపీ విజయ భేరి మోగిస్తుందని ఘంటాపథంగా చెప్పారు చంద్రబాబు. అయితే ఇక్కడ ఆయన ఓ లాజిక్ కూడా చెప్పారు. పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ అర్థరాత్రి వరకు జరుగుతుందని, అదే మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ డే టైమ్ లో జరుగుతుందని, అందుకే తాము ఈజీగా గెలిచిపోతామన్నారు.

ఇప్పటికీ  ఆత్మ విమర్శ చేసుకోకుండా.. చెత్త లాజిక్ లు వెదుకుతున్న చంద్రబాబు, ఇక ఎప్పటికీ పార్టీని గాడిలో పెట్టలేరనే విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. 

కుప్పంలో టీడీపీ 14 స్థానాల‌కే ప‌రిమిత‌మైంది

ఎవరి సత్తా ఏమిటో తెలిసే రోజులొస్తున్నాయ్

 


×