ప్రధాని నరేంద్ర మోడీపై మాటల తూటాలు పేలాయి.. అదీ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమక్షంలో. ఇంకెవరో ఈ మాటల తూటాలు పేల్చితే అదొక లెక్క. కానీ, ఇక్కడ పేల్చింది 'షాట్ గన్'. ప్రముఖ బాలీవుడ్ నటుడు శతృఘన్ సిన్హా, భారతీయ జనతా పార్టీ నుంచి పార్లమెంటు సభ్యుడిగా ప్రాతినిథ్యం వహిస్తున్నా, ప్రధాని నరేంద్ర మోడీకి పక్కలో బల్లెంలా తయారైన విషయం విదితమే.
ఢిల్లీలో చంద్రబాబు చేపట్టిన ధర్మ పోరాట దీక్షలో హైలైట్‌గా నిలిచింది శతృఘన్ సిన్హానే అని నిస్సందేహంగా చెప్పొచ్చు. తాను ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున నిలబడ్తానంటూ నినదించిన శతృఘన్, హామీలు ఇచ్చి విస్మరించేవాడు అసలు నాయకుడే కాదని నరేంద్ర మోడీపై డైరెక్ట్‌గానే ఎటాక్ చేయడం గమనార్హం. శతృఘన్ సిన్హాకి టాలీవుడ్‌తో సన్నిహిత సంబంధాలే వున్నాయి. అన్నట్టు, వర్మ రూపొందించిన 'రక్తచరిత్ర' సినిమాలో స్వర్గీయ ఎన్టీఆర్ పాత్రలో ఆయన నటించిన విషయం విదితమే.
శతృఘన్ సిన్హా తన ప్రసంగం చివర్లో 'జై ఆంధ్రప్రదేశ్' అని నినదించారు. శతృఘన్, మోడీపై విమర్శలు చేస్తున్నంతసేపూ, తెలుగు తమ్ముళ్ళు పట్టలేని ఆనందంతో ఊగిపోయారు. మరోపక్క, బీజేపీ నేతలు శతృఘన్ సిన్హా, చంద్రబాబు దీక్షకు సంఘీభావం తెలపడంపై నోరు మెదపలేకపోతుండడం గమనార్హం. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధానులు మన్మోహన్సింగ్, దేవెగౌడ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఇలా చాలామంది రాజకీయ ప్రముఖుల్ని తెలుగుదేశం పార్టీ బాగానే 'సమీకరించింది' చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష కోసం.
సాధారణ ప్రజానీకాన్ని ప్రత్యేక రైళ్ళలో తరలించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ముఖ్యమైన నేతలకి మాత్రం ప్రత్యేక లాంఛనాలతో ఢిల్లీకి తీసుకెళ్ళారు. అక్కడ వారికి దక్కిన వీఐపీ ట్రీట్మెంట్ గురించి రాజకీయ వర్గాల్లో అంతా కథలు కథలుగా చర్చించుకుంటుండడం గమనార్హం.