cloudfront

Advertisement


Home > Politics - Political News

బాబుని వెంటాడిన ఫ్రైడే

బాబుని వెంటాడిన ఫ్రైడే

వైఎస్ జగన్ కి ప్రతి శుక్రవారం కోర్ట్ డే.. మాకు మాత్రం ప్రతి శుక్రవారం ప్రాజెక్ట్ డే అంటూ వెటకారంగా మాట్లాడిన చంద్రబాబు అండ్ కో ని ఇప్పుడా ఫ్రైడే సెంటిమెంటే వెంటాడింది. కోర్టు మెట్లెక్కాల్సిందిగా చంద్రబాబుకి అందిన నాన్-బెయిలబుల్ వారెంట్లో డెడ్ లైన్ కూడా శుక్రవారమే. ఈనెల 21లోగా చంద్రబాబుతో పాటు మిగతా 14మంది కూడా కోర్టుకు హాజరు కావాలంటూ మహారాష్ట్రలోని ధర్మాబాద్ మెజిస్ట్రేట్ కోర్ట్ వారెంట్ జారీ చేసింది. 

అయితే ఊహించినట్టుగానే టీడీపీ నేతలు, వారి అనుకూల మీడియా ఈ వారెంట్లను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. తెలంగాణ కోసం చంద్రబాబు చేసిన పోరాటానికి ఇదా ప్రతిఫలం అంటూ మీడియా ముందుకొచ్చారు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. ఎనిమిదేళ్ల కిందటి బాబ్లీ ప్రాజెక్టు కేసుకి ఇప్పుడు వారెంట్లు ఇవ్వడం రాజకీయ కుట్ర అని అన్నారు. అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. 

పనిలో పనిగా తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడ్డాయి కాబట్టి.. తెలంగాణ కోసమే బాబ్లీ ప్రాజెక్ట్ కి వ్యతిరేకంగా చంద్రబాబు అప్పట్లో ఈ పోరాటం చేశారని గుర్తు చేస్తున్నారు నేతలు. అలా తెలంగాణలో మైలేజీ కోసం ఈ నాన్-బెయిలబుల్ వారెంట్ ను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

"ఇక్కడెవరో నన్ను పూలచొక్కా అన్నారు, లెక్చరర్ నాకు సారీ చెప్పాలి"అంటూ ఏదో సినిమాలో సునీల్ అన్నట్టు.. తనకు సంబంధం లేని ఈ వ్యవహారంలో కేసీఆర్ స్పందించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మొత్తమ్మీద బాబు ఫ్రైడే కల ఇలా నెరవేరింది. వారానికోసారి జగన్ కోర్టు మెట్లెక్కుతున్నారంటూ వెక్కిరించిన చంద్రబాబుకి ఈనెల 21 ఫ్రైడే లోగా కోర్టుకి హాజరు కావడం తప్పనిసరి. 

ఈలోగా బాబు టీమ్ ఎన్ని ఏసాలు వేస్తుందో.. ఎంత మొసలి కన్నీరు కారుస్తుందో.. ఎంతమందిపై ఈ నెపం నెట్టాలని చూస్తుందో.. ఊహలకు అందడం కష్టమే.