cloudfront

Advertisement


Home > Politics - Political News

బాబు సింగపూర్.. పవన్ ఇజ్రాయెల్

బాబు సింగపూర్.. పవన్ ఇజ్రాయెల్

సింగపూర్ టెక్నాలజీ అంటూ చంద్రబాబు ఇన్నాళ్లూ ఆంధ్రా ప్రజల చెవుల్లో పూలు పెడుతూ వచ్చారు. ఇప్పుడు అవే చెవుల్లో ఇజ్రాయెల్ పూలు పూస్తున్నాయి. అయితే ఈ పూలు పెట్టేది మాత్రం జనసేనాని పవన్ కల్యాణ్. అనంతపురం జిల్లా కరువు అధ్యయనంలో భాగంగా ఆయన ఓ థీసీస్ రెడీ చేశారు. దాని ప్రకారం అనంతపురంలో పంటలు పండించాలంటే ఇండియా టెక్నాలజీ పనికిరాదన్నమాట. ఇజ్రాయెల్ టెక్నాలజీ వాడితేకానీ ఈ జిల్లా నుంచి కరువుని పారదోలలేమని డిసైడ్ చేశారు పవన్.

"ఇజ్రాయెల్ లో నేలసారం ఉండదు అయినా వారు టెక్నాలజీ వినియోగించుకుని కరువుని జయించారు. వెయ్యి గజాల్లో నలుగురికి సరిపడా ఆహారం పండిస్తున్నారు. అదేతరహా టెక్నాలజీతో ఇక్కడ తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఆర్జించే అవకాశాలున్నాయి" అని అన్నారు. పవన్ కి సలహాలిచ్చేవారు ఎవరో, ఎక్కడుంటారో తెలియదు కానీ ఆయన నోరు విప్పితే అంతా సంభ్రమాశ్చర్యంగానే ఉంటుంది.

అనంతపురంలో కరువు పరిస్థితులకు ప్రధాన కారణం వర్షాభావం, ఉన్న నీటిని సక్రమంగా ఉపయోగించుకోలేకపోవడం, పాలకుల నిర్లక్ష్యం. ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్ లు వంటి వాటి వల్ల ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీటిని సద్వినియోగం చేసుకుంటున్నారు.

అదేతరహా ప్రణాళిక అన్ని ప్రాంతాల్లోను అమలు చేస్తే, పంటల రకాల్లో మార్పులు తెస్తే, మేలు రకమైన వంగడాలు, నాణ్యమైన పురుగు మందులు రైతులకు అందుబాటులో ఉండేలా చేస్తే అనంతపురం నుండి కరువుని తరిమేయొచ్చు. ఇప్పటికే ఎంతోమంది నిపుణులు అనంత కరువుపై అధ్యయనం చేసి తేల్చిన వాస్తవాలివి.

పంట వేసేటపుడు నగదు లభ్యత, చీడపీడలు, పంట నిల్వకు సరైన గిడ్డంగులు, గిట్టుబాటు ధరలు.. ఇవి కూడా రైతుల సమస్యల్లో ప్రధాన భూమిక పోషిస్తాయి. వీటన్నిటినీ మర్చిపోయి ఇజ్రాయెల్ వ్యవసాయం అంటే అది ఆచరణ సాధ్యమా కాదా అనేది పవన్ ఒకసారి ఆలోచించుకోవాలి.

ఎవరో ఎక్కడో చదివిన, విన్న పాయింట్ ని అప్పటికప్పుడు తన ప్రసంగాల్లో పొందుపరిచి నవ్వులపాలు కావడం పవన్ కి ఆనవాయితీగా మారింది. గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం, వేల రూపాయల నగదుని నేరుగా అకౌంట్లలోకే బదిలీ చేస్తాం అంటూ కోతలు కోస్తున్న పవన్, తాజాగా ఇజ్రాయెల్ వ్యవసాయం పేరుతో మరోసారి అడ్డంగా బుక్కయ్యారు.

చంద్రబాబు అమరావతి నిర్మాణానికి విదేశీ ప్లాన్లు తెప్పించినప్పుడు.. ఏపీలో అంతటి ఇంజినీర్లు లేరా అంటూ ఎగిరిపడ్డ పవన్ కి ఇప్పుడు రాష్ట్రంలో కరువుని జయించే ఉపాయం చెప్పే వ్యవసాయ శాస్త్రవేత్తలే కనపడలేదా. 

తెలంగాణ వోటింగ్ ఇవాలే... ముళ్లు ఎటువైపు తిరుగనుంది?