Advertisement


Home > Politics - Political News
బాబు విజయం సాధించారా?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపు ఏడాదిన్నర తరువాత ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో నేరుగా సమావేశమై తన బాధను వెళ్లబుచ్చుకున్నారు. రాష్ట్రానికి సాయం అందని తీరుపై తీరని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా బాధపడటం, కళ్లనీళ్లు పెట్టుకోవడం ఎన్నోసారి? అనే ప్రశ్నకు జవాబు చెప్పలేం. గతంలో అసెంబ్లీలో అరవైరెండుసార్లని ఆయని లెక్క చెప్పారు. ఆ లెక్క విషయం అటుంచితే ఏడాదిన్నర తరువాత మోదీ కరుణించి రమ్మంటే ఢిల్లీ వెళ్లిన సీఎం విజయం సాధించుకొని వచ్చారా? టీడీపీకి మద్దతుదారైన పత్రిక వార్తలనుబట్టి చూస్తే ఆయన కార్యం సాధించుకువచ్చారో, శూన్య హస్తాలతో వచ్చారో అర్థం కావడంలేదు. మోదీతో భేటీ తరువాత మీడియాలో మాట్లాడిన చంద్రబాబులో ఉత్సాహం లేదు.

మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఆశాజనకమైన సమాధానాలు ఇవ్వలేదు. ప్రధాని సానుకూలంగా స్పందించారని, చర్యలు తీసుకుంటారన్న విశ్వాసం కలిగిందని బాబు చెప్పారు. ఆయనే కాదు, ఎవరైనా ఇదే రొటీన్‌ డైలాగ్‌ చెబుతారు. 'సమావేశం మీకు సంతృప్తి కలిగించిందా?' అనే మీడియా ప్రతినిధుల ప్రశ్నకు బాబు నేరుగా సమాధానం ఇవ్వలేదని ఆయన అనుకూల పత్రిక రాసింది. 'మనకు రావల్సినవాటిపై నిరంతరం ఒత్తిడి చేస్తూవుండటమే నా పని' అని బాబు సమాధానమిచ్చారు. దీన్నిబట్టి ఏమర్థమవుతోంది? ప్రధాని గట్టి హామీ ఇవ్వలేదనుకోవాలి.

బాబు గత మూడున్నరేళ్లుగా హామీల అమలు కోసం కేంద్రాన్ని వేడుకుంటూనేవున్నా పని జరగడంలేదనే విషయం తెలిసిందే. కేంద్రంతో ఘర్షణ పడే ఉద్దేశం తనకు లేదన్నారు బాబు. అంటే ఎన్నికలు దగ్గరపడేంతవరకు బతిమిలాడుకునే పనే చేస్తుంటారన్నమాట. బీజేపీతో పొత్తు కొనసాగిస్తారా? అనే ప్రశ్నకూ సరైన సమాధానం ఇవ్వకుండా ఎప్పుడేం చేయాలో తనకు తెలుసన్నారు. బీజేపీతో బంధం తెంచుకుంటానని ఇప్పటికిప్పుడు చెప్పలేరు కదా. అయితే పొత్తు తప్పనిసరిగా కొనసాగుతుందని చెప్పలేం. బీజేపీతో విడిపోతేనే మంచిదని టీడీపీ నేతలు భావిస్తున్నారు. బీజేపీలోనూ తెంచుకోవాలనుకునే వర్గముంది. గుంభనంగా రాజకీయాలు చేసే బాబు ఏ క్షణమైనా పొత్తుకు స్వస్తి చెప్పొచ్చు.

అసెంబ్లీ సీట్ల పెంపు విషయం మోదీతో ప్రస్తావనకు వచ్చినా దానికి తాను ప్రాధాన్యం ఇవ్వలేదని బాబు మీడియాకు చెప్పారు. పైగా మీకు ఎప్పుడూ రాజకీయాలే కావాలి అంటూ మీడియాపై కోపం ప్రదర్శించి తనకు రాజకీయాలు అవసరం లేన్నట్లుగా మాట్లాడుతున్నారు. పానకంలో పుడకలా వైకాపా ఎంపీలు రాజీనామా చేయలేదంటూ చిర్రుబుర్రులాడారు. ''ప్రత్యేక ప్యాకేజ్‌ వల్ల రాష్ట్రానికి కలిగే తక్షణ లాభం ఏమిటో మాకు అర్థం కావడంలేదు''...అంటూ చంద్రబాబు నాయుడు కొంతకాలం కిందట ఢిల్లీలో కేంద్ర మంత్రులతో అన్నారు. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ఏం ఉపయోగం? అని ఒకప్పుడు అడ్డంగా ప్రశ్నించి, దాన్ని వదులుకున్న చంద్రబాబు ప్యాకేజ్‌ వల్ల రాష్ట్రానికి అందుతున్న సాయం ఏమిటో అర్థం కాక తికమక పడుతున్నారు. కేంద్రం చూపిస్తున్న ప్యాకేజీ సినిమా ఏమిటో ఆయనకే అర్థం కావడంలేదు.

ప్రత్యేక హోదాతో చేసే సాయమంతా ప్యాకేజీ ద్వారా చేస్తామని కేంద్రం చెబుతున్నప్పుడు దాన్ని అంగీకరించడానికి అభ్యంతరం ఎందుకని అప్పట్లో బాబు ప్రశ్నించారు. హోదా కావాలన్నవారిని ద్రోహులుగా చిత్రీకరించారు. కాని మళ్లీ ఇప్పుడు హోదా కావాలంటూ రాగం తీస్తున్నారు. ఎన్నికల్లో ప్రత్యేక హోదా ప్రతిపక్షాలకు ప్రచారాస్త్రం అవుతుందని ఆయనకు తెలుసు. బాబు ఢిల్లీ వెళ్లడానికి ముందు కేంద్ర మంత్రి సుజనా చౌదరి, టీడీపీ ఎంపీలు ప్రధానికి రాష్ట్రానికి అందాల్సిన సాయంపై పదహారు పేజీల వినతి పత్రం ఇచ్చారు. పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. వారు కలిసినవెంటనే బాబు వెళ్లి కలిశారు. ఈయన పదిహేడు పేజీల వినతి పత్రం ఇచ్చారు. కంటెంటులో తేడా ఏమీ లేదు. చంద్రబాబు ఏం సాధించుకొచ్చారనేకంటే ఆయన సుదీర్ఘకాలం తరువాత ప్రధానిని కలవడమే పెద్ద వార్తయింది. ఇదే ఆయన విజయం.