cloudfront

Advertisement


Home > Politics - Political News

ఏం మాట్లాడుతున్నావ్ బాలకృష్ణ?

ఏం మాట్లాడుతున్నావ్ బాలకృష్ణ?

తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు రానురాను బాలయ్య కూడా బావతో తిరిగి చంద్రబాబులా మారిపోతున్నారు. అవేమాటలు, అవే డైలాగులు, అవే డప్పాలు. తెలంగాణ ఎన్నికల ప్రచార సభల్లో బాలకృష్ణ మాట్లాడుతుంటే, కొన్ని సందర్భాల్లో అచ్చుగుద్దినట్టు చంద్రబాబు కనిపిస్తున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది ఈ ఘటన.

శేరిలింగంపల్లి పరిథిలో రోడ్ షో నిర్వహించారు బాలయ్య. తన నిర్మాత, టీడీపీ అభ్యర్థి భవ్య ఆనంద ప్రసాద్ గెలుపు కోసం రోడ్ షో చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాలయ్య.. తెలంగాణలో గడీల పాలనను అంతం చేసింది తెలుగుదేశం పార్టీనే అని ప్రకటించేశారు. దీంతో అంతా ముక్కున వేలేసుకున్నారు. బాలయ్యను ప్రశ్నిస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే కదా.

అసలు గడీ పాలనకు, తెలుగుదేశం పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? నిరంకుశ పాలకుల వేధింపులు భరించలేక తెలంగాణ రైతులు, ప్రజలు సాయుధులై తిరగబడి గడీ పాలనకు చరమగీతం పాడారు. అప్పటి ఆ పోరాటానికి కమ్యూనిస్టులతో పాటు భారత ప్రభుత్వం మద్దతిచ్చింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎక్కడుంది?

ఆ టైమ్ కు టీడీపీ అవిర్భావం కూడా జరగలేదు. ఈ విషయాలేవీ తెలియని బాలకృష్ణ.. గడీ పాలనను అంతం చేసింది తమ పార్టీనే, తెలుగుదేశం తమ్ముళ్లే అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడేశారు. ఇలా అర్థంపర్థం లేకుండా మాట్లాడ్డంలో బావ చంద్రబాబు దగ్గర ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్టున్నారు బాలయ్య.

చంద్రబాబు కూడా ఇంతే. తలతోక లేకుండా మాట్లాడేస్తుంటారు. ఇండియాకు సెల్ ఫోన్ తనే తెచ్చానంటారు. ఒలింపిక్స్ లో గెలిస్తే నోబుల్ బహుమతి ఇస్తానంటారు. సత్య నాదెళ్లకు ఉద్యోగం ఇప్పించింది తనేనని, అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసింది కూడా తననేంటూ ఇలా రకరకాలుగా చెప్పుకోవడంలో బాబుకు అదో తుత్తి.

ఇప్పుడీ 'తుత్తి' కాన్సెప్ట్ ను బాలకృష్ణ కూడా యథాతథంగా ఫాలో అయిపోతున్నారు. తెలంగాణ ఎన్నికల ముఖచిత్రంపై నవ్వులు పూయిస్తున్నారు.

తెలంగాణ ఓటరు నాడి... ముళ్లు ఎటువైపు తిరుగుతోంది?... చదవండి గ్రేట్ ఆంధ్ర పేపర్