Advertisement

Advertisement


Home > Politics - Political News

ఈ డాక్టర్ ఓ రియల్ హీరో

ఈ డాక్టర్ ఓ రియల్ హీరో

ఈ కరోనా కష్టకాలంలో మనిషిలోని మానవత్వం మరోసారి మెరుస్తోంది. మొన్నటికిమొన్న చనిపోతానని తెలిసి కూడా ఓ వ్యక్తి తన హాస్పిటల్ బెడ్ ను మరో కరోనా పేషెంట్ కు త్యాగం చేశాడు. మరో ఘటనలో భార్య నగలు అమ్మి, తన ఆటోనే మినీ-ఐసీయూగా మార్చేశాడు ఓ ఆటోడ్రైవర్. ఇంకో ఘటనలో ఫ్రెండ్ కోసం 1400 కిలోమీటర్లు ప్రయాణం చేసి మరీ ఆక్సిజన్ అందించాడు ఓ వ్యక్తి.

ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కరోనా కాలంలో మానవత్వం చూపిస్తున్న మనుషులు ఎంతోమంది. ఇప్పుడిదే కోవలోకి వస్తాడు ఓ వైద్యుడు. ఏకంగా 9 సార్లు ప్లాస్మా దానం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఆక్సిజన్ తర్వాత కరోనా పేషెంట్లు ఎక్కువగా కొరత ఎదుర్కొంటోంది ప్లాస్మా గురించే. 

ఓ వైద్యుడిగా దాని అవసరం బాగా తెలిసిన బెంగళూరుకు చెందిన డాక్టర్ శ్రీకాంత్, ఇప్పటివరకు 9 సార్లు ప్లాస్మా దానం చేశాడు. అవసరమైతే ఇంకా దానం చేస్తానంటున్నాడు. గతేడాది ఆగస్ట్ లో కరోనా బారిన పడి పూర్తిగా కోలుకున్నాడు 52 ఏళ్ల శ్రీకాంత్. 

కరోనా నుంచి కోలుకున్న వ్యక్తుల్లో యాంటీబాడీస్ ఎక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే. అలాంటి వాళ్లు ప్లాస్మా దానం చేస్తే, ఇతర రోగులకు అది ఎంతో మేలు చేస్తుంది. అందుకే శ్రీకాంత్ అప్పట్నుంచి ప్లాస్మా దానం చేస్తూనే ఉన్నాడు. అలా ఇప్పటివరకు తను పనిచేస్తున్న మణిపాల్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ లో 9 సార్లు ప్లాస్మా దానం చేశాడు.

ప్రతిసారి రక్తపరీక్ష చేయించుకుంటాడు శ్రీకాంత్. శరీరంలో యాంటీ బాడీస్ పెరిగిన వెంటనే వెళ్లి ప్లాస్మా దానం చేశాడు. ఒకసారి ప్లాస్మా దానం చేస్తే అది ఇద్దరు రోగులకు ఉపయోగపడుతుంది. అలా శ్రీకాంత్ ఇప్పటివరకు 18 మంది కరోనా రోగుల్ని కాపాడినట్టయింది.

తన 18వ ఏట నుంచి రక్తదానం చేస్తూనే ఉన్నాడు శ్రీకాంత్. ఇప్పుడు కరోనా టైమ్ లో ఇలా ప్లాస్మా దానం చేసి చాలామంది పాలిట దేవుడు అయ్యాడు. ప్లాస్మా ట్రీట్ మెంట్ కరోనా రోగిని వెంటిలేటర్ పైకి వెళ్లే బాధ నుంచి తప్పిస్తుందనే విషయం తెలిసిందే.  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?