Advertisement

Advertisement


Home > Politics - Political News

బిసిలు..మాకే అంటే మాకే

బిసిలు..మాకే అంటే మాకే

ఆంధ్ర రాజకీయం 2019 ఎన్నికల తరువాత చిత్రంగా  మారిపోయింది. ఇప్పటి వరకు కాపు సామాజిక వర్గం ఓట్ల కోసం వెంపర్లాడిన తెలుగుదేశం పార్టీ మడమ తిప్పేసి మళ్లీ బిసి పాట పాడుతోంది.

కాపులను కాకుండా బిసిలను నమ్ముకుని ఎన్నికలకు వెళ్లిన వైకాపా, వాళ్లను మరింత దగ్గర చేసుకోవాలని చూస్తోంది. దీంతో టోటల్ రాజకీయ బిసిల చుట్టూ తిరుగుతోంది.

బిసిల్లో చాలా మందికి తెలియని, చిన్న చిన్న కులాలను కూడా గుర్తించి, వారికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, పదవులు ఇచ్చి, ఆ విధంగా ముందుకు వెళ్తున్నారు జగన్.

దీంతో గత నెల రోజుల బట్టి నాన్చుతున్న తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఈ బిసి(తూర్పు కాపు) నుంచి తీసి ఆ బీసీకి (కొప్పల వెలమ) అప్పగించి, చూసారా మాకు బిసిల మీద ఎంత ప్రేమో అంటోంది తెలుగుదేశం. పైగా ఉత్తరాంధ్ర వాసి పదవి తీసి, ఉత్తరాంధ్ర వాసికే ఇచ్చింది. 

పదవి అందుకోగానే అచ్చెంనాయుడు సహజంగా భీష్మ ప్రతిజ్ఞ చేసారు. బాబుగారిని అధికార కుర్చీ ఎక్కించడం కోసం అహరహం కృషి చేస్తా అన్నారు. ఒంట్లో బాగా లేక గ్యాప్ వచ్చింది కానీ గ్యాప్ తీసుకోలేదని డైలాగ్ వదిలారు.

తన అన్న ఎర్రంనాయుడును మించి పని చేస్తా అన్నారు. బిసిలు ఎప్పటికీ తెలుగుదేశంతోనే అన్నారు. అంటే కానీ 2019లో ఎందుకు బిసిలు వదిలేసారో చెప్పలేదు. మళ్లీ ఇప్పుడు ఎందుకు వస్తారో అంతకన్నా చెప్పలేదు. 

మొత్తం మీద పవన్ కళ్యాణ్ ను దగ్గరకు తీసి, అతని పార్టీతో లోపాయి కారీ ఒప్పందం పెట్టుకుని, బిసిలను దూరం చేసుకున్నామని తెలుగుదేశం గ్రహించినట్లే వుంది. పవన్ ఎలాగూ భాజపా దగ్గరకు వెళ్లిపోయారు. అందువల్ల ఇక ఆయనా వద్దు, కాపుల ఓట్లు వద్దు..బిసిలే ముద్దు అని తెలుగుదేశం డిసైడ్ అయిపోయినట్లు కనిపిస్తోంది.

బిసిల ఓట్లను రెండు ప్రధానపార్టీలు చీల్చుకుని, కాపుల ఓట్లను భాజపా ప్లస్ జనసేన పట్టుకెళ్తే ఫలితం ఎలా వుంటుందో రాజకీయ లెక్కల మాస్టార్లు లెక్కించి చెప్పాలి. మొత్తానికి వికటించిన తమ వ్యూహాన్ని మార్చుకుని, ఆ విధంగా ముందుకు వెళ్లాలని బాబుగారు డిసైడ్ అయ్యారు. దాని ఫలితం ఎలా వుంటుందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాలి. 

జగన్ వ్యూహం.. కూలుతున్న టీడీపీ కోట 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?