Advertisement

Advertisement


Home > Politics - Political News

భారీ వర్షాలు.. రాయలసీమకు ఊరట!

భారీ వర్షాలు.. రాయలసీమకు ఊరట!

ఎక్కడ గ్యాప్‌ లేకుండా రాయలసీమ వ్యాప్తంగా గత పదిరోజుల్లో భారీ వర్షాలు చోటు చేసుకున్నాయి. ఎగువన కురిసిన వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యానికి చేరుకోవడం, వరద సమయంలోనే సీమవైపుకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీళ్లు సాగడం ఆ ప్రాంత వాసులకు ఆనందకరమైన అంశంగా మారింది. ముచ్చుమర్రి, హంద్రీనీవా వంటి ప్రాజెక్టులకు సంబంధించి శ్రీశైలం నుంచి వరద సమయంలోనే నీటిని వదిలారు. మరికొన్ని రోజులు నామమాత్రంగా అయినా వరద కొనసాగే అవకాశాలున్నాయి.

దసరా సీజన్లో ఎగువన మరిన్ని భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరింతగా వరద ఖాయమనే చెప్పాలి. రాయలసీమ ప్రాంతానికి ఇది ఎంతోకొంత ఊరటను ఇచ్చే అంశమే. శ్రీశైలం వరద నీరు ఇప్పటికే అనంతపురం జిల్లా వరకూ సాగింది. హంద్రీనీవా ప్రాజెక్టులో భాగంగా జీడిపల్లి రిజర్వాయర్‌ వరకూ నీరు చేరాయి. ఈ నేపథ్యంలో ఈసారి కుప్పం వరకూ వివిధ చెరువులకు నీళ్లు వదులుతూ హంద్రీనీవా కాలువ సాగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరింతగా వరద నీరు లభిస్తే రాయలసీమకు నీటి లభ్యత కూడా పెరిగే అవకాశం ఉంది.

అలాంటి కాలువలతో లబ్ధిపొందేది పరిమిత ప్రాంతమే. ఒకవేళ చెరువులను నింపితే మాత్రం రైతాంగానికి ఎక్కువ మేలు జరిగే అవకాశం ఉంది. ఆ సంగతలా ఉంటే.. వర్షాలు యావత్‌ రాయలసీమకు ఊరటను కలిగిస్తూ ఉన్నాయి. వర్షాకాలంలో నెలరోజుల పాటు పూర్తిగా మొహం చాటేసిన వరుణుడు ఆగస్టులో ఒకింత కరుణ చూపించాడు. చాలా చోట్ల మంచి వర్షపాతం నమోదు అయ్యింది. కొన్నిచోట్ల చెరువుల్లోకి, కుంటల్లోకి నీరు వచ్చాయి.

వాగులూవంకలు సాగాయి. ఈసారి సకాలంలో చాలాచోట్ల వర్షాలు రాలేదు. దీంతో వేరుశనగ సాగు కూడా చాలావరకూ తగ్గింది. అయితే అప్పట్లో ఎలాగోలా సాగు చేసుకున్న వారికి మాత్రం ప్రస్తుత వర్షాలు మేలు చేసేవిలా మారాయి. ఈ తరహాలో వర్షం కొనసాగితే ఇతర పంటలకు కూడా చాలా మేలు జరిగే అవకాశాలున్నాయి. చెరువుల్లోకి నీరుచేరిన చోటల్లా భూగర్భజలాల లభ్యత పెరగడం ఖాయమే. కాస్త లేటు అయినా వరుణుడి కరుణ రైతులకు ఊరటగా మారింది. మరింతగా వర్షాలను ఆశిస్తోంది రాయలసీమ ప్రజానీకం. దసరా సీజన్లో భారీవర్షాలు కురుస్తాయనే ఆశావాహం భావం వ్యక్తం అవుతూ ఉంది అక్కడి ప్రజల నుంచి.

ఏపీ రాజధానిని వైఎస్ జగన్ మారుస్తారా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?