cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

టీడీపీకి ప‌న‌బాక బిగ్ షాక్‌!

టీడీపీకి ప‌న‌బాక బిగ్ షాక్‌!

తెలుగుదేశం పార్టీకి తిరుప‌తి పార్ల‌మెంట్ అభ్య‌ర్థి ప‌న‌బాక ల‌క్ష్మి బిగ్ షాక్ ఇచ్చారా? అంటే "ఔన‌నే" స‌మాధానం వ‌స్తోంది. ఈ రోజు జ‌రిగిన టీడీపీ కీల‌క స‌మావేశానికి ఆమె గైర్హాజ‌రు కావడం గ‌మ‌నార్హం. 

దీంతో తిరుప‌తి ఉప ఎన్నిక బ‌రిలో ప‌న‌బాక ల‌క్ష్మి నిలిచినా ...అది టీడీపీ నుంచి మాత్రం కాద‌ని ఆమె అనుచ‌రులు, స‌న్నిహితులు చెబుతుండ‌డం విశేషం. ఈ నేప‌థ్యంలో టీడీపీకి ఆదిలోనే గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలిన‌ట్టు రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

లోక్‌సభ ఉప ఎన్నికలు దగ్గర పడుతున్న త‌రుణంలో తిరుపతి న‌గ‌ర ప‌రిధిలోని ఆటోన‌గ‌ర్‌లో  ఏర్పాటు చేసిన పార్లమెంట్‌ నియోజక వర్గ కార్యాలయాన్ని బుధ‌వారం టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. 

ఉప ఎన్నిక‌కు సంబంధించి కీల‌కంగా భావించే పార్టీ కార్యాల‌య ప్రారంభానికి అభ్య‌ర్థి ప‌న‌బాక ల‌క్ష్మి రాక‌పోవ‌డంతో టీడీపీలో క‌ల‌క‌లం చెల‌రేగింది. ప‌న‌బాక గైర్హాజ‌ర్‌తో ఆమె పార్టీకి దూర‌మైన‌ట్టే అని టీడీపీ శ్రేణులు, నాయ‌కులు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని స‌మాచారం.

2019లో టీడీపీ త‌ర‌పున ఆమె తిరుప‌తి పార్ల‌మెంట్ స్థానం నుంచి బ‌రిలో దిగారు. ఓట‌మి త‌ర్వాత ఆమె పార్టీ కార్య‌క‌లాపాల‌కు దూర‌మ‌వుతూ వ‌చ్చారు. ఈ నేప‌థ్యంలో వైసీపీ ఎంపీ బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ ఆక‌స్మిక మృతితో , తిరుప‌తి పార్ల‌మెంట్‌కు ఉప ఎన్నిక అనివార్య‌మైంది. 

ఈ నేప‌థ్యంలో ఉప ఎన్నిక‌ను అన్ని పార్టీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. అయితే టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు త‌న మ‌న‌స్త‌త్వానికి విరుద్ధంగా ఎంతో ముందుగా త‌మ అభ్య‌ర్థిగా ప‌న‌బాక ల‌క్ష్మి పేరు ఖ‌రారు చేయ‌డంతో పాటు ప్ర‌క‌టించి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

అయితే బాబు దూకుడు వెనుక అస‌లు నిజాలు ఆ త‌ర్వాత వెలుగులోకి వ‌చ్చాయి. టీడీపీలో కొన‌సాగ‌డానికి అఇష్టంగా ఉండ‌డంతో పాటు బీజేపీలో చేరేందుకు ప‌న‌బాక ల‌క్ష్మి ఏర్పాటు చేసుకున్నార‌నే విష‌యం తెలుసుకున్న చంద్ర‌బాబు ...వ్యూహాత్మ‌కంగా ఆమె పేరు ప్ర‌క‌టించి ఇరుకున పెట్టార‌ని తెలుస్తోంది. దీంతో ప‌న‌బాక ల‌క్ష్మి షాక్‌కు గురైన‌ట్టు వార్త‌లొచ్చాయి. 

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి మూడుసార్లు ఆమెతో చ‌ర్చించిన త‌ర్వాతే ఇటు చంద్ర‌బాబును క‌ల‌వ‌డానికి, అటు తిరుప‌తి వెళ్ల‌డానికి ఆమె త‌లూపార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే.

గ‌త నెల‌లో తిరుప‌తిలో అలిపిరిలో టెంకాయ‌లు కొట్టి త్వ‌ర‌లో ప్ర‌చారాన్ని ప్రారంభిస్తాన‌ని ప‌న‌బాక ల‌క్ష్మి ప్ర‌క‌టించారు. రోజులు గ‌డుస్తున్నాయే త‌ప్ప ప‌న‌బాక ల‌క్ష్మి మాత్రం తిరుప‌తి వైపు క‌న్నెత్తి చూసేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌డం లేదని స‌మాచారం. 

టీడీపీ అభ్య‌ర్థిగా ఆమె త‌ప్పుకుంటార‌నే విస్తృత ప్ర‌చారానికి ... తాజాగా పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ కార్యాల‌య ప్రారంభానికి రాక‌పోవ‌డం బ‌లం క‌లిగిస్తోంది. టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడే స్వ‌యంగా కార్యాల‌య ప్రారంభానికి వ‌స్తుంటే, అభ్య‌ర్థే రాక‌పోవ‌డంపై టీడీపీ శ్రేణులు అయోమ‌య్యానికి లోన‌వుతున్నాయి. 

ముఖ్య‌మైన ప‌నులు ఎన్ని ఉన్నా ... కీల‌క‌మైన ఈ కార్య‌క్ర‌మానికి రాక‌పోవ‌డాన్ని చూస్తే, ఇక ఆమె టీడీపీ త‌ర‌పున బ‌రి నుంచి త‌ప్పుకున్న‌ట్టే అని చెబుతున్నారు. ఒక‌వేళ త‌న‌కు ఈ రోజు ముఖ్య‌మైన ప‌ని ఉంటే, ఆ విష‌యాన్ని అధిష్టానానికి ప‌నబాక చెప్పి ఉండేవార‌ని, కానీ ఆమె మ‌న‌సులో వేరే ఆలోచ‌న‌లు, అభిప్రాయాలుండ‌డం వ‌ల్లే గైర్హాజ‌ర్‌తో త‌న ఉద్దేశాన్ని చెప్ప‌క‌నే చెప్పార‌నే గుస‌గుస‌లు తిరుప‌తిలో వినిపిస్తున్నాయి.  

పెళ్లి వేడుక‌కు వ‌ధువో లేక వ‌రుడు హాజ‌రు కాకుంటే , పెళ్లి మండ‌పంలో ప‌రిస్థితి ఎలా ఉంటుందో ...పార్టీ కార్యాల‌యంలో కూడా నేడు అలాంటి ప‌రిస్థితి క‌నిపించింద‌ని టీడీపీ శ్రేణులు చెబుతుండ‌డం విశేషం.

రాజకీయ కామెడీ స్టార్ గా పవన్ కళ్యాణ్

కామెడీ చెయ్యడం కామెడీ కాదు

 


×