cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

'భయో' డేటా: పవన్‌ 'కాషాయణ్‌'!

'భయో' డేటా: పవన్‌ 'కాషాయణ్‌'!

నా పేరు: పవన్‌ కల్యాణ్‌

దరఖాస్తు చేయు ఉద్యోగం: 'లడ్డూ పార్టీ' అధికార ప్రతినిథి (హోదా అడిగితే ప్యాకేజీ అంటూ అప్పుడెప్పుడో 'పాచి పోయిన మూడు లడ్డూలు' ఇచ్చారు.. తాజా లడ్డూలు వారి దగ్గరే వుంచుకుని. మనమే లడ్డూల తయారీ దగ్గర వుంటే, 'ప్రత్యేక' లడ్డూలు తెచ్చుకోవచ్చు కదా.. లడ్డూలు కాకుంటే, నడ్డా తో నాకేం పని..?)

వయసు: పార్టీలు మార్చుకోవటానికి వయసు కానీ, పొత్తులు పెట్టుకోవటానికి వయసేమిటి? జనసేన పెట్టి నప్పటి నుంచీ ఒకే పార్టీ, ఒకే జెండా, ఒకే ఎజెండా...ఒకే ...( ఒక్కటే ... అన్నది జీవితంలో అన్నింటికీ వర్తించదు లెండి!)

ముద్దు పేర్లు: 'మొన్న 'ఎర్ర' వపనం, నిన్న 'పచ్చ' పవనం, నేడు 'కాషాయ' పవనం. అవును. గాలే రుతువు రుతువుకీ మారదూ..? ఎండా కాలంలో ఒక లాగా, వానా కాలంలో ఒక లాగా మారదూ.

విద్యార్హతలు: ఎవరయ్యా ఈ కాలమ్‌ పెట్టిందీ..? ప్రతీ వాడికీ ఇదొకటి అలవాటయి పోయిందీ.. మోడీజీ, నన్నూ మాటిమాటికీ డిగ్రీ సర్టిఫికెట్‌ గురించి అడుగుతారు. ( చదువంటే ఏం పుస్తకాలు చదివారని.. నేను 'చేగువేరా గురించీ చదివాను. వీర్‌ సావర్కర్‌ గురించీ చదివాను' 'ఎంతవరకూ చదివామన్నది కాదు.. ఏం చదివామన్నది ముఖ్యం... రాసు కోరా సాంబా!

విలాసం: ఇప్పటికి ఢిల్లీ.. కొన్ని రోజులు ఆగితే నాగపూర్‌ అడ్రసు ఇస్తాను. బీజేపీ కీ, ఆరెస్సెస్‌ కీ ఆమాత్రం దూరం వుంటుంది.

గుర్తింపు చిహ్నాలు: ఒకటి: పోటీ చేసిన చోట గెలవను. గెలిచిన చోట పోటీ చెయ్యను.

రెండు: నిన్న సభలో మాట్లాడింది, నేటి సభలో గుర్తుండదు. (హోదా విషయంలో బీజేపీని తిట్టానా..? గుర్తు లేదే...! ఓహో.. అందుకా...? సోషల్‌ మీడియాలో మిత్రులు నా పాత వీడియోలు పెట్టేదీ..! ఇప్పుడిప్పుడు గుర్తుకొస్తుంది లెండి.)

సిధ్ధాంతం: లెఫ్టిజం +సెంట్రిజం+ రైటిజం= పవనిజం. ( అర్థం చేసుకోకుండా, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు..!)

వృత్తి: వ్యక్తిత్వ వికాసం ఐమీన్‌ పర్సనాలిటీ డెవలెప్‌మెంట్‌ను బోధించటం. (ఓటమితో కృంగి పోకుండా, నిలబడి కృషిచెయ్యాలని, నాకు నన్నే ఉదాహరణగా చెప్పి, యువతను ఉత్తేజ పరుస్తుంటాను. పోటీ చేసిన రెండు సీట్లలోనూ పోయినా, ఎంత ఉత్సాహంతో తిరుగుతున్నానో చూడండి. అదే రాహుల్‌ గాంధీని తీసుకోండి. రెండుసీట్లలో ఒక సీటు పోయినందుకే డీలా పడిపోయాడు... టూ బాడ్‌!)

హాబీలు: 1. రంగుల్ని ప్రేమించటం. (జీవితమైనా, రాజకీయమైనా బ్లాక్‌ అండ్‌ వైట్‌ లా వుండటం నాకు ఇష్టం వుండదు. అందుకే ఒక్కో సారి ఒక్కో రంగుని ప్రేమిస్తాను.. పసుపూ, ఎరుపూ, నీలం, కాషాయం...ఇలా ప్రేమిస్తూనే వున్నాను. నేన ఇంద్రధనువు లాంటి వాణ్ణి. అన్ని రంగులూ నాలోనే వుంటాయి.)

2. తీపి లడ్డూల మీద పరిశోధన. (లడ్డూ ను చూస్తే తాజాగా వుందో, పాచిపోయిందో, ఇట్టే చెప్పగలను.)

అనుభవం: మనుషుల మధ్య ఏ 'గ్యాప్‌' అయినా వుండవచ్చు, కానీ, కమ్యూనికేషన్‌ గ్యాప్‌ వుండకూడదు. మోడీజీ కీ నాకూ మూడేళ్ల పాటు కమ్యూనికేషన్‌ గ్యాప్‌ వచ్చింది. ( కాబట్టే కమ్యూనిస్టులతో చేతులు కలపాల్సి వచ్చింది. బెహన్‌ జీకి పాదాభివందనం చెయ్యాల్సి వచ్చింది.)

మిత్రులు: ఇప్పుడు చెప్పినా, ఈ ముక్క ప్రచురణ కావటానికి 24 గంటలు పట్టవచ్చు. ఈ లోగా ఉన్న మిత్రులు జారిపోవచ్చు; కొత్త మిత్రులు చేరవచ్చు. ( స్నేహాలు కూడా 'పవన' వేగంతో మారతాయి.)

శత్రువులు: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు వుండరంటే నేనూ నమ్మేవాణ్ణి కాదు, ఇప్పుడు చూడండి. మోహన్‌ బాబు గారూ, నేనూ ఒకే గూటి (బీజేపీ) గుమ్మం ముందు కలుసుకుంటున్నాం.

మిత్రశత్రువులు: మీడియా వాళ్ళే. రోజుకో రకంగా రాస్తారు.  

జీవిత ధ్యేయం: నేనే స్వయంగా లడ్డూ ఫ్యాక్టరీ స్థాపించటం. ( అప్పుడు ఏపీకీ 'మూడు మంచి లడ్డూలు' ఇవ్వవచ్చు కదా!

- సర్‌