cloudfront

Advertisement


Home > Politics - Political News

కలిసుందాం.. రా..!

కలిసుందాం.. రా..!

'నువ్వు..నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం'..అనే పాపులర్‌  పాట తెలిసిందే కదా. ఇప్పుడు దీన్నే హిందీలోకి మార్చుకొని, రాజకీయపరమైన కొన్ని పదాలు చేర్చుకొని పాడుకుంటోంది భారతీయ జనతా పార్టీ. కలిసుంటే ఇష్టమని ఎవరితో అంటోంది? మీ స్నేహం మాకు అవసరం లేదు..విడిపోతాం, వచ్చే ఎన్నికల్లో ఒంటిరిగా పోటీ చేస్తామన్న శివసేన పార్టీతో.

రాజకీయాల్లో ఎప్పుడు కొట్లాటలు జరుగుతాయో, ఎప్పుడు కౌగిలించుకుంటారో చెప్పలేం. ఇవన్నీ రాజకీయ లెక్కల ప్రకారం జరుగుతాయి. వచ్చే ఎన్నికల్లో ప్రమాద ఘంటికలు మోగుతాయని, గత ఎన్నికల్లో మాదిరిగా బీజేపీకి బండ మెజారిటీ వచ్చే అవకాశం లేదని మీడియా అంచనా వేస్తున్న నేపథ్యంలో శివసేన, టీడీపీ, అకాలీదళ్‌ మొదలైన పార్టీలతో కొట్లాటలు జరుగుతున్నాయి.

తనతో ఘర్షణ పడుతున్న పార్టీలను 'మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి' అని చెప్పే పరిస్థితిలో బీజేపీ లేదు. దీంతో 'కలిసుందాం..రా' అంటూ బుజ్జగించడం ప్రారంభించింది. శివసేన అధినేత ఉద్ధవ్‌ థాకరే గత నెల 23న 'బీజేపీతో మా బంధం తెగిపోయింది' అని విస్పష్టంగా ప్రకటించారు. మోదీ ఇమేజ్‌ తగ్గిపోయిందని శివసేన నాయకులు విమర్శించారు.

ప్రధాని కావడానికి రాహుల్‌ గాంధీకి ఎక్కువ అవకాశం ఉందని, ఆయనలో ఎంతో పరిణతి కనబడుతోందని ప్రశంసించారు.  మహారాష్ట్ర ప్రభుత్వంలో శివసేన భాగస్వామి అయినప్పటికీ ప్రభుత్వంపై, బీజేపీపై తీవ్ర విమర్శలు చేసింది. ఇంత జరిగిన తరువాత కూడా 'ఏ దోస్‌తీ హమ్‌ నహీ ఛోడేంగే' అంటూ బీజేపీ నాయకులు శివసేన నేతలతో చర్చలు జరుపుతున్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో అత్యధికంగా సీట్లు కేటాయిస్తామని ఆశ పెడుతున్నారు. గత ఏడాది నవంబరు నుంచి ఇప్పటివరకు ఈ రెండు పార్టీల నేతల మధ్య మూడు రహస్య సమావేశాలు జరిగాయి. శివసేనతో జరిగిన మొదటి సమావేశంలో ముఖ్యమంత్రి దేవేందర్‌ ఫడ్నవీస్‌తోపాటు రెవన్యూ, ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. రెండు పార్టీల మధ్య రెండో సమావేశం గత నెలలో ఔరంగాబాద్‌లో జరిగింది.

మూడో సమావేశం వారం కిందటనే ముంబయిలో జరిగింది. ఫిబ్రవరి 9న బజెట్‌ సమావేశాలు ముగిసే రోజున ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, శివసేన రాజ్యసభ ఎంపీ అనిల్‌ దేశాయ్‌ పది నిమిషాలపాటు రహస్యంగా మంతనాలు జరిపారు. ఇద్దరికీ సీట్ల పంపిణీ విషయంలో పొసగలేదు. వీరిద్దరి మధ్య మరో సమావేశం కూడా జరిగినా ఫలవంతం కాలేదు.

దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్‌ తగ్గిపోతోందని, గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెసు గట్టి పోటీ ఇవ్వడం ఇందుకు నిదర్శనమని శివసేన నేతలు అంటున్నారు. మహారాష్ట్రలోనూ ఇదే పరిస్థితి ఉందని, ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌ గత మూడేళ్లలో చెప్పుకోదగ్గ పని ఒక్కటీ చేయలేదని విమర్శిస్తున్నారు.

ప్రభుత్వంలో భాగస్వామి అయిన శివసేనకు బీజేపీ నుంచి అవమానాలు ఎక్కువ కావడంతో బీజేపీతో పొత్తు ఉండకూడదని ఉద్ధవ్‌ థాకరే నిర్ణయించారని శివసేన నాయకులు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో శివసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తాయా? ఎవరి మార్గం వారు చూసుకుంటారా? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కొందరు శివసేన నేతలు తమది ఒంటరి పోరాటామేనంటున్నారు.