cloudfront

Advertisement


Home > Politics - Political News

బీజేపీయే డిసైడ్‌ చేస్తుందట...!

బీజేపీయే డిసైడ్‌ చేస్తుందట...!

ఓ పక్క కర్నాటకలో రాజకీయ సంక్షోభం కొనసాగుతుండగానే, మరోపక్క ఏపీ బీజేపీ నాయకులు టీడీపీపై విమర్శల బాణాలు వేస్తూనేవున్నారు. ఆ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుందో ప్రస్తుతానికి తెలియదు. సాధ్యమైనంతవరకు బీజేపీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఏపీ బీజేపీ నేతలు విశ్వాసంతో ఉన్నారు. మొత్తంమీదైతే బీజేపీ ఎక్కువ సీట్లు సాధించినందుకు చాలా హ్యాపీగా ఉన్నారు. మ్యాజిక్‌ ఫిగర్‌కు ఎనిమిది స్థానాలు తక్కువ కావడానికి టీడీపీయే కారణమని మండిపడుతున్నారు. ఆ పార్టీ నాయకులు కర్నాటకకు వెళ్లి బీజేపీకి ఓటు వేయొద్దని తెలుగోళ్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన కారణంగానే తమ పార్టీకి సీట్లు తగ్గాయని, లేకుంటే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవాళ్లమని అంటున్నారు. ప్రస్తుత సంక్షోభానికి పరోక్షంగా టీడీపీయే కారణమంటూ  విమర్శల జోరు పెంచారు. పొత్తు విడిపోయినప్పటినుంచి చంద్రబాబు నాయుడు తరచుగా ఓ మాట అంటున్నారు.

టీడీపీని 25 పార్లమెంటు స్థానాల్లో గెలిపిస్తే, వచ్చే ఎన్నికల తరువాత ప్రధానమంత్రిని తానే నిర్ణయిస్తానంటున్నారు. జాతీయ రాజకీయాల్లో మళ్లీ చక్రం తిప్పుతానని చెబుతున్నారన్నమాట. మొత్తం ఎంపీ స్థానాలు టీడీపీకీ కట్టబెట్టినా పీఎంను ఎలా డిసైడ్‌ చేస్తారో అర్థంకావడంలేదు. ఏపీ కంటే ఎక్కువ పార్లమెంటు స్థానాలున్న రాష్ట్రాలున్నాయి కదా. వాళ్ల ముందు ఈయన ఆటలు సాగుతాయా? రాష్ట్ర విభజన తరువాత జాతీయ రాజకీయాల్లో తెలుగువారి బలం తగ్గిపోయిందనే వాస్తవం చంద్రబాబు గుర్తించలేదేమో. ప్రధానిని తాను డిసైడ్‌ చేస్తానని బాబు చెప్పుకుంటుంటే, బీజేపీ నేతలకు చిర్రెత్తుకొస్తున్నట్లుంది. మళ్లీ మోదీయే ప్రధాని అవుతారని వారు ఎప్పటినుంచో చెప్పుకుంటున్నారు. బంపర్‌ మెజారిటీ సాధ్యమేనంటున్నారు.

చంద్రబాబుకు కౌంటర్‌గా కమలం పార్టీ నేత విష్ణుకుమార్‌ రాజు 'వచ్చే ఎన్నికల తరువాత ఏపీలో సీఎంను డిసైడ్‌ చేసేది మేమే' అన్నారు. బహుశా వైకాపా అధినేత జగన్‌ను దృష్టిలో పెట్టుకొని అనుండొచ్చు. కర్నాటకలో మాదిరిగా ఏ పార్టీకి మెజారిటీ రాని పరిస్థితి ఏర్పడుతుందని, అప్పుడు తాను కీలక పాత్ర పోషిస్తానని బీజేపీ చెప్పుకుంది. టీడీపీ తన రాజకీయ జీవితంలో మొదటిసారిగా పూర్తిగా ఒంటరిగా బరిలోకి దిగబోతోంది. బీజేపీతో ఎలాగూ పొత్తు పెటాకులవుతుందని చంద్రబాబుకు తెలుసు. పొత్తు విడిపోగానే పవన్‌ కళ్యాణ్‌ జనసేన ఉంది కాబట్టి ఏం విచారించాల్సిన అవసరం లేదని బాబు భావించారు.

కాని సీన్‌ మారిపోయి పవన్‌ వ్యతిరేకమయ్యాడు. బీజేపీ-వైకాపా స్నేహంగా ఉన్నాయంటూ చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. రెండూ పొత్తు పెట్టుకుంటాయన్నారు. ఒంటరిగా పోటీ చేయడమా, పొత్తు పెట్టుకోవాలా అనేది ఆలోచిస్తున్నామని బీజేపీ నేతలూ చెప్పడంతో అనుమానాలు ఎక్కువయ్యాయి. బీజేపీతో తముకు సంబంధాలు లేవని వైకాపా నేతలంటున్నారు. వైకాపా ఒంటరిగా పోటీకి దిగుతుందంటున్నారు. కాని ఎన్నికల రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఇప్పుడు కర్నాటకలో జరుగుతోంది చూస్తున్నాం కదా.