Advertisement


Home > Politics - Political News
బాబు బీజేపీకి అలా దొరికాడు..!

ఒకటా రెండా.. గత నాలుగేళ్లలో భారతీయ జనతా పార్టీని, మోడీని చంద్రబాబు ఆకాశానికి ఎత్తిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇతోధికంగా సాయం చేస్తోందని, అందరి కన్నా కేంద్రం నుంచి తనే ఎక్కువ నిధులు రాబడుతున్నాను అని, కేంద్రంతో తన రాజీ ధోరణి రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తోందని, ప్రత్యేకహోదా అవసరం లేదని, కేంద్రం ఇస్తున్న ప్యాకేజీ అద్భుతం అని చంద్రబాబు నాయుడు చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

గత నాలుగేళ్ల పాటు బాబు ఇదే పాట పాడాడు. అంతేనా.. కేంద్రానికి సాయానికి థ్యాంక్స్ అంటూ, అసెంబ్లీలో తీర్మానం సైతం ప్రవేశ పెట్టాడు చంద్రబాబు నాయుడు. కేంద్రం చేస్తున్న సాయానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడిది. అయితే ఇప్పుడు చంద్రబాబు మాట మార్చేశాడు. కేంద్రం ఏమీ సాయం చేయలేదని అంటున్నాడు. దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా తనే కేంద్రం నుంచి ఎక్కువ సాధించుకొస్తున్నాను అని చెప్పిన నోటితో, కేంద్రం సాయానికి అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం ప్రవేశ పెట్టిన చంద్రబాబే ఇప్పుడు కేంద్రం అన్యాయం చేస్తోందని అంటున్నాడు.

ఎన్నికలు రాబోతూ ఉండటం, ప్రజా వ్యతిరేకత తనపై తీవ్రంగా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు ఇలా అడ్డం తిరిగాడు. అటు మోడీ వ్యతిరేకతిను, ఇటు తనపై వ్యతిరేకతను తట్టుకోలేననే లెక్కతో.. నాలుగేళ్ల వ్యతిరేకతను అంతా మోడీ మీదకు మళ్లించే యత్నం చేస్తున్నాడు చంద్రబాబు. మోడీ చేసిన అన్యాయం వల్లనే ఈ టర్మ్ లో తను ఏం చేయలేకపోయాను అని, వచ్చేసారి మళ్లీ అధికారం ఇవ్వాలని అడిగేస్తున్నాడు చంద్రబాబు.

పాతిక ఎంపీ సీట్లు ఇస్తే.. అని బాబు పాట పాడటంలో అర్థమిదే. ఎన్నికలు దగ్గరపడే సరికి.. తన వైఫల్యాలు అన్నీ మోడీ మీదకు తోసేసే ప్రక్రియను బాబు మరింత ముందుకు తీసుకెళ్లబోతున్నాడు. అందరికీ అన్నీ అర్థం అవుతున్నా.. ఎవ్వరికీ ఏదీ అర్థం కావడం లేదు, అంతా తను చెప్పిందే వింటున్నారు అన్నట్టుగా కథ నడిపించడం బాబు నైజం. ఈ నైజంతో బాబు దొరికిపోతూనే ఉన్నాడు.

భారతీయ జనతా పార్టీ వాళ్లు ఈ విషయంలో బాబును మరోసారి దొరకపుచ్చుకున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఎన్డీయే పక్షాల సమావేశంలో మాట్లాడుతూ.. మరోసారి మోడీనే ప్రధానిగా చేయాలని తీర్మానించిన విషయాన్ని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు బాబు మోడీని చాలా మాటలు అంటున్నాడు. మోసగాడు, ద్రోహి, హామీలు అమలు చేయలేదు.. అని బాబు అంటున్నాడు. ఈ మాటలన్నీ చంద్రబాబుకూ వర్తిస్తాయి. ఈయనా హామీల అమలు చేయలేదు కదా.

అయితే కొన్ని నెలల కిందట చంద్రబాబు మోడీని వీరుడు, శూరుడు అని కీర్తించాడు. ఎన్డీయే పక్షాల సమావేశంలో మాట్లాడుతూ.. మోడీ అద్భుతంగా పని చేస్తున్నాడని, ప్రజలకు మేలు చేస్తున్నాడని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఎన్డీయేకే అధికారం ఇవ్వాలని, మోడీనే ప్రధానిని చేయాలని చంద్రబాబు అప్పట్లో ధాటిగా ప్రసంగించాడు. తీర్మానం సైతం చేశాడు. ఈ విషయాన్నే బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నాడు. మళ్లీ మోడీనే ప్రధాని కావాలన్న చంద్రబాబు ఇప్పుడు మోడీని విమర్శిస్తున్న ప్రహసనం వైనం గురించి వారు ప్రస్తావిస్తున్నారు.