cloudfront

Advertisement


Home > Politics - Political News

బీజేపీ రివర్స్‌ గేర్‌: పోలవరంలో అవినీతి లేదట!

బీజేపీ రివర్స్‌ గేర్‌: పోలవరంలో అవినీతి లేదట!

పోలవరం ప్రాజెక్ట్‌కి సంబంధించి సంచలనాత్మక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత కొద్ది రోజులుగా పోలవరం ప్రాజెక్ట్‌ విషయంలో బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. అసలు పోలవరం ప్రాజెక్ట్‌తో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికిగానీ, ముఖ్యమంత్రి చంద్రబాబుకిగానీ అసలు సంబంధమే లేదంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ఆరోపిస్తోన్న సంగతి తెల్సిందే. ఓ పక్క పోలవరంతో చంద్రబాబుకి సంబంధం లేదంటూనే, ఇంకోపక్క పోలవరం ప్రాజెక్ట్‌లో చంద్రబాబు, ఆయన పుత్రరత్నం భారీ అవినీతికి పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపిస్తూ వచ్చారు. కానీ, అనూహ్యంగా ఇప్పుడు బీజేపీ స్వరం మార్చింది.

అసలంటూ ఇప్పటిదాకా పోలవరం ప్రాజెక్ట్‌లో అవినీతే జరగలేదట. ఇప్పటిదాకా.. అంటే, 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ అన్నమాట. పాత రేట్ల ప్రకారమే పనులు కొనసాగుతున్నాయనీ, చంద్రబాబు పెంచిన అంచనాల మేరకు పనులు జరగడంలేదనీ, ఒకవేళ దానికి తాము అనుమతిచ్చి వుంటే అవినీతి జరిగి వుండేదనీ, ఆ అవినీతి జరగకుండా తాము అడ్డుకున్నామనీ బీజేపీ నేత రఘునాథ్‌బాబు ఓ ఛానల్‌ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సెలవిచ్చారు. ఇదే పాట ఇతర బీజేపీ నేతలూ పాడుతున్నారిప్పుడు. 

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, ఈ రోజు పోలవరం ప్రాజెక్ట్‌ని సందర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం, నితిన్‌ గడ్కరీ పోలవరం పర్యటనలో పాలుపంచుకున్నారు. ఈ క్రమంలోనే నితిన్‌ గడ్కరీకీ, చంద్రబాబుకీ మధ్య 'మాటల తేడాలు' స్పష్టంగా కన్పించాయి. కెమిస్ట్రీ అస్సలేమాత్రం కుదరలేదు. నిర్వాసితుల సమస్యలు, పెంచిన అంచనాలు.. ఇతరత్రా విషయాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నితిన్‌ గడ్కరీ ప్రశ్నిస్తే, చంద్రబాబు ఒకింత ఇబ్బందిగా ఫీలయ్యారు. 

అయితే, పెంచిన అంచనాలకు సంబంధించి పూర్తి వివరాలు అందిస్తే, వాటిని పరిశీలించి.. ఆర్థిక శాఖకు పంపుతానని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించడం గమనార్హం. ఆర్థిక శాఖకు పంపడం వేరు, నిధులను మంజూరు చేయడం వేరు. 'నా సమస్యలు నాకున్నాయి.. అవేంటో మీకు తెలుసు..' అంటూ నితిన్‌ గడ్కరీ చమత్కరించేశారు కూడా. అంటే, వ్యవహారం క్లియర్‌. 2019లో పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తవుతుందని చెబుతూనే, నిధుల సమస్య లేదని క్లారిటీ ఇస్తూనే.. పూర్తిస్థాయి భరోసా మాత్రం ఇవ్వలేకపోయారు కేంద్ర మంత్రి. 

ఇలా నితిన్‌ గడ్కరీ పర్యటన ఈ రోజు పోలవరంలో జరిగిందో లేదో.. బీజేపీ నేతల స్వరం మారిపోయింది. పోలవరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందంటే, అది జాతీయ ప్రాజెక్ట్‌ గనుక ఆ మకిలి ప్రధాని నరేంద్రమోడీకీ అంటుకుంటుంది. ఈ నేపథ్యంలోనే, ఢిల్లీలో బీజేపీ అధిష్టానం నుంచి ఏపీ బీజేపీ నేతలకు అవినీతి విషయంలో 'క్లాస్‌' తీసుకోవడం జరిగిందనీ, ఆ కారణంగానే బీజేపీ నేతల స్వరం ఇప్పుడు ఇలా మారిందనీ అర్థం చేసుకోవాలేమో. 

కొసమెరుపేంటంటే.. నితిన్‌ గడ్కరీ పర్యటన సందర్భంగా ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు కావొచ్చు, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కావొచ్చు.. చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. గడ్కరీ మాట్లాడే మాటలేవీ ఈ ఇద్దరికీ నచ్చలేదు. అదే సమయంలో, ఈ ఇద్దరూ గడ్కరీ పర్యటనలో ఫ్రీగా వుండాలనుకున్నా వుండలేకపోయారు. గడ్కరీకి ఏదన్నా మాట చెప్పాలని చంద్రబాబు, దేవినేని ఉమ ప్రయత్నించినా.. ఆ సమయంలో గడ్కరీ, అధికారులతో ముచ్చట్లలో మునిగిపోయేవారు. ఈ మాత్రం దానికి, కేంద్ర మంత్రి అధికారిక పర్యటనలో ముఖ్యమంత్రి, రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అవసరమా.? అన్న అనుమానం చాలామందికి కలిగింది.