Advertisement

Advertisement


Home > Politics - Political News

ఎమ్మెల్యేల‌ను కాపాడుకునే ప‌నిలో బీజేపీ!

ఎమ్మెల్యేల‌ను కాపాడుకునే ప‌నిలో బీజేపీ!

గ‌త నాలుగైదేళ్లుగా వివిధ రాష్ట్రాల్లో వేరే పార్టీ ఎమ్మెల్యేల‌ను త‌న వైపుకు తిప్పుకుని ప్ర‌భుత్వాల‌ను కూల‌గొట్ట‌డంలో పేరు తెచ్చుకున్న భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేల‌ను కాపాడుకునే ప‌ని ప‌డింది. ఇది ప‌శ్చిమ బెంగాల్ లో జ‌రుగుతోంది.  

బెంగాల్ లో బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే ప‌నిలో కానీ, ప్ర‌భుత్వాన్ని నిల‌బెట్టుకునే ప‌నిలో కానీ లేదు. దొరికింది ప్ర‌తిప‌క్ష వాస‌మే అయినా, ఉన్న ఎమ్మెల్యేల‌ను కాపాడుకోవ‌డం క‌మ‌లం పార్టీకి ఇప్పుడు క‌ష్టం అవుతున్న‌ట్టుగా ఉంది. బీజేపీ చ‌రిత్ర‌లో తొలి సారి బెంగాల్ లో అత్య‌ధిక స్థాయిలో అసెంబ్లీ సీట్ల‌ను గెలిచింది. అయితే ఇప్పుడు గెలిచిన వారిలో కొంద‌రు అప్పుడే అధికార ప‌క్షం వైపు చేరే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు.

టీఎంసీ నుంచి ఎన్నిక‌ల ముందు సాగిన వ‌ల‌స‌ల‌తో బెంగాల్ లో బీజేపీ మీసం మెలేసింది. అయితే టీఎంసీ నుంచి బీజేపీలోకి చేరిన నేత‌ల్లో చాలా మంది ఇప్పుడు తిరుగుముఖం ప‌డుతున్నారు. ఈ జాబితాలో కేంద్ర మాజీ మంత్రి ముకుల్ రాయ్ కూడా చేరిపోయారు. రాయ్ ఇప్ప‌టికే టీఎంసీ తీర్థం తిరిగి పుచ్చేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌లువురు ఎమ్మెల్యేలు, కొంద‌రు బీజేపీ నేత‌లు కూడా టీఎంసీలోకి చేరిపోవ‌డానికి ప్ర‌య‌త్నాలు సాగిస్తున్న‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. 

రాయ్ తో ఇప్ప‌టికే ప‌లువురు స‌మావేశం అయ్యార‌ట‌. వీరంతా ఆయ‌న అనుచ‌ర‌గ‌ణం. వీరంతా రాయ్ ప్రోద్బ‌లంతో గ‌తంలో ఇత‌ర పార్టీల నుంచి టీఎంసీలోకి చేరి, ఆ త‌ర్వాత ఆయ‌న వెంట బీజేపీలోకి వెళ్లిన బాప‌తు. ఇప్పుడు వీళ్లంతా తిరిగి టీఎంసీలోకి చేరే ప్ర‌య‌త్నాల్లో ఉన్నార‌ట‌. 

మ‌రోవైపు ఈ టీఎంసీ వ‌ల‌స ప‌క్షుల‌తో సంబంధం లేకుండా కొంద‌రు ఎమ్మెల్యేలు సైతం బీజేపీని వీడి టీఎంసీలోకి చేరే ప్ర‌య‌త్నాల్లో ఉన్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే బీజేపీ నిర్వ‌హిస్తున్న ఎమ్మెల్యేల స‌మావేశాల‌కు కొంద‌రు గైర్హాజ‌రు అయిన‌ట్టుగా భోగ‌ట్టా. ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ కూడా ఇప్పుడు బీజేపీకి దూర‌దూరంగా సాగుతున్నార‌ని టాక్. 

ఈ అంశంపై బెంగాల్ బీజేపీ శాస‌న‌స‌భా ప‌క్ష నేత సువేందు అధికారి స్పందించారు. ముకుల్ రాయ్ పై అన‌ర్హ‌త వేటుకు ఫిర్యాదు చేయ‌నున్న‌ట్టుగా ఆయ‌న ప్ర‌క‌టించారు. త‌మ పార్టీ గీత దాటిన ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటుకు ఫిర్యాదు చేయ‌బోతున్న‌ట్టుగా ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ అంశం పై కేంద్ర న్యాయ‌శాఖ‌తో చ‌ర్చిస్తార‌ట‌! మొత్తానికి త‌మ పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోతుండే స‌రికి బీజేపీ వాళ్ల‌కు చ‌ట్టం, న్యాయం చాలా తొంద‌ర‌గా గుర్తుకు వ‌స్తున్న‌ట్టున్నాయి!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?