Advertisement

Advertisement


Home > Politics - Political News

బీజేపీ.. వాపా? బలుపా!

బీజేపీ.. వాపా? బలుపా!

ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ దక్కిన ఓట్లు అక్షరాల రెండు లక్షల అరవై వేల చిల్లర ఓట్లు. మూడు కోట్ల మందికి పైగా ఏపీ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటే.. అందులో బీజేపీ వాటా రెండు లక్షల అరవై వేల స్థాయి అంటే ఏపీలో బీజేపీకి ఎదురైనది ఎంతటి దారుణ పరాభవమో ఇక వేరే వివరించనక్కర్లేదు. కేవలం 0.84శాతం ఓట్లు బీజేపీకి దక్కాయి. ఏపీని విభజించిన పాపాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీ ఇవే ఎన్నికల్లో 1.17 శాతం ఓట్లను సంపాదించుకుంది. ఏపీలో నోటాకు పడిన ఓట్లు 1.28 శాతం. భారతీయ జనతా పార్టీకి దక్కిన ఓట్ల శాతం మాత్రం 0.84! కాంగ్రెస్‌ పార్టీ, నోటాలు కూడా భారతీయ జనతా పార్టీ కన్నా ఎక్కువ ఓట్ల శాతాన్ని సంపాదించుకోవడాన్ని గమనించవచ్చు.

కాంగ్రెస్‌ పార్టీ, నోటాలు కూడా భారతీయ జనతా పార్టీ కన్నా ఎక్కువ ఓట్ల శాతాన్ని సంపాదించుకోవడాన్ని గమనించవచ్చు. సాధారణంగా ఇలాంటి ఫలితం పొందిన పార్టీ ఏదైనా ఆ తర్వాత మారు మాట్లాడలేదు! పోల్‌ అయిన  ఓట్లలో కనీసం ఒక్కశాతం ఓట్లను పొందని పార్టీ ఆ తర్వాత ప్రజల గురించి మాట్లాడినా, రాజకీయంగా ఏదైనా అలికిడి చేసినా అంతకన్నా కామెడీ ఉండదు. కానీ బీజేపీ ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఉండటమే అంతకు మించిన ప్రహసనం!

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో సంచలన విజయం సాధించడం, అదే సమయంలో తెలుగుదేశం పార్టీ తన చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయి దారుణ పరాజయం పాలవ్వడం.. ఈ పరిణామాల్లో బీజేపీ నేతలు తొడలు కొడుతున్నారు, మీసాలు మెలేస్తూ ఉన్నారు! అందుకు తగ్గట్టుగా నలుగురు రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీలోకి చేరడం, ఇంకా అనేకమంది తెలుగుదేశం పార్టీ నేతలు కమలం పార్టీ వైపు చూస్తూ ఉండటం.. వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ. ఈ చేరికలతో తాము బలోపేతం కాబోతున్నట్టుగా వారు చెబుతూ ఉన్నారు!

సరే.. ఫిరాయింపులకు రాజముద్ర వేశారు. అంతా రాజ్యాంగబద్ధమే అన్నారు. అయితే అలా ఫిరాయించిన వారికి ప్రజలతో ఏమైనా సంబంధం ఉందా? వాళ్లకు ఉన్న ప్రజాబలం ఎంత? అనేది పరిశీలించాల్సిన అంశం. ఆ నలుగురిలో బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని ఎగ్గొట్టినవారు, భారీగా బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకుని వ్యాపారం అంటూ ఇన్వెస్ట్‌ చేసి వాటిని రీ పే చేయలేని దశలో ఉన్న వ్యక్తి, మరో కాంట్రాక్టర్‌.. ఇదీ వాళ్ల చరిత్ర! వాళ్లు పోటీచేస్తే కనీసం పంచాయితీ ప్రెసిడెంట్‌గా నెగ్గడం కూడా కష్టమే! అలాంటి ఎంపీలను భారతీయ జనతా పార్టీ చేర్చుకుంది.

రాజ్యసభలో బీజేపీ బలం కొన్నాళ్లు పెరగడానికి తప్ప.. ఆ చేరికలతో బీజేపీకి అనాపైసా ఉపయోగం ఉండకపోవచ్చు. అన్నింటికి మించిన అంశం ఏమిటంటే.. వాళ్లను చంద్రబాబు నాయుడే బీజేపీలోకి పంపారనే ప్రచారం జరగడం. కేవలం ఢిల్లీలో అధికార పార్టీలో తన వాళ్లు కొందరు ఉండాలనే లెక్కలతో చంద్రబాబు నాయుడే వాళ్లను బీజేపీలోకి పంపారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో తాము పట్టిన చేపల విలువ ఏమిటో కమలం పార్టీకే తెలియాలి. కేవలం వారి వ్యక్తి గత స్వార్థం కోసం బీజేపీలోకి చేరిన నేతలతో ఆ పార్టీ బలోపేతం అవుతుందని ఎవరైనా చెబుతుంటే.. వాళ్లను పిచ్చోళ్లలా చూస్తున్నారు  ఏపీ ప్రజలు!

అయితే జగన్‌ అలాంటి రాజకీయాలకు నో అంటున్నారు. తన విషయంలోనే అలాంటి నియమాలను పెట్టుకుని రాజకీయం చేస్తున్న వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఫిరాయిస్తే అలాంటి రాజకీయాలను జరగనీయకపోవచ్చు. పూర్తి అధికారం స్పీకర్‌దే అనేశారు. కాబట్టి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు బీజేపీకి చేరితే ఉప ఎన్నికలు తప్పకపోవచ్చు. వాటిల్లో గెలుస్తామనే నమ్మకం ఉంటే.. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవచ్చు. బీజేపీకి ఇప్పుడున్న మరోమార్గం విలీనం. పదహారు మంది ఎమ్మెల్యేలు ఒకేసారి కండువాలు మార్చుకుంటే అప్పుడు బీజేపీకి కొంత సౌలభ్యం ఉంటుంది.

అయితే అప్పుడు కూడా అనర్హత వేటుపడినా పడొచ్చు. ఎందుకంటే.. విలీనాలు అనేవి నిఖార్సైన రాజకీయంలో లేవు. విలీనాలు అనేవి ఎన్నికల సంఘం ద్వారా జరగాలి కానీ చట్టసభల నుంచి కాదు. కాబట్టి.. పదహారు మంది ఫిరాయించినా వారందరి మీదా అనర్హత వేటుపడే అవకాశం ఉంది. అయితే అలాంటప్పుడు కోర్టులకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రాజ్యసభలోనూ, పలు రాష్ట్రాల అసెంబ్లీల్లో అలాంటి విలీనాలు జరిగాయి కాబట్టి, తమ విలీనాన్ని ఆమోదించాలని బీజేపీ కోర్టుకు వెళ్లవచ్చు. అయితే పదహారు మంది ఎమ్మెల్యేలు ఒకేసారి రెడీ అవుతారా? అనేది శేష ప్రశ్న.

అరెస్టులు, కేసుల భయంతోనే కాషాయ కండువాలు వేసుకుంటున్నారు. అధికారం చేతిలో ఉన్నప్పుడు అలాంటివారు చేయని అక్రమం అంటూలేదు. పాల్పడని అనైతిక చేష్టలులేవు. అందుకే ఇప్పుడు అధికారం చేజారేసరికి వారికి భయం పట్టుకుంది. అందుకే బీజేపీ మంత్రం పఠిస్తున్నారు. అలాంటి అక్రమార్కులకు కాషాయ కండువా వేసి, వారిని దేశభక్తులుగా చేస్తున్నారు బీజేపీవాళ్లు! అలాంటి వాళ్లు ఇక నుంచి చెప్పే దేశభక్తి పాఠాలు, చెప్పే నీతి సూక్తులు విని ఏపీ ప్రజలు బీజేపీకి జై కొట్టాలన్నమాట!

తీరా కేంద్రంలో అధికారాన్ని సొంతం చేసుకున్నాకా చంద్రబాబుతో కలిసి బీజేపీ మోసానికి పాల్పడింది. ఇప్పుడేమో హోదా ముగిసిన అధ్యాయం, ఆ పేరు ఎత్తితే ప్రజలను మోసం చేయడమే అంటూ కమలం పార్టీ నేతలు కుట్ర పూరిత మాటలు మాట్లాడుతున్నారు. బీజేపీ కేంద్రంలో అధికారం సొంతం చేసుకుందేమో కానీ, ఏపీలో మాత్రం ఎక్కడా డిపాజిట్‌ రాలేదనే విషయాన్ని మరిచివారు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ నియోజకవర్గంలోనూ కనీసం వెయ్యి ఓట్లు పొందలేనివాళ్లు ఇప్పుడు  రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఉన్నారు. పేరుగొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంది వాళ్ల పరిస్థితి.

అయినా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలానే వాళ్లు మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి మాట్లాడుతూ తామే ఏపీలో ఎలా ప్రత్యామ్నాయం అవుతామని వారు ఎలా అనుకుంటున్నారో వారికే తెలియాలి! ఇక కమలం పార్టీ తన మార్కు రాజకీయం చేయడానికి, అమిత్‌ షా స్ట్రాటజీలు వర్కవుట్‌ చేయడానికి.. అనుకూల మతపరమైన రాజకీయానికి కూడా ఏపీలో అంత అవకాశం లేదు! మతపరంగా రచ్చలు రేగే పరిస్థితి ఉన్నచోటే కమలం పార్టీ తొందరగా తన ఉనికిని చాటుకోవడానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఏపీలో అలాంటి పరిస్థితులు అంతగా లేవు. కాబట్టి అలా పాగా వేయడానికి అవకాశాలు లేవు.

ఎలాగూ తెలుగుదేశం పార్టీ పతనాసవస్థలో కొట్టుమిట్టాడుతూ ఉంది. చంద్రబాబుకు వయసు మీద పడుతూ ఉంది. లోకేష్‌ సంగతి సరేసరి! లోకేష్‌ నాయకత్వాన్ని ఇప్పుడున్న టీడీపీవాళ్లు కూడా ఒప్పుకోలేని పరిస్థితి ఉంది. పార్టీ వ్యతిరేక గాలిలో తాము ఎమ్మెల్యేలుగా అయినా గెలించామని, కనీసం  ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయిన చంద్రబాబు నాయుడు తనయుడు తమ మీద అథారిటీని చెలాయించడాన్ని వారు సహించలేకపోవచ్చు. తెలుగుదేశం అనుకూలమైన కులంలోని ప్రముఖులు బీజేపీ వైపు ట్రాన్స్‌ఫర్‌ కావడానికి రెడీగానే కనిపిస్తున్నారు. ఇలాంటి పరిణామాల మధ్యన ముందుగా రాష్ట్రానికి ఏదైనా ఒక గట్టి మేలు తలపెట్టాలి బీజేపీ. అది ప్రత్యేకహోదానే. ఆ విషయంలో సానుకూలంగా వ్యవహరించి, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడి.. ఆ తర్వాత రాజకీయంగా ఏం చేసినా చెల్లుతుంది!

ప్రత్యర్థులు ఏకమై సుధీర్ విజయాన్ని ఆపలేకపోయారు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?