Advertisement

Advertisement


Home > Politics - Political News

జనసేన ఉబలాటం.. బీజేపీకి ప్రాణ సంకటం..!

జనసేన ఉబలాటం.. బీజేపీకి ప్రాణ సంకటం..!

నాలుగు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ పైచేయి స్పష్టంగా తెలుస్తోంది. 4వేలకుపైగా సర్పంచ్ స్థానాలు మావేనంటూ టీడీపీ ప్రకటిస్తున్నా అది వట్టిమాటేనని తేలిపోయింది. రాగాపోగా.. జనసేన మాత్రం కాస్త హడావిడి చేస్తోంది. 

టీడీపీ నేతలు కూడా సర్పంచ్ లతో పరేడ్ పెట్టడానికి వెనకాడుతున్న వేళ, మా పార్టీ గెలిపించుకున్న సర్పంచ్ లు వీరేనంటూ జనసేన నాయకులు ఫొటోలకు ఫోజులిస్తున్నారు. వారితో ప్రసంగాలు కూడా ఇప్పిస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. ఈ ప్రచార ఆర్భాటాలు ఇప్పుడు బీజేపీకి తలనొప్పిగా మారాయి. 

బీజేపీ తరపున అక్కడక్కడా సీనియర్ నాయకులు తమ కుటుంబ సభ్యులను, బంధువులను సర్పంచ్ లుగా గెలిపించుకున్నా ఎక్కడా ప్రచారం చేసుకోలేదు. ఒకవేళ ప్రచారం చేసుకున్నా, పరేడ్ పెట్టాలనుకున్నా కూడా బీజేపీ తరపున గెలిచిన అభ్యర్థుల సంఖ్య పెద్దది కాదు, అందుకే ఆ పార్టీ సైలెంట్ గా ఉంది.

ఇంకోవైపు తమ సహచర పార్టీ జనసేన మాత్రం పంచాయతీల ఫలితాల ఊపుతో రెచ్చిపోతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఇరకాటంలో పడింది. అటు తిరుపతి పార్లమెంట్ కి జరగబోతున్న ఉప ఎన్నికల సీటు డిమాండ్ చేస్తున్న వేళ, జనసేన కంటే తమదే పైచేయి అని నిరుపించుకోవాల్సిన అవసరం బీజేపీకి ఉంది. ఈ దశలో కనీసం పంచాయతీల్లో కూడా పట్టులేదని తేలితే పరువు పోతుందని భయపడుతోంది కమలదళం.

అందుకే మున్సిపల్ ఎన్నికల కోసం కసరత్తులు మొదలు పెట్టింది. మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలు మెరుగుపరిచేందుకు, ఇంచార్జీలను ప్రకటించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా.. ఇలా అన్ని ప్రాంతాలకు, అన్ని జిల్లాలకు సీనియర్లను బాధ్యులుగా చేస్తూ లిస్ట్ ప్రకటించారు.

బీజేపీ హడావిడితో ఫలితం ఉంటుందా..?

స్థానికంగా కార్యకర్తల పట్టున్న టీడీపీకే పంచాయతీల్లో ఘోర పరాభవం ఎదురైంది. పార్టీ సంస్థాగత నిర్మాణం లేని బీజేపీకి  మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో ఎంట్రీ ఉంటుందా అనేది అనుమానమే. 

అయితే కనీసం తిరుపతి పార్లమెంట్ పరిధిలోకి వచ్చే స్థానాల్లో అయినా రెండో స్థానంలో ఉండాలనేది బీజేపీ ఆశ. అందుకే ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తున్నారు బీజేపీ నేతలు. ఇన్ చార్జ్ లంటూ హడావిడి చేస్తున్నారు.

జనసేనను నిలువరించడమే తక్షణ కర్తవ్యం..

బీజేపీ, జనసేన మిత్రపక్షాలే అయినప్పటికీ, అంతర్గతంగా ఆ రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ బలవంతం వల్లే జనసేన నామినేషన్లకు దూరమైంది. అదే సమయంలో ఇటు తిరుపతి ఉప ఎన్నిక సీటు తమకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా కూడా అధినాయకత్వం కనికరించడంలేదు.

ఈ దశలో ఏపీలో బీజేపీకంటే జనసేన పటిష్టంగా ఉందన్న మెసేజ్ బలంగా పంపాలని చూస్తున్నారు జనసైనికులు. ప్రతిసారి బీజేపీని ప్రాథేయపడే కంటే తన సత్తా చూపించి డిమాండ్ చేయాలనేది జనసేన ఆశ. జనసేనను నిలువరించి తమదే పైచేయి అని చెప్పుకోవాలనేది బీజేపీ పన్నాగం. వీరి ఆధిపత్యపోరు అంతిమంగా టీడీపీకే లాభం అవుతుందనేది రాజకీయ విశ్లేషకుల మాట. 

త్వరలోనే తెలుగులో మాట్లాడుతా

ఏపీ మంత్రిమండలి కీలక నిర్ణయాలు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?