cloudfront

Advertisement


Home > Politics - Political News

వింత.. మొండి వాదనలో ఘటికుడు...!

వింత.. మొండి వాదనలో ఘటికుడు...!

సాధారణంగా ఎక్కువమంది రాజకీయ నాయకులు, పాలకులు తాము చేసిన తప్పులపై వింతగా, మొండిగా వాదిస్తుంటారు. తప్పును ఏమాత్రం అంగీకరించరు. అడ్డదిడ్డంగా వాదిస్తూ మోకాలికి, బోడిగుండుకు ముడేసే ప్రయత్నం చేస్తారు. తాము ఉత్తములమని, ఎదుటివారు అథములని ప్రచారం చేస్తారు. తప్పులను ఎదుటివారిపై తోసేసి తప్పించుకుంటారు.

ఇన్ని పాట్లు పడటానికి కారణం వారి దగ్గర జవాబులు లేకపోవడమే. దేశంలోనే సీనియర్‌ నాయకుడినని చెప్పుకునే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వింత వాదనలు చేయడంలో, మొండిగా మాట్లాడటంలో, తాను చేసిన తప్పులను ఎదుటివారి మీద రుద్దడంలో ఘటికుడు. నిజానికి ఈ వ్యవహారశైలి ఆయనకు తగింది కాదు. హుందాగా ఉండదు. కాని స్వభావం మారదు.

బీజేపీ నుంచి సగం విడిపోయినప్పటినుంచి (కేంద్రంలో మంత్రి పదవులు వదులుకొని ఎన్‌డీఏలో కొనసాగుతున్నారు) ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వారూ అదే పనిలో ఉన్నారనుకోండి. అసెంబ్లీలోనూ బాబు కేంద్రంపై, బీజేపీ విమర్శల దాడి కొనసాగించారు. ఆయన చేస్తున్న వింత వాదనకు బీజేపీ నేతలూ ఘాటుగానే సమాధానాలిచ్చారు.

కాని వారి ప్రశ్నలకు, విమర్శలకు బాబు దగ్గర జవాబులు లేవు. ఆయనకు తెలిసిన విద్య కేవలం మొండిగా వాదించడం, చెప్పిన విషయాలే రోజుల తరబడి విసుగూ విరామం లేకుండా చెప్పుకుంటూపోవడం. సెంటిమెంట్‌ పేరుతో రాష్ట్రాన్ని ఎలా విభజించారని ప్రశ్నించారు. విభజన సెంటిమెంటును గౌరవించినట్లే ప్రత్యేక హోదా సెంటిమెంటునూ గౌరవించాలన్నారు. రాష్ట్ర విభజనలో బీజేపీ భాగస్వామిగా ఉందన్నారు.

బీజేపీ భాగస్వామనే విషయం అవాస్తవం కాదు. కాని టీడీపీ కూడా భాగస్వామే కదా. ఆ సంగతి బాబు మర్చిపోయారా? రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఆయన రెండుసార్లు కేంద్రానికి లేఖలు ఇవ్వడాన్ని  బీజేపీ నాయకులు గుర్తు చేశారు. 'అవును..లేఖలు ఇచ్చాను' అని చెప్పే ధైర్యం బాబుకు లేదు. ఆయన చెప్పకపోయినా ఏపీ ప్రజలకు ఈ విషయం తెలుసు.

'ఇది ప్రజలు కోరుకోని విభజన' అని తరచుగా చెబుతుంటారు. కాని తాను కోరుకున్నారు కదా. వైకాపా ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని బాబు అసెంబ్లీలో విమర్శించారు. 'మోదీపై విశ్వాసం ఉందంటూనే ఆయనపై అవిశ్వాసం ఎలా పెడతారు?' అని ప్రశ్నించారు. మరి ఎన్‌డీఏలో కొనసాగుతూనే టీడీపీ ఎందుకు బీజేపీపై పోరాటం చేస్తోంది? బయటకు ఎందుకు రావడంలేదు?

ఎన్‌డీఏలోనే ఉంటే కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఇంకా సహాయం చేస్తుందని బాబు ఆశలు పెట్టుకున్నారు. పూర్తిగా బయటకొస్తే అందే సహాయం కూడా ఆగిపోతుంది కాబట్టి కొనసాగుతున్నట్లు ఆయనే చెప్పారు. మరి ఆయనకు కూడా మోదీపై విశ్వాసం ఉన్నట్లే కదా. వైకాపా, బీజేపీ కలిసిపోయాయని ప్రచారం చేయడం ద్వారా ప్రయోజనం పొందడానికి బాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని జగన్‌ ప్రకటించినప్పటినుంచి చంద్రబాబు మండిపడుతున్నారు. బీజేపీకి పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి అవిశ్వాసం నెగ్గదని, దానివల్ల ప్రత్యేక హోదా రాదని అంటున్నారు. అది నిజమే. ఈ విషయం జగన్‌కూ తెలుసు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు, బంద్‌లు చేసినట్లుగానే అవిశ్వాస తీర్మానం పెట్టడం కూడా ఒక నిరసన ప్రక్రియ. ధర్నాలు, బంద్‌లు చేయగానే సమస్యలు పరిష్కారమవుతున్నాయా? కాని ప్రజాగ్రహం సర్కారుకు తెలుస్తుంది. అవిశ్వాసం పెట్టాక ఒకవేళ చర్చ జరిగితే కేంద్రాన్ని ఎండగట్టే అవకాశం ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెసు ప్రభుత్వాలు ఉన్నప్పుడు టీడీపీ అవిశ్వాస తీర్మానాలు పెట్టలేదా? అసలు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదన చేసింది పవన్‌ కళ్యాణ్‌. ఆ సవాలును జగన్‌ స్వీకరించి తీర్మానం పెడతామని, టీడీపీ మద్దతు ఇవ్వాలని కోరారు. కాని చంద్రబాబు తెలివిగా పవన్‌ ప్రతిపాదన గురించి మాట్లాడటంలేదు. చంద్రబాబు గొప్పలు, మొండి వాదనల గురించి ఎంత చెప్పుకున్నా తరగదు.