Advertisement

Advertisement


Home > Politics - Political News

అసెంబ్లీ సాక్షిగా బుగ్గన చాకిరేవు

అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన ప్రసంగం ప్రారంభించే ముందు, రోజూ చెప్పే పాయింట్లపైనే ఆయన వెళ్తారని అనుకున్నారంతా. ఊహించినట్టుగానే చాలా నెమ్మదిగా పాయింట్ లోకి వచ్చారు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. రాజధాని ప్రాంతంపై జరిగిన అన్ని వ్యవహారాలు ఒక్కొక్కటే బైటపెట్టారు. గంటూరు, నూజివీడు ప్రాంతాలను రాజధానిగా చేస్తామంటూ ముందు లీకులిచ్చి.. అమరావతి ప్రాంతంలో భూముల కొనుగోలు పూర్తి చేశారని, ఆ తర్వాతే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించారని గుర్తు చేశారు బుగ్గన. 

గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా బుగ్గన ఈ పేర్లన్నీ బైటపెట్టినా.. ఈసారి మరింత వివరంగా చెప్పుకొచ్చారు. మొత్తం 4070 ఎకరాల భూములు టీడీపీ నేతలు అక్రమంగా కొనుగోలు చేశారని వివరించారు బుగ్గన. ఇది కేవలం అధికారిక లెక్కలేనని, అనధికారికంగా ఇంకా ఎక్కువే ఉన్నాయని చెప్పారు. చంద్రబాబు సహా హెరిటేజ్ సంస్థలకు ఉన్న భూములు, ఇతర నాయకులకు ఉన్న భూముల వివరాలు, వారి బినామీలకు ఉన్న భూముల వివరాలు కూడా అసెంబ్లీలో చదివి వినిపించారు. 

"మొత్తం అప్పు మయం. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకెళ్లారు. పోనీ ప్రజలంతా ఈ అప్పులు కట్టాలని  అనుకుంటే.. ఈ లిస్ట్ ప్రకారం చూసుకుంటే.. అమరావతి చుట్టుపక్కల ఓ 20-30 మంది మాత్రమే కొన్నారు. 28వేల రైతుల్లో 14వేల మంది భూములు అమ్ముకున్నారంటే ఎవరికి అమ్మారనేది అందరికీ తెలుసు. అంటే.. రాష్ట్రమంతా కలిసి అప్పులు చేసి, చంద్రబాబుకు సంబంధించిన 20-30 మందిని ధనికుల్ని చేయాలి. ఇది భావ్యమా." 

ఏయే తేదీల్లో ఎక్కడెక్కడ, ఎన్నెన్ని ఎకరాలు, డాక్యుమెంట్ల నెంబర్లతో సహా బుగ్గన చదివి వినిపించే సరికి చంద్రబాబు మొహం మీద నెత్తుటి చుక్క లేదు. జూన్ 8న ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు.. నెలరోజుల్లోపే ఈ కొనుగోళ్లన్నీ పూర్తి చేశారని, అన్నీ పూర్తయిన తర్వాత రాజధాని ప్రాంతాన్ని డిసెంబర్ లో నోటిఫై చేశారని చెప్పారు. 

ఆర్థిక మంత్రి వరసబెట్టి పేర్లు చదువుతుంటే.. స్పీకర్ కూడా అవాక్కయ్యారు. ఈ లెక్కలన్నీ తెలియని మిగతా టీడీపీ నేతలు కూడా షాకయ్యారు. చంద్రబాబు కూడా మైండ్ బ్లాక్ అయి చూస్తున్నారే కానీ ఖండించే పరిస్థితిలో లేరు. మొత్తమ్మీద అసెంబ్లీలో గొడవ చేద్దామనుకున్న టీడీపీ నేతలంతా బుగ్గన ప్రసంగిస్తున్నంత సేపు అలా షాక్ లో ఉండిపోయారు. ఇన్ని లెక్కలు బైటపడ్డాక ఇంక గొడవెందుకులే అని తేలు కుట్టిన దొంగలా సైలెంట్ అయిపోయారు. 

మూడు రాజధానుల ప్రకటన చేస్తూనే.. అసలు అమరావతిలో తెరవెనక జరిగిన వ్యవహారం మొత్తాన్ని అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టారు బుగ్గన. తమ ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే ఉద్దేశం లేదని... గతంలో జరిగిన తప్పుల్ని సరిదిద్దుతూ.. మరో వందేళ్లయినా రాష్ట్రం కలిసికట్టుగా ఉండడం కోసం, మరోసారి విభజన జరగకుండా ఉండేలా పాటుపడుతున్నామని తెలిపారు. బుగ్గన ఈ వివరాలు వెల్లడించిన వెంటనే, దీనిపై విచారణ జరిపించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించారు స్పీకర్. దీనికి వెంటనే అంగీకారం తెలిపారు ముఖ్యమంత్రి జగన్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?