Advertisement

Advertisement


Home > Politics - Political News

క‌డ‌ప ఎంపీ స‌న్నిహితుడిపై సీబీఐ చార్జిషీట్‌

క‌డ‌ప ఎంపీ స‌న్నిహితుడిపై సీబీఐ చార్జిషీట్‌

క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి అత్యంత స‌న్నిహితుడైన వైసీపీ నాయ‌కుడు దేవిరెడ్డి శివ‌శంక‌ర్‌రెడ్డిపై సీబీఐ చార్జిషీట్ దాఖ‌లు చేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో ఇవాళ సీబీఐ మ‌రో ముంద‌డుగు వేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. త‌న తండ్రి హ‌త్య కేసులో డాక్ట‌ర్ సునీత కొంద‌రు కుటుంబ స‌భ్యుల‌తో పాటు దేవిరెడ్డి శివ‌శంక‌ర్‌రెడ్డి పేరును కూడా ప్ర‌ధానంగా ప్ర‌స్తావించిన సంగ‌తి తెలిసిందే.

ఈ మేర‌కు ఆమె హైకోర్టుకు స‌మ‌ర్పించిన అఫిడ‌విట్‌లో వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆయ‌న తండ్రి భాస్క‌ర్‌రెడ్డితో పాటు దేవిరెడ్డి శంక‌ర్‌రెడ్డి పేరును కూడా చేర్చడం క‌ల‌క‌లం రేపింది. డాక్ట‌ర్ సునీత స‌మ‌ర్పించిన ఆధారాల‌తో పాటు సీబీఐ విచార‌ణ‌లో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగు చూశాయి. ఈ కేసులో నిందితుడైన ద‌స్త‌గిరి అప్రూవ‌ర్‌గా మారి సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించాడు.

ఈ కేసులో తాజాగా దేవిరెడ్డిని ఐదో నిందితుడిగా సీబీఐ పేర్కొంది. ఇందులో భాగంగా పులివెందుల కోర్టులో సీబీఐ చార్జిషీట్ దాఖ‌లు చేసింది. గ‌త ఏడాది న‌వంబ‌ర్ 17న దేవిరెడ్డిని హైద‌రాబాద్‌లో సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం దేవిరెడ్డి క‌డ‌ప కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ప‌లుమార్లు బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నా ఫ‌లితం లేకుండా పోయింది. 

వివేకా హ‌త్య కేసులో శివ‌శంక‌ర్‌రెడ్డి కీల‌క నిందితుడ‌ని, బెయిల్‌పై బ‌య‌టికి వ‌స్తే సాక్ష్యుల‌ను ప్ర‌భావితం చేస్తాడ‌ని సీబీఐ అభ్యంత‌రం చెబుతూ వ‌స్తోంది. సీబీఐ వాద‌న‌తో న్యాయ‌స్థానం ఏకీభ‌విస్తుండ‌డంతో ఆయ‌న‌కు బెయిల్ ద‌క్క‌లేదు. తాజాగా ఆయ‌న‌పై చార్జిషీట్ దాఖ‌లు కావ‌డం వైసీపీ శ్రేణుల‌కు ఆందోళ‌న క‌లిగిస్తోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?