cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

అన్ లాక్ పై కేంద్రం పునరాలోచిస్తోందా..?

అన్ లాక్ పై కేంద్రం పునరాలోచిస్తోందా..?

లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత దేశంలో కరోనా వ్యాప్తి రేటు గణనీయంగా పెరిగింది. మరణాల సంఖ్య అదుపులో ఉండటం, డిశ్చార్జిల సంఖ్య పెరుగుతూ ఉండటం కాస్త ఊరటనిచ్చే అంశమైనా.. రోజు రోజుకీ కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య మాత్రం తగ్గకపోవడం ఆందోళనపడాల్సిన విషయం. ప్రజా రవాణాను అనుమతించడం, షాపులు తెరవడం, ప్రజల కదలికలపై ఆంక్షలు ఎత్తేయడం వల్లే భారత్ లో కరోనా సామాజిక వ్యాప్తి దశకు వస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. 

ఈ నేపథ్యంలో మరో 4 రోజుల్లో షాపింగ్ మాల్స్, ప్రార్థనా మందిరాలు, హోటళ్లు, రెస్టారెంట్లు తెరుచుకునేందుకు కేంద్రం ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే పెరుగుతున్న కేసుల దృష్ట్యా వీటిపై పునరాలోచనలో ఉన్నట్టు సమాచారం. గతంలో కూడా లాక్ డౌన్ సమయంలో ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలకు అనుమతులిచ్చినట్టే ఇచ్చి.. వెనువెంటనే కరోనా భయంతో వాటిని నిలిపివేసింది కేంద్రం.

లాక్ డౌన్ తీసేశారనే సంబరంలో ప్రజలంతా తిరిగి యథాప్రకారం బయట తిరిగేస్తున్నారు. మాస్కులు వేసుకోవడం, వ్యక్తిగత శుభ్రత పాటించడం అనే అంశాలపై ఎవరూ సీరియస్ గా లేరు. దీంతోపాటు.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిపై గట్టి నిఘా లేకపోవడంతో గ్రామాల్లో నష్టం జరిగిన తర్వాత వారిని గుర్తిస్తున్నారు. ఇతర ప్రాంతాలనుంచి వచ్చినవారిని హోమ్ క్వారంటైన్ కి అనుంతించడం, ఆ నియమాల్ని వారు పక్కనపెట్టడం, ఈలోగా వారికి పాజిటివ్ తేలడం.. కొత్త కొత్త కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేడయం.. ఇదీ గ్రామాల్లో జరుగుతున్న పరిస్థితి.

ఇలాంటి దశలో ప్రార్థనా స్థలాలు, హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతిస్తే.. అది పర్యాటకాన్ని పరోక్షంగా ప్రోత్సహించినట్టే. కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి పొరపాటున ఏదైనా ప్రార్థనాలయంలోకి వెళ్లాడనుకుందాం.. ఆ విషయం తెలిశాక దాన్ని కచ్చితంగా కంటైన్మెంట్ జోన్ కిందకు తేవాల్సిందే, తాళం వేయాల్సిందే. ఇలా భక్తుల ప్రవేశాలకు అనుమతిచ్చి, అలా మూసేస్తామంటే ప్రజలు ఊరుకుంటారా? ఇది మరో అలజడికి కారణమవుతుందా? అనే కోణంలో ప్రభుత్వం ఆలోచిస్తోంది. 

హోటళ్లు, రెస్టారెంట్లకైనా అవే నిబంధనలు. పాజిటివ్ కేసు వచ్చిందన్న నెపంతో హోటళ్లు, రెస్టారెంట్లు మూసేస్తామంటే యాజమాన్యాలు ఒప్పుకుంటాయా? హోటళ్లు, రెస్టారెంట్లు తిరిగి ప్రారంభించుకోవాలంటే కాస్తో కూస్తో పెట్టుబడి అవసరం. మరి కరోనా భయంతో అలాంటి వాటిని తిరిగి మూసేయాలంటే ఇక బిజినెస్ ఏం జరిగినట్టు? ఇన్నాళ్లూ ఆలయాలు, మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లు మూసేసి ఉండటంతో చాలామంది వాటికి దూరంగా ఉన్నారు. ఇవి ప్రారంభమైతే.. అటోమేటిక్ గా రద్దీ పెరుగుతుంది. కరోనా వ్యాప్తికి రెట్టింపు అవకాశాలున్నాయి.

లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేసి, ఇప్పుడు చేతులెత్తేసిందని ఈపాటికే కేంద్రం అప్రతిష్ట మూటగట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో మరో సాహసానికి కేంద్రం పూనుకుంటుందా.. అన్ లాక్ నిబంధనల్లో మార్పులు చేస్తుందా..? వేచి చూడాలి. 

మాట ఇచ్చాను.. నిలబెట్టుకున్నాను

మూడు చానల్స్ రెండు పేపర్లతో రాజకీయం

 


×