cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

అమ్మ భాష‌పై ప్రేమా...జ‌గ‌న్‌పై ప‌గా?

అమ్మ భాష‌పై ప్రేమా...జ‌గ‌న్‌పై ప‌గా?

అమ్మ‌...ఆ పిలుపు మ‌ధురం. అమ్మ ప్రేమ అమూల్యం. తాము అన్ని చోట్లా ఉండ‌లేక అమ్మ‌ను దేవుళ్లు సృష్టించార‌ని ఎంతో గొప్ప‌గా చెబుతారు. మ‌న‌కు ఏదైనా చిన్న బాధ క‌లిగితే ‘అమ్మా’ అని అరుస్తాం, పిలుస్తాం. ఇంటికి ఇల్లాలే వెలుగు అంటారు. అమ్మ‌లేని ఇల్లు...దేవుడి విగ్ర‌హం లేని గుడి ఒక్క‌టే....ఇలా అమ్మ గురించి ఎంతైనా, ఏమైనా చెప్పుకోవ‌చ్చు.

విద్యా వ్య‌వ‌స్థ‌లో కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన సంస్క‌ర‌ణ‌ల నేప‌థ్యంలో అమ్మ‌, అమ్మా భాష గురించి మ‌రోసారి చ‌ర్చ జ‌రుగుతోంది. దేశ వ్యాప్తంగా అన్ని పాఠ‌శాల‌ల్లో ఐదో త‌ర‌గ‌తి వ‌ర‌కు మాతృభాష‌లో లేదా స్థానిక ప్రాంతీయ భాష‌లోనే విద్యా బోధ‌న త‌ప్ప‌ని స‌రి చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం విద్యాసంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టింది. వీలైతే 8వ త‌ర‌గ‌తి వ‌ర‌కూ కూడా ఇదే ప‌ద్ధ‌తిలో కొన‌సాగించాల‌ని కూడా కేంద్ర ప్ర‌భుత్వం సూచించింది.

ఇంకా పుస్త‌క భారానికి ముగింపు ప‌లికేలా చ‌ర్య‌లు చేప‌ట్టింది. బ‌ట్టీ కొట్టే చ‌దువుల‌కు, మార్కుల కొల బ‌ద్ధ‌కు ఇక‌పై చెల్లుచీటీ చెప్పేలా అనేకానేక చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ మేర‌కు   ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం  కేంద్ర మంత్రివర్గం ‘జాతీయ విద్యా విధానం-2020’ను ఆమోదించింది.

మారుతున్న కాలానికి, స‌మాజానికి అనుగుణంగా విద్యా సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టాల‌నే కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్నిప్ర‌తి ఒక్క‌రూ స్వాగ‌తించాల్సిందే. ఇందులో రెండో అభిప్రాయానికి తావులేదు. విద్యార్థికి ప్రాక్టిక‌ల్‌గా జ్ఞానాన్ని అందించాల‌నే ఆలోచ‌న‌తో కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా ఒక‌డుగు ముందుకు వేయ‌డం శుభ ప‌రిణామం.

ఇక ఐదో త‌ర‌గ‌తి వ‌ర‌కు మాతృభాష‌లోనే చ‌దువు అనేది కేవ‌లం ప్ర‌భుత్వ బ‌డుల‌కేనా లేక ప్రైవేట్ విద్యాసంస్థ‌ల‌కు కూడా వ‌ర్తి స్తుందా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. మాతృభాష‌లోనే ఐదో త‌ర‌గ‌తి వ‌ర‌కు విద్యాబోధ‌న నిబంధ‌న తేవ‌డంతో జ‌గ‌న్ స‌ర్కార్‌కు ఝ‌ల‌క్ అంటూ కొన్ని ప‌త్రిక‌లు, చాన‌ళ్లు ఆనందంతో జ‌జ్జ‌న‌క తొక్కుతున్నాయి. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ కూడా అదే ప‌ని చేస్తోంది. మాతృభాష‌లోనే విద్య అంటే వ్య‌క్తిగ‌తంగా జ‌గ‌న్‌కు లేదా ఆయ‌న ప్ర‌భుత్వానికి వ‌చ్చే న‌ష్టం ఏంటో అర్థం కాదు.

ఒక‌టి నుంచి ఆరో త‌ర‌గ‌తి వ‌ర‌కు ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో ఆంగ్ల మాధ్య‌మాన్ని జ‌గ‌న్ స‌ర్కార్ అమ‌లు చేయాల‌నుకోవ‌డం, దానికి తాజా కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో గండిప‌డుతుంద‌ని వారి రాక్ష‌సానందానికి కార‌ణం. స‌మాజ ప‌రిణామ క్ర‌మంలో మారుతున్న కాలానికి అనుగుణంగా ప్ర‌పంచంతో పోటీ ప‌డాలంటే ఇంగ్లీష్ జ్ఞానం త‌ప్ప‌నిస‌రి. దానికి అనుగుణంగానే జ‌గ‌న్ విద్యావ్య‌వ‌స్థ‌లో సంస్క‌ర‌ణ తీసుకురావాల‌ని క‌ల క‌న్నాడు.

ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో తెలుగులోనే చ‌దువు కోవ‌డం వ‌ల్ల జ‌గ‌న్‌కు వ‌చ్చే న‌ష్ట‌మేమీ లేదు. జ‌గ‌న్ కూతుళ్లిద్ద‌రూ ఇంగ్లీష్ మీడియంలో చ‌దువుకుని...ప్ర‌స్తుతం అమెరికా, ఇంగ్లండ్‌ల‌లోని ప్ర‌తిష్టాత్మ‌క విశ్వ విద్యాల‌యాల్లో త‌మ‌కిష్ట‌మైన కోర్సుల‌ను అభ్య‌సిస్తున్నారు. ఇప్పుడు న‌ష్ట‌పోయేద‌ల్లా బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల పిల్ల‌లు మాత్ర‌మే. ఎందుకంటే పెద్ద‌పెద్ద కార్పొరేట్ స్కూళ్ల‌లో ల‌క్ష‌లాది రూపాయ‌లు క‌ట్టి చ‌దివించే స్తోమ‌త వారికి లేదు కాబ‌ట్టి.

మాతృభాష‌పై ప్రేమ ఒల‌క‌బోస్తున్న ప్ర‌తిప‌క్ష నేత‌లు, మీడియా సంస్థ‌ల య‌జ‌మానుల పిల్ల‌లు ఏ మీడియంలో చ‌దువు తున్నారో చెప్పాల‌ని సీఎం జ‌గ‌న్ మొద‌టి నుంచి డిమాండ్ చేస్తున్నారు. దీనికి మాత్రం వాళ్ల ద‌గ్గ‌ర స‌మాధానం లేదు. త‌మ పిల్ల‌ల‌కు మాత్రం ఇంగ్లీష్ చ‌దువు ముద్దు...ఊరోళ్ల పిల్ల‌ల‌కు మాత్రం వ‌ద్దు అంటుండ‌మే రాజ‌కీయ వివాదానికి కార‌ణ‌మైంది. వీళ్లంద‌రికీ అమ్మ భాష‌పై ప్రేమా లేక జ‌గ‌న్‌పై ప‌గా? ఇప్పుడిది తేలాల్సిన విష‌యం.

కత్తి మహేష్ సెన్సేషనల్ ఇంటర్వ్యూ 

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×