Advertisement


Home > Politics - Political News
షిప్‌యార్డ్‌ భవితవ్యంపై కేంద్రం మౌనం

విశాఖపట్నంలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌కు పునరుజ్జీవనం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చురుగ్గా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. దీనికి సంబంధించి రాజ్యసభలో సోమవారం వైసీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు రక్షణమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌... ‘లేదు’, ‘కాదు’, ‘కుదరదు’ అంటూ మూడే మూడు ముక్కల్లో ఇచ్చిన జవాబే దీనికి తార్కాణం. దేశంలో నౌకా నిర్మాణం రంగంలో ప్రసిద్ధి చెందిన షిప్‌యార్డ్‌లలో విశాఖపట్నం ఒకటి.

తూర్పుతీరంలో ఉన్న అతి పెద్ద షిప్‌యార్డ్‌ కూడా ఇదే. నౌకా నిర్మాణ రంగంలో విశేష ప్రతిభ కలిగిన 77ఏళ్ళ హిందుస్తాన్ షిప్‌యార్డ్‌ ఒకప్పుడు దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలకే తలమానికం. అలాంటి సంస్థ పలు కారణాల వలన నష్టాల ఊబిలో కూరుకుపోయి, ఈ మధ్యకాలం నుంచి క్రమంగా లాభాల బాట పడుతోంది. ఈ దశలో మూలధన పునఃవ్యవస్థీకరణ జరిగితే ఆ సంస్థ మళ్ళీ పూర్వవైభవం సాధిస్తుంది.

ఈ మేరకు హిందుస్తాన్‌ షిప్‌యార్డ్‌ యాజమాన్యం రక్షణశాఖకు కొన్నేళ్ళ క్రితమే ప్రతిపాదనలు పంపినా ఆవి ఇంతవరకు కార్యాచరణకు నోచులేదు. ఇటీవల కాలంలో దేశ రక్షణను పటిష్టపరచే చర్యలలో భాగంగా నౌకాదళం అవసరాల కోసం 20 వేలకోట్ల రూపాయల వ్యయంతో మరిన్ని అధునాతన యుద్ధ నౌకలు, పహారా నౌకల నిర్మాణాన్ని చేపట్టే ప్రక్రియకు రక్షణ మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. ప్రైవేట్‌ రంగంలోని నౌకా నిర్మాణ సంస్థలైన రిలయన్‌ డిఫెన్స్‌, ఎల్‌ అండి టీ ఈ ఆర్డర్లను దక్కించుకున్నప్పటికీ అందులో హిందుస్తాన్‌ షిప్‌యార్డ్‌కు కూడా ప్రభుత్వం కొంతమేర భాగస్వామ్యం కల్పించింది. 

దానికి అనుగుణంగా మూలధన పునఃవ్యవస్థీకరణ ప్రతిపాదనపై కూడా రక్షణ మంత్రిత్వశాఖ ఆమోద ముద్రవేసి ఉంటే షిప్‌యార్డ్‌ భవితవ్యం ఉజ్వలంగా ఉండేది. అలాగే దక్షిణ కొరియాకు చెందిన హ్యుండై షిప్‌ బిల్డర్స్‌తో హిందుస్తాన్‌ షిప్‌యార్డ్‌ సంయుక్తంగా నౌకా నిర్మాణం చేపట్టాలన్న ప్రతిపాదన కూడా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఈ వివరాలు కోరుతూ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు రక్షణశాఖ మంత్రి, వివరంగా జవాబు ఇవ్వడానికి బదులుగా అవును, కాదు, లేదు అంటూ ముక్తసరి సమాధానాలతో సరిపెట్టడంపై విజయసాయి రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు.