cloudfront

Advertisement


Home > Politics - Political News

చంద్రబాబు వ్యూహం క్లియర్

చంద్రబాబు వ్యూహం క్లియర్

తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు వ్యూహం క్లియర్ అయింది. ఆయన హడావుడి అంతా కేవలం హైదరాబాద్ సిటీ, అవుట్ స్కట్స్, తెలుగుదేశం అనుకూల సామాజికవర్గ రాజకీయ ప్రభావం ఎక్కువగా వున్న వరంగల్, ఖమ్మం ప్రాంతాలకే పరిమితం అన్న సంగతి స్పష్టం అవుతోంది.

హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, ఖమ్మం, వరంగల్ లాంటి ఆంధ్ర ప్రభావం వున్న అర్బన్ ప్రాంతాల ప్రజల్లో కేసిఆర్ పాలన పట్ల వ్యతిరేకత కనిపించడాన్ని చంద్రబాబు పసిగట్టారు. దీన్ని క్యాష్ చేసుకుని, ఓట్లుగా మార్చుకుని, తన ప్రతాపం అని చాటిచెప్పే ప్రణాళికకు తెరతీసారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకుని, వీలయినన్ని సీట్లు కేవలం ఈ లోకేషన్లలోనే సంపాదించుకున్నారు.

ఇదే కనుక, హైదరాబాద్ అర్బన్ లో కాకుండా తెలంగాణ రూరల్ ఏరియాల్లో చంద్రబాబు పార్టీకి సీట్లు కేటాయించి వుంటే పరిస్థితి వేరుగా వుండేది. కచ్చితంగా గెలవగల స్థానాలను అది కూడా హైదరాబాద్ సిటీ పరిథిలోను, ఖమ్మం, వరంగల్ ప్రాంతంలోనూ ఎంచుకుని, తన వాటాగా రాబట్టుకోవడంలోనే చంద్రబాబు వ్యూహం అర్థం అవుతోంది.

ఇప్పుడు కచ్చితంగా తన వాటా స్థానాలను గెలవగలిగితే, మీసం తిప్పనూవచ్చు, వీలైతే చక్రం తిప్పనూవచ్చు. భవిష్యత్ లో మళ్లీ పొత్తులు వచ్చినపుడు మరిన్ని స్థానాలు డిమాండ్ చేయనూవచ్చు.

ప్రచారం కూడా ఇక్కడికే పరిమితం
ఇక కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో కలిసి చంద్రబాబు చేయబోయే ప్రచారం కూడా హైదరాబాద్ సిటీ, అవుట్ స్కట్స్ మేరకే పరిమితం చేసుకోవడం కూడా ఈ వ్యూహంలో భాగమే. సెటిలర్లు, ఆంధ్ర జనం వుండే ప్రాంతాలనే చంద్రబాబు తన ప్రచారానికి ఎంచుకుంటున్నారు. ఒకప్పుడు తెలంగాణ ప్రాంతం అంతటా ప్రభావం కనబర్చగల స్థాయిలో వున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కేవలం హైదరాబాద్ సిటీ పరిసర ప్రాంతాలకే పరిమితం కావడం అన్న విషయాన్ని చాలా తెలివిగా కప్పి పుచ్చి, హడావుడి చేస్తున్నారు.

కాంగ్రెస్ కు ఏ రీతి సహాయం?
సిటీ ప్రాంతంలో సీట్లు తీసుకుని, సిటీ ప్రాంతాల్లోనే తన ప్రచారం పరిమితం చేసుకున్న చంద్రబాబు మహాకూటమి పొత్తులో భాగంగా కాంగ్రెస్ కు ఏ విధంగా సాయం చేయబోతున్నట్లు? ఆయన రూరల్ ప్రాంతాలకు వెళ్లరు. రూరల్ ప్రాంతాల్లో అక్కడా అక్కడా ఆయన పార్టీ పోటీ చేయదు.

మరి అలాంటపుడు ఆయా ప్రాంతాల్లోపోటీ చేసే కాంగ్రెస్ కు ఏ విధంగా సాయం చేయగలరు? పార్టీ ఉనికి ఆయా ప్రాంతాల్లో లేదు కాబట్టే కదా? అక్కడ పోటీ చేయనిది? మరి అక్కడ ఏ విధంగా కాంగ్రెస్ కు సాయం చేస్తారు? అంటే మహాకూటమి వల్ల బాబుగారికి లాభమే తప్ప, కాంగ్రెస్ కు కాదు అన్నది క్లియర్ గా అర్థం అయిపోతోంది.

రాజకీయ వ్యూహాలు రచించడంలో, తెలివిగి అవతలి పార్టీలను తన ఉచ్చులోకి తెచ్చుకోవడంలో చంద్రబాబు మాస్టర్. మూడేళ్ల క్రితం భాజపా ఇలాగే బాబు ఉచ్చులోపడి, ఇప్పుడు ఆంధ్రలో గిలగిలా కొట్టుకుంటోంది. కేంధ్రంలో నాయకులను తన గుప్పట్లో పెట్టుకుని, రాష్ట్రంలో నాయకులను పక్కనపెట్టి, మూడేళ్లు నానా హడావుడి చేసారు. రాష్ట్రంలో పార్టీని ఎదగకుండా చేసారు. ఇప్పడు బై చెప్పారు.

తెలంగాణలో కూడా ఇదే వ్యూహం. కాంగ్రెస్ పెద్దలను తన కంట్రొల్ లోకి తెచ్చుకుని, తనకు కావాల్సిన సీట్లు తీసుకుని, ఇక ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్ ను ఎదగకుండా చేయడం. భవిష్యత్ లో కాంగ్రెస్ కు బై చెప్పేనాటికి, ఈ ప్రాంతాల్లో ఆ పార్టీకి  బలం లేకుండా పోతుంది. సదా బాబు అనుసరించే వ్యూహం ఇదే. మళ్లీ ఇప్పుడూ అదే.

మీటూ.. ప్రైవేట్ సెటిల్ మెంట్లు జరుగుతున్నాయా? ...చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్