cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

వయసు పెరగడం చంద్రబాబు తప్పా?

వయసు పెరగడం చంద్రబాబు తప్పా?

విమర్శలు, ఆరోపణలు అనేవి సహేతుకంగా ఉండాలి తప్ప అమర్యాదగానో, వెకిలిగానో ఉండకూడదు. ప్రధానంగా రాజకీయాల్లో హుందాగా ఉండాలి. కానీ ఈ కాలంలో లోపించింది అదొక్కటే. తాను ఉత్తమ ...ఎదుటివాడు అధమ అనే రీతిలో తయారయ్యాయి రాజకీయాలు. కానీ వాస్తవంగా అందరూ దొంగలే అని ప్రజలు భావిస్తున్నారు. విమర్శలు విధానాలపైన ఉండాలి తప్ప శారీరక లోపాల మీదనో, బలహీనతల మీదనో ఉండకూడదు. కానీ అలాంటి విమర్శలు చేస్తేనే తాము హీరోలమవుతామని నాయకులు భావిస్తున్నారు. టీడీపీ, వైకాపా నాయకులు చాలా దిగజారిపోయి మాటల దాడులు చేసుకోవడం మనం ఏళ్ళ తరబడి చూస్తూనే ఉన్నాం.

కొందరు బహిరంగంగా విమర్శలు చేస్తుంటే, కొందరు ట్విట్టర్ ద్వారా చేస్తున్నారు. సరే... ఎలా చేసినా బూతు పురాణం వల్లించడంలో శృతి మించారని చెప్పొచ్చు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై అనేక విమర్శలు చేస్తున్న వైకాపా నాయకులు కొంతకాలంగా అంటే ఆయన పార్టీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ఆయన వయసును ప్రస్తావిస్తూ విమర్శలు చేస్తున్నారు. ఆయనకు వయసైపోయిందని గేలి చేస్తున్నారు. రాజకీయాలకు ఇక పనికిరాడని, తప్పుకోవడం మంచిదని అంటున్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తానని చంద్రబాబు కలలు కంటున్నాడేమో, ఎన్ని జన్మలెత్తినా అది సాధ్యం  కాదని మొన్న అంబటి రాంబాబు అన్నాడు.

వయసును అడ్డం పెట్టుకొని విమర్శలు చేయడం ఒక రకమైన మైండ్ గేమ్ అన్న మాట. చంద్ర బాబు అధికారంలో ఉన్నప్పుడు నగరి ఎమ్మెల్యే రోజా పబ్లిగ్గానే ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా బొల్లిబాబు అంటూ అమర్యాదగా మాట్లాడింది. బాబుకు వయసు మీద పడింది కాబట్టి ఆయన ఇంకెంత కాలం రాజకీయాల్లో ఉంటారని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినా లేదా స్వల్ప తేడాతో ఓడిపోయినా ఆయన వయసు మీద చర్చ జరిగేది  కాదేమో.

కానీ ఘోరపరాజయం కారణంగా ఆయన ఇంకెంతకాలం రాజకీయాలు చేయగలుగుతారనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులు సామాన్య ప్రజల్లా ఉద్యోగం నుంచి రిటైర్ కాగానే మనుమలు, మనుమరాళ్ళతో ఆడుకుంటూ, కృష్ణా రామా అనుకుంటూ కూర్చోరు కదా. దశాబ్దాలుగా జనంలో ఉన్నవారు, అధికారం అనుభవించినవారు, నాయకత్వ స్థానంలో ఉన్నవారు వయసు పెరుగుతున్నా లెక్కచేయరు.అలవికాని  అనారోగ్య సమస్యలు వస్తే తప్ప ప్రజా జీవితం నుంచి తప్పుకోరు. చంద్రబాబుకు ప్రస్తుతం 70 ఏళ్ళు. వచ్చే ఎన్నికల నాటికి 74 ఏళ్ళు వస్తాయి. అప్పటికి ఆయన శారీరక పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం.

2019 ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టి ఉంటే ఉత్సాహం ఉరకలు వేసేది. జగన్ అధికారంలోకి వచ్చాక జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న చంద్రబాబులో అధికారంలో ఉన్నప్పటి చురుకుదనం, ఉత్సాహం కనిపించలేదు. ఓటమి బాధ నుంచి ఆయన ఇంకా తేరుకోనట్లు కనబడింది. ఆరోగ్యపరంగా చెప్పాలంటే ఆ వయసులో ఉన్న చాలామంది నాయకులకంటే బాబు  బాగానే ఉన్నారు. అయిదేళ్లపాటు ఆయన పరిపాలన ఎలా చేశాడన్నది అలా ఉంచితే అధికారంలో ఉన్న ఐదేళ్లూ చురుగ్గానే ఉన్నారు. తీరిక లేని పర్యటనలు చేసినా, గంటల తరబడి సమీక్షా సమావేశాలు నిర్వహించినా అనారోగ్యం పాలైన దాఖలాలు లేవు. ఆహారపుటలవాట్లలో బాబు క్రమశిక్షణ మెచ్చుకోదగింది. ఎంత జాగ్రత్తగా ఉన్న వయసు పెరుగుతుంటే సహజంగా కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇప్పటివరకైతే బాబు తీవ్రంగా అనారోగ్యం పాలుకాలేదు, శారీరకంగా జాగ్రత్తగా ఉన్నా, మానసిక ఆందోళన ఉంటే ఆరోగ్యం దెబ్బ తింటుంది.

చంద్రబాబుకు మానసిక ఆందోళన ఉన్నట్లుంది. కొందరు ఎమ్మెల్యేలు జంప్ జిలానీలుగా మారడానికి రడీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. విచిత్రమేమిటంటే ...  బద్ధ శత్రువు వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉండగా బాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఆయన కొడుకు జగన్ అధికారంలో ఉండగా కూడా ప్రతిపక్షంలోనే ఉన్నారు. సరే ... వైఎస్సార్, బాబు వయసులో దాదాపు సమకాలికులు. రాజకీయాల్లోనూ ఒకేసారి ప్రవేశించారు. కాబట్టి ఏదో నడిచిపోయింది. కానీ జగన్ తనకంటే వయసులో, అనుభవంలో చిన్నవాడు. అందుకే జగన్ విమర్శిస్తే తట్టుకోలేక పోతున్నారు. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి జైలుకు వెళతాడనుకున్న జగన్ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచి అధికారంలోకి రావడం బాబు ఊహకు కూడా అందలేదు.

జగన్ కథ కంచికి వెళ్లకపోవడంతో  బాబు కథ అడ్డం తిరిగింది.  47 ఏళ్ళ జగన్ అసెంబ్లీలో చెలరేగిపోతుంటే బాబుకు ఇబ్బందికరంగా ఉంది. అసహనం కట్టలు తెంచుకుంటోంది. అందుకే తరచుగా నా అనుభవమంత లేదు నీ వయసు అని జగన్ను ఉద్దేశించి అంటుంటారు. బాబు హయాంలో జరిగిన కుంభకోణాలపై విచారణ జరిపించి జైలుకు పంపుతామని వైకాపా నాయకులు అంటున్నారు. టీడీపీ అనుకూల పత్రికలో ఒకసారి ఇదే విషయం ప్రస్తావిస్తూ బాబును ఈ వయసులో  జగన్ జైలుకు పంపాలనుకుంటున్నారా ? అని ప్రశ్నించింది. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు వయసును కూడా గౌరవించకుండా దుర్భాషలాడారు.

బాబును ఉరి తీయాలని, నది బజారులో కాల్చి చంపాలని అన్నారు. అసెంబ్లీలో కూడా ఏదో విషయంలో మాట్లాడుతూ గాడిదలు కాస్తున్నారా ? అని మండిపడ్డారు. తాజాగా వైకాపా నాయకులు చంద్రబాబు వయసు మీద విమర్శలు చేయగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ చంద్రబాబు వయసు గురించి విమర్శలు చేయడం సరికాదని అన్నాడు. అంతటితో ఊరుకోకుండా చంద్రబాబుతో పోటీపడి తిరుమల కొండ ఎక్కగలరా అని వైకాపా నాయకులకు సవాల్ విసిరాడు. రాజకీయ నాయకులకు ఇలాంటి పనికిమాలిన సవాళ్లు విసరడం అలవాటే. చంద్రబాబుకు వయసు మీదపడినా చురుగ్గానే ఉన్నారని, ఆయన రాజకీయాల్లో కొనసాగుతారని చెప్పడం యరపతినేని అభిప్రాయం కావొచ్చు. 

మాట ఇచ్చాను.. నిలబెట్టుకున్నాను

 


×