
'దేవుడి కన్నా ఎవరూ ఎక్కువ కాదు.. దేవుడితో మనుషులను పోల్చకూడదు...' ఇదీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత శ్రీమాన్ చంద్రబాబు నాయుడు తిరుమల నుంచి ఇచ్చిన సందేశం! ఈ సందేశం చంద్రబాబు నాయుడు ఎందుకు ఇచ్చారో.. వేరే చెప్పనక్కర్లేదు. తిరుమల ఆలయం పూజారి ఒకరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీ మహావిష్ణువుతో పోల్చడంతో దాన్ని వివాదం చేసి లబ్ధి పొందాలని తెలుగుదేశం పార్టీ తెగ ప్రయత్నిస్తోంది. ఈ పార్టీ కన్నా ముందు బీజేపీ వాళ్లు ఆ పోలికపై యాగీ చేశారు. అలా చేసేస్తే తమకు ఓట్లు పడతాయనేది కాషాయం వాళ్ల లెక్క. అయితే ఆ అవకాశం బీజేపీకి వదలకూడదని స్వయంగా తిరుమల నుంచినే చంద్రబాబు నాయుడు రాజకీయం మొదలుపెట్టారు.
ఎవరికైనా తమకు మేలు చేసిన వారిని దేవుడితో పోల్చుకోవడం రివాజు. దేవుడిలా వచ్చాడు.. దేవుడిలా ఆదుకున్నాడు అనేది మన సమాజంలో తరచూ వినిపించే మాట. చిన్న సాయానికి అయినా అలాంటి మాటలు చెప్పడం ఆల్మోస్ట్ అలవాటుగా మారింది. కొందరు కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేయడానికి మనుషులను దేవుడితో పోలుస్తూ ఉంటారు. మానవసేవే మాధవ సేవే అంటూ.. మనుషులు, దేవుడూ ఒక్కటే అనే తత్వాన్ని కూడా పూర్వీకుల మనలో నాటేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.
అయితే.. ఉన్నట్టుండి చంద్రబాబు నాయుడు మాత్రం మనుషులను దేవుడితో పోల్చకూడదు అని తేల్చేశారు. అయినా.. ఇప్పుడే ఇలా అనిపిస్తోందా? లేక ఇంతకు ముందు కూడా ఇలా అనిపించేదో చంద్రబాబు నాయుడే చెప్పాలి! ఎందుకంటే.. గతంలో చంద్రబాబు నాయుడును దేవుడితో పోల్చడం కాదు..దేవుడి ఫ్లెక్సీలకు చంద్రబాబు నాయుడి తలను అతికించి, వాటిని బహిరంగంగా కట్టిన చరిత్ర ఉండనే ఉంది! టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో.. తెలుగు తమ్ముళ్ల క్రియేటివిటీ అంతా ఇంతా కాదు!
వెంకటేశ్వర స్వామి, శివుడు, షిర్డీ సాయిబాబా.. ఫ్లెక్సీలకు తల స్థానంలో చంద్రబాబు నాయుడు తలను ఫోటో షాప్ తో అతికించి మరీ ఫ్లెక్సీలను కట్టారు తెలుగు తమ్ముళ్లు. అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు ఎవ్వరినీ వారించలేరు. అయినా.. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా తనే దేవుడు అన్నట్టుగా మాట్లాడే వారు కదా! 'నా నీళ్లు తాగుతున్నారు. నేను వేసిన రోడ్డ మీద నడుస్తున్నారు, నా మరుగుదొడ్లనే వాడుతున్నారు..' అంటూ 'నేనే దేవున్ని..' అనేంత లెవల్లో ఉండేవి చంద్రబాబు ప్రసంగాలు. ఆయన అలా, తెలుగు తమ్ముళ్లేమో అలా!
ఇప్పుడు ఏదో ఒక పెద్దాయన.. ముఖ్యమంత్రిని పట్టుకుని దేవుడులాంటి వాడు అనే సరికి చంద్రబాబు నాయుడు శుద్ధులు మొదలుపెట్టేశారు! ఇలాంటి రాజకీయం, పచ్చి అవకాశవాదం అనిపించుకునే తీరు, రెండు కళ్ల సిద్ధాంతాలతోనే తెలుగుదేశం పార్టీ పరిస్థితి అలా తయారైంది. అయినా చంద్రబాబు తీరు మాత్రం మారదు అని మరోసారి స్పష్టత వస్తోంది!
లోకేష్ సవాల్ చూస్తే.. బ్రహ్మానందం గుర్తొస్తున్నాడు
దేవి సిక్స్ కొడితే...నేను రెండు సిక్సులు కొడతా