cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

సానుభూతి కాస్తా చంకనాకిపోయింది

సానుభూతి కాస్తా చంకనాకిపోయింది

సానుభూతి కెరటం..అదేనండీ "సింపతీ వేవ్" సినిమాల్లో చూపించినంత ఈజీగా నిజజీవితంలో రాదు. ఈ సోషల్ మీడియా రోజుల్లో అది ఇంకా కష్టం. అందులోనూ కరడుగట్టిన రాజకీయనాయకుల మీద ప్రజల్లో సానుభూతి కలగాలంటే  ఇంక ఇంకా కష్టం. 

చంద్రబాబునాయుడుది దొంగ ఏడుపని కొందరు కొట్టి పారేస్తున్నా అది నిజం కాకపోవడనికే ఎక్కువ ఆస్కారముంది. 

వయసు పెరిగే కొద్దీ మనసు సున్నితమౌతుంది. వృద్ధాప్యాన్ని రెండో బాల్యం అంటారు. 

ఆ సమయంలో అందివచ్చిన కొడుకులు, గౌరవం తోడుగా ఉంటే ప్రశాంతత ఉంటుంది. 

కానీ అలా కాకుండా 70 దాటాక కూడా తన పరిస్థితిని, తన కొడుకు భవిష్యత్తుని కూడా తానే చూసుకోవాల్సి రావడం; ప్రతిపక్షాల పదజాలంతో గౌరవం కనుమరుగవడం; సొంత నియోజకవర్గంలో కూడా మునుపట్లాగ ప్రజలు తనవైపు లేరన్న విషయం స్థానిక ఎన్నికల ఫలితాల్లో తేలడం...మొదలైన కారణాల వల్ల ఆయన మనసు విపరీతంగా గాయపడి ఉంది. 

"మూలిగే నక్కమీద తాటిపండు పడినట్టు" అనే సామెతలాగ సరిగ్గా ఆయన ఆ బాధలో ఉన్న సమయంలోనే అసంబ్లీలో సభ్యులు కూడా లోకేష్ ఎలా పుట్టాడంటూ ఎద్దేవా చేయడంతో ఇక ఆయన తట్టుకోలేకపోయాడు. 

పంటి బిగువున దాచుకున్న బాధలన్నీ కాసేపటికి ప్రెస్ కెమెరాల ముందు ఏడుపు రూపంలో బయటపడ్డాయి. 

సరిగ్గా ఇదే సమయంలో మౌనం వహించాలి. అలా కాకుండా నందమూరి కుటుంబీకులంతా సింగిల్ ఫ్రేములో సీన్లోకి వచ్చి వార్ణింగులిచ్చారు. ఆ వార్ణింగులవల్ల సానుభూతి రాకపోగా ఆ కుటుంబీకుల అరకొర మాటలు ట్రోలింగ్ కి గురయ్యాయి. అసలా వార్ణింగులు స్కూలు పిల్లాడు కూడా బెదిరేలాలా లేవు. 

దానికి తోడు...చంద్రబాబు ఇలా ఏడ్చాడో లేదో అలా రోజా కెమెరా ముందుకొచ్చి తాను చాలా సంతోషంగా ఉన్నానంటూ చెప్పింది. గతంలో తనని ఎంత మానసిక క్షోభకి గురిచేసాడో వివరిస్తూ కర్మసిద్ధాంతం వల్లెవేసింది. "బై బై బాబూ.." అంటూ వెక్కిరిస్తూ ముగించింది. 

అటు పిమ్మట లక్ష్మీపార్వతి కూడా లైన్లోకి రావడం..ఆవిడ ఎప్పటిలాగానే తన గతాన్ని గుర్తు చేసి బాబు ఖర్మ ఎలా పండిదో చెప్పడం జరిగాయి. చంద్రబాబు ఏడుపు చూసి ఆనందబాష్పాలు కార్చినవారిలో ఈవిడది మొదటి నెంబరని అందరికీ తెలుసు. 

ఆ తరవాత ముద్రగడ పద్మనాభం ప్రెస్ నోట్ వదిలారు. చంద్రబాబు పతనం చూడడం బాగుందన్నారు. తన కుటుంబంలోని ఆడవాళ్లని చంద్రబాబు ప్రభుత్వం ఎలా హింసించిందో ఆయన గతంలో చెప్పిన వీడియోలు కూడా ఆన్లైన్లో ఉన్నాయి. 

ఒక్క చంద్రబాబు ఏడిస్తే ఇంతమంది మనశ్శాంతి పొందుతున్నారంటే "పడ్డవాడికి తెలుస్తుంది అసలు బాధ. ఎంత మందిని ఎన్ని రకాలుగా బాధపడితే ఇంతిలా సంతోషిస్తారు మరి!!" అనుకుంటున్నారు ఏ పార్టీ మీదా విపరీతమైన మోజులేని తటస్థ ప్రజలు.

వల్లభనేని వంశీ నెల క్రితం మాధవరెడ్డి పేరెత్తి అన్న మాటలు చంద్రబాబు ఏడుపు వల్ల ఎక్కువందికి తెలిసింది. లేకపోతే అసలు తెలిసేదే కాదు. రూలింగ్ పార్టీకి చెందిన ప్రధాన వార్తాపత్రికలో కూడా వంశీ అన్న ఆ మాటలు కవర్ చెయ్యలేదు. 

స్వామిభక్తితో తొలిసారి కవర్ చేసి నలుగురికీ ఆ పుకారుని పరిచయం చేసింది ఆంధ్రజ్యోతి పత్రికే. 

వంశీ మాటల్లో కూడా, "చంద్రబాబుదే కుటుంబమా? వాళ్ల కుటుంబంలోనే ఆడవాళ్లున్నారా? మా కుటుంబంలోని ఆడవాళ్లు లేరా" అన్న మాటలు ప్రతీకారస్వరంలో ధ్వనించాయి. 

కనుక ప్రతివారికీ చంద్రబాబు మీద కత్తుల్లాంటి మాటలు దుయ్యడానికి ఏదో ఒక వ్యక్తిగత కారణం ఉందని ప్రజలకి అర్థమౌతోంది. 

లేకపోతే ఇంతమంది కలిసి ఇంత కర్కశంగా ఎందుకు మాట్లాడతారు? 

చంద్రబాబు వెక్కివెక్కి ఏడిస్తే ఇంతమంది ఎందుకు ఆనందం పొందుతారు? 

ఒకరినైతే అనొచ్చుగానీ అందరూ సాడిస్టులైపోరు కదా! 

అందరికీ సాడ్ హిస్టరీ ఉంటేనే కదా చంద్రబాబుపైన ఈ మాటల తూటాలు..

...అని అనుకుంటున్నవారున్నారు. 

దీంతో వచ్చిన సానుభూతి కాస్తా చంకనాకిపోయింది. 

తన ఏడుపు తరవాత పెద్దెత్తున నిరసన జ్వాలలు చెలరేగుతాయని చంద్రబాబు ఆశించి ఉండొచ్చు. 

"ఒక్కగంట కళ్లు మూసుకుంటే చాలు..మేమేంటో చూపిస్తాం" అని పరిటాల సునీత అన్న మాటలు చేతల్లోకి మారతాయని ఊహించి ఉండొచ్చు. 

"మా సింహం చంద్రబాబు గారు...మీరు మగాళ్లైతే రండి రా కొడకల్లారా చూసుకుందాం" అని కొద్ది రోజుల క్రితం బొండా ఉమ అన్న మాటలు కార్యరూపం దాలుస్తాయని అనుకుని ఉండొచ్చు. 

చిన్న విషయానికే ఫ్యాన్స్ మీద చేయి చేసుకునే తన వియ్యంకుడు బాలకృష్ణ ఉగ్రనరసింహ అవతారం ఎత్తి ప్రత్యర్థుల్ని మాటలతో చావకొడతాడని కల గని ఉండొచ్చు. 

వీటన్నిటితోటీ రెచ్చిపోయిన తెదేపా కార్యకర్తలు, అభిమానులు, తమ కులానికి చెందిన యువత అందరూ కలిసి రాస్ట్రంలో అల్లకల్లోలం సృష్టిస్తారని భావించి ఉండొచ్చు.

1984లో ఇందిరాగాంధీ పోయినప్పుడు, 1988లో వంగవీటి రంగా మర్డర్ అప్పుడు, 1991లో రాజీవ్ గాంధీ హత్య జరిగినప్పుడు ఏర్పడ్డ భయానక వాతావరణం రాష్ట్రంలో చోటు చేసుకుంటుందని అనుకుంటే అనుకుని ఉండొచ్చు. 

అంత కాకపోయినా కనీసం మొన్న జగన్ ని పట్టాభి "బోస్డీకే" అని తిట్టినప్పుడు తెదేపా కార్యాలయాలపై దాడులు జరిగినట్టు కనీసం కొంతైనా తెలుగుతమ్ముళ్లనుంచి ప్రతిఘటన వస్తుందని అనుకున్నారేమో. 

కానీ అవేవీ జరగలేదు. అందరూ పేపర్ టైగర్లే తప్ప వాస్తవానికి ఎవ్వరూ ఏమీ చెయ్యరని తేలిపోయింది. 

బాలకృష్ణ అయితే, "మరో సారి ఇలాంటిది జరిగితే వ్యవస్థల గోడలు కూడా బద్దలు కొట్టి గుణపాఠం చెబుతాము" అని ఏదో అన్నారు. 

బాలకృష్ణ స్టేట్మెంటు చూసి చంద్రబాబు మనసులో అనుకుని ఉండొచ్చు- "అంటే నీకు కోపం రావాలంటే నేను ఇంకోసారి ఏడవాలా..?" అని. 

ఏదీ జరగలేదు కనుక చంద్రబాబు ఇవాళ కడపయాత్రకి వెళ్లారు. 

అక్కడ వరదబాధితుల్ని కలవాడిని వెళ్లిన చంద్రబాబుకి ఒకచోట పిడుగులాంటి అనుభవం ఎదురయ్యింది. చీకటి పడుతుండగా ఒక విలేకరి వచ్చి బాబుకి మైకు పెట్టాడు. 

"ఆల్ మీడియాని రమ్మనండి.." అన్నారు బాబుగారు. 

"ఎవ్వరు లేరు సర్ ఇక్కడ" అని ఆ విలేకరి నుంచి బదులొచ్చింది. 

ఆ ఉన్న ఒక్క ఛానలూ ఏబీయన్. కనీసం టీవీ5, మహాటీవీ మైకులు కూడా లేవక్కడ. 

అసలే తీవ్రమనస్థాపంలో ఉన్న చంద్రబాబుకి "తన" అనుకున్న చానల్సే ఈ రోజు మరింత బాధని కలిగించాయి. 

శ్రీనివాసమూర్తి

హీరోలు దేవుళ్లా ఏందీ?

జగన్: దూకుడే.. ముందుచూపు ఏదీ?!