Advertisement


Home > Politics - Political News
చంద్రబాబుతో లగడపాటి: పర్సనల్‌ ఏంటట.!

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పిలిచారు.. ఆంధ్రా ఆక్టోపస్‌, మాజీ ఎంపీ, మాజీ కాంగ్రెస్‌ నేత, ప్రముఖ వ్యాపారవేత్త లగడపాటి రాజగోపాల్‌ వెళ్ళారు. సాధారణంగా ఇలాంటి భేటీలు ఎందుకు జరుగుతాయి.? రాజకీయ కోణంలోనే జరుగుతాయి. కానీ, లగడపాటి మాత్రం 'అబ్బే, ఇది మామూలు భేటీ మాత్రమే.. దీనికంత ప్రాధాన్యత లేదు.. పర్సనల్‌ భేటీ అంతే..' అని సెలవిచ్చేశారు. 

చంద్రబాబుతో ఇటీవలి కాలంలో లగడపాటి రాజగోపాల్‌ తరచూ భేటీ అవుతున్నారు. విషయమేంటని మీడియా ప్రశ్నిస్తే మాత్రం లగడపాటి 'అబ్బే, ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు.. రాజకీయం అసలే లేదు..' అని చెబుతుండడం గమనార్హం. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా లగడపాటి రాజగోపాల్‌ తెరపైకొచ్చారు. రేపు ఫలితం వస్తుందనగా, ఈ రోజు ఆయనగారు తన సర్వే ఫలితాల్ని వెల్లడించారు.. అదీ, టీడీపీకి అనుకూలమైన ఫలితం. 

వ్యవహారం ఎక్కడో తేడా కొడుతోంది. కేవలం మాజీ ఎంపీగానో, మాజీ కాంగ్రెస్‌ నేతగానో మాత్రమే లగడపాటి రాజగోపాల్‌ని చూడలేం. ప్రముఖ వ్యాపారవేత్త ఆయన. పైగా, ఆయన వ్యాపారాలు కూడా వివాదాల్లో వున్నాయి. అన్నిటికీ మించి, అమరావతిలో అతి పెద్ద భూ కుంభకోణం జరుగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలో విజయవాడకే చెందిన లగడపాటి రాజగోపాల్‌, చంద్రబాబుతో వరుస భేటీలు నిర్వహిస్తుండడంతో సహజంగానే అనుమానాలు పెరుగుతాయి. 

ఒకప్పుడు లగడపాటిపై ఘాటైన విమర్శలు చేసిన టీడీపీ నేతలు, ఇప్పుడు లగడపాటి - చంద్రబాబు భేటీపై పెదవి విప్పలేకపోతున్నారు. అసలు లగడపాటి - చంద్రబాబుతో ఎందుకు భేటీ అవుతున్నారో టీడీపీ ముఖ్య నేతల వద్దే సమాచారం లేని పరిస్థితి. అంత పర్సనల్‌గా లగడపాతి - చంద్రబాబు మధ్య ఏం చర్చలు జరుగుతున్నాయట.? ఏమో మరి ఆ ఇద్దరికే తెలియాలి.