cloudfront

Advertisement


Home > Politics - Political News

చంద్రబాబుకి 'రక్షణ కవచం' సిద్ధమైందా.?

చంద్రబాబుకి 'రక్షణ కవచం' సిద్ధమైందా.?

ఏదో జరిగిపోతోందంటూ పెద్ద రచ్చే జరుగుతోంది టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ న్యాయస్థానం నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేయడంతో. టీడీపీ నేతలే, ఈ కేసుని లైట్‌ తీసుకుంటున్నారు. ఆ టీడీపీ నేతలే, చంద్రబాబుని ఏదో చేసెయ్యాలనే 'కుట్ర' జరుగుతోందని ఆరోపిస్తుస్తుండడం గమనార్హం. టీడీపీకే ఈ మొత్తం ఎపిసోడ్‌పై ఓ క్లారిటీ లేని పరిస్థితి. 

నిజానికి చంద్రబాబు, ఓటుకు నోటు కేసులో నోటీసులు ఈపాటికే అందుకుని వుండాలి. అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కి 50 లక్షలు లంచం (అడ్వాన్స్‌) ఇవ్వబోతూ రెడ్‌ హ్యాండెడ్‌గా తెలంగాణ ఏసీబీకీ చిక్కేశారు. ఆ మొత్తం వ్యవహారానికి చంద్రబాబు బ్రీఫింగ్‌ చేసిన మాట వాస్తవం. దానికి సంబంధించిన ఆడియో టేపులూ బయటకొచ్చాయి. 'అది నా వాయిస్‌ కానే కాదు' అని ఎక్కడా ఒప్పుకోలేదుగానీ, తెలంగాణ ప్రభుత్వంపై ఫోన్‌ ట్యాపింగ్‌ అస్త్రం ప్రయోగించడం ద్వారా పరోక్షంగా 'వాయిస్‌' విషయంపై క్లారిటీ ఇచ్చేశారు చంద్రబాబు. అయినా, ఆ కేసులో చంద్రబాబుకి ఇప్పటిదాకా నోటీసులు వెళ్ళలేదు. 

బాబ్లీ పోరాటంపై చంద్రబాబుకి ధర్మాబాద్‌ న్యాయస్థానం నోటీసులు పంపాక, ఓ సినీ ప్రముఖుడు 'మరోచోట నుంచి నోటీసులు రాబోతున్నాయి.. మొత్తం రెండు నోటీసులు సిద్ధంగా వున్నాయ్‌..' అంటూ బాంబ్‌ పేల్చాడు. ఈ సినీ ప్రముఖుడే (శివాజీ), చంద్రబాబుకి 'సోమవారం నోటీసులు' రాబోతున్నాయని సెలవిచ్చాడు. ఆ నోటీసులు కాస్తా శుక్రవారం వచ్చాయనుకోండి.. అది వేరే సంగతి. 

రాజకీయాలన్నాక కేసులు మామూలే. అది చంద్రబాబుకీ తెలుసు.. రాజకీయ నాయకులందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమం తాలూకు కేసుల్లో ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు కొందరు న్యాయస్థానాల్లో హాజరవుతున్నారు. కేసుల వ్యవహారం ఇలాగే వుంటుంది మరి. ఎప్పుడో బాబ్లీ రగడ జరిగితే, ఇప్పుడు నోటీసులు ఏంటట.? అన్నది కాస్త ఆలోచించాల్సిన విషయమేగానీ, ఇదేమీ ప్రకృతి వైపరీత్యమైతే కాదు.

రేప్పొద్దున్న ఓటుకు నోటు కేసులో నోటీసులు జారీ అయినా అంతే. జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీకి సంబంధించిన కేసులో ఇటీవల రేవంత్‌రెడ్డికి నోటీసులు వెళ్ళాయి. ఓటుకు నోటు కేసు నోటీసులు మాత్రం కొత్తగా ఆయనకు వచ్చింది లేదు. కేసులు - నోటీసులు.. అదో పెద్ద తతంగం మరి.! సరే, నోటీసులు వచ్చాయి.. వస్తాయట.. అయితే ఏంటి.? చంద్రబాబుకి రక్షణ కవచం ఎప్పుడూ సిద్ధంగానే వుంటుంది.

ఎందుకంటే, ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి. ఓ పార్టీకి అధినేత కాబట్టి, ఎలాంటి నోటీసులు వచ్చినా.. దాన్ని ఎదుర్కోవడానికి 'యంత్రాంగం' అలర్ట్‌గానే వుంటుంది కదా.. ఇంకెందుకు భయం.? పైగా, చంద్రబాబు ఆషామాషీ పొలిటీషియన్‌ కాదు. 'నన్ను బెదిరింపులకు గురిచేస్తారు.. మీరంతా నాకు రక్షణ కవచంలా వుండాలి..' అని గతంలోనే చంద్రబాబు చెప్పేసుకున్నారాయె.. జనం నుంచి మాట తీసుకునేందుకు ప్రయత్నించారాయె.

'మీరు ఏం చేయాలంటే..' అంటూ తాజాగా చంద్రబాబు జనాన్ని ఉద్దేశించి ఏదో చెప్పాలనుకుని, ఆగిపోయారు. అంటే, ఏం చేయాలో.. రెండు మూడు రోజుల్లో చెప్పబోతున్నారన్నమాట. చంద్రబాబు ఉచ్చులో పడ్తారా.? ఛాన్సే లేదు. ఎందుకంటే, ఎవర్ని ఎలా ఉచ్చులోకి లాగాలో చంద్రబాబుకే బాగాతెలుసు. బీజేపీని, 2014 ఎన్నికల సమయంలో ఉచ్చులోకి లాగారు.. ఆ తర్వాత ఆ పార్టీపై అభాండాలు వేశారు.

కాంగ్రెస్‌ మీద నిన్న మొన్నటిదాకా అభాండాలు వేశారు.. ఇప్పుడు ఆ పార్టీనీ పొత్తుల ఉచ్చులోకి లాగుతున్నారు. రక్షణ కవచాలు.. ఉచ్చులు.. ఇవన్నీ చంద్రబాబుకి రాజకీయంతో పుట్టుకొచ్చిన అస్త్రాలే. అలాంటి చంద్రబాబు, కేసులకి భయపడ్తారా.? అందులోంచీ అవకాశాల్ని వెతుక్కుంటారు రాజకీయ లబ్దికోసం. దటీజ్‌ చంద్రబాబు.