Advertisement

Advertisement


Home > Politics - Political News

కోవాక్సిన్.. ఇది కమ్మవారి వ్యాక్సినా..?

కోవాక్సిన్.. ఇది కమ్మవారి వ్యాక్సినా..?

కరోనా నివారణకు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ లో ఉన్న ఈ వాక్సిన్ త్వరలోనే మార్కెట్లోకి వస్తుందని ఆశిస్తున్నారంతా. అయితే కొంతమంది మాత్రం కోవాక్సిన్ కి కులం కోటింగ్ ఇస్తున్నారు. ఇది కమ్మవారి వ్యాక్సిన్ అని, ఇన్నాళ్లూ.. కమ్మవారిని తిట్టిన కొంతమంది.. ఈ వ్యాక్సిన్ వాడకుండా ఉంటారా? అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టింగ్ ప్రత్యక్షమైంది. కోవాక్సిన్ తయారీలో కమ్మకులానికి చెందిన ఓ మహిళ ప్రముఖ పాత్ర పోషించారని.. ఆ విధంగా ఇది కమ్మవారు తయారు చేసిన వ్యాక్సినేననేది వారి నీచ వాదన.

వాస్తవానికి ఇలాంటి కులగజ్జి వార్తలకు ఎంత తక్కువ ప్రాముఖ్యతనిస్తే అంత మంచిది. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని.. ఇలాంటి అనవసర వార్తలే ఎక్కువగా హైలెట్ అవుతున్నాయి. కరోనా కంటే కులరోగంతో తీవ్రంగా బాధపడుతున్న ఓ దగుల్బాజీ ఎవరో ఈ పోస్టు పెట్టారనుకుందాం. దాన్ని వ్యతిరేకించే వారు ఎంతమంది ఉన్నారో.. సమర్థించేవారు కూడా అదే స్థాయిలో ఉండటం ఇక్కడ చర్చనీయాంశం.

సోషల్ మీడియాలో కొంతమంది అతిగాళ్లు ఇలాంటి కుల పోస్టులు పెట్టడం చాలాకాలం నుంచే ఉంది. అయితే అలాంటి వాటిపై ఎక్కువగా విమర్శలు వచ్చేవి. పెట్టిన కొన్ని గంటలకే.. తిట్లు భరించలేక ఇలాంటి పోస్టులు తీసేసేవారు. కానీ ఇటీవల కాలంలో.. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు ప్రజల్ని రెండు వర్గాలుగా విభజించాయి. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న రెండు కులాలు.. ఎన్నికల సాక్షిగా తమ వారిని ఏకం అయ్యేలా చేశాయి. ఒక వర్గం పూర్తిగా వైసీపీని సపోర్ట్ చేస్తే.. మరో వర్గం టీడీపీ స్టాండ్ తీసుకుంది. చదువుకున్నవారు, కాస్త వివేచన, విచక్షణ ఉన్నవారు దీనికి మినహాయింపు.

ఇక సోషల్ మీడియాలో కూడా క్యాస్ట్ వార్ తారాస్థాయికి చేరుకుంది. పార్టీలవారీగా విడిపోయిన కుల వాదులు.. తమ వర్గానికి ప్రాధాన్యత పెంచే అంశాలను, ఇతర వర్గాన్ని కించపరిచే పోస్టింగ్ లను పెడుతూ వచ్చారు. అనివార్యంగా మిగతావాళ్లు కూడా వీటిని సపోర్ట్ చేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ పై జరుగుతున్న కులపోరు మరీ నీఛంగా ఉంది. చివరకు ప్రముఖ డాక్టర్ల పేర్లు కూడా కులాల వారీగా విభజించి వారి గురించి ప్రచారం చేసుకునే దుస్థితికి చేరుకుంది.

ప్రజల్ని విభజించే ఇలాంటి పోస్టింగ్ లపై సోషల్ మీడియా సంస్థలు, పోలీసులు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. విద్వేష పోస్టింగ్ లు ఎవరు పెట్టినా వారిని సమర్థించాల్సిన అవసరం లేదు. ఇలాంటి పోస్టింగ్ లకు ఎంత త్వరగా చరమగీతం పాడితే అంత మంచిది. నాయకుల్ని కించపరిచే వార్తలు పెట్టినవారినే కాదు, కులాలవారీగా ప్రజల్ని రెచ్చగొడుతున్న ఇలాంటి వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేయాలి. వారి అకౌంట్లు బ్లాక్ చేయాలి.

ఇంత సక్సెస్ అస్సలు ఊహించలేదు

ఇడ్లీపాత్ర లాగా ఉప్మాగిన్ని లాగా డిజైన్లు చేశారు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?