cloudfront

Advertisement


Home > Politics - Political News

చేటుతెచ్చే ఎమ్మెల్యేలపై వేటు!

చేటుతెచ్చే ఎమ్మెల్యేలపై వేటు!

అభ్యర్ధుల పంపికపై బాబు కసరత్తు
గత ఐదేళ్ళుగా ప్రజా సమస్యలను గాలికి వదిలేసి, స్వప్రయోజనాలు, వ్యక్తిగత లబ్ధికే పరిమితమైన అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తీవ్ర శిరోభారంగా తయారయ్యారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ తరహా ఎమ్మెల్యేలు అధికంగా ఉండటంతో చంద్రబాబు తీవ్ర అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా సెంటిమెంట్‌ జిల్లాలుగా పేర్కొనే గోదావరి జిల్లాల్లో అధికార టీడీపీకి చెందిన కొందరు ప్రజా ప్రతినిధులు గత నాలుగున్నరేళ్ళలో ప్రజా సమస్యలను గాలికి వదిలేశారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఇటువంటి ఎమ్మెల్యేల జాతకాలను అధినేత చంద్రబాబు ఇప్పటికే నిశితంగా పరిశీలించినట్టు తెలిసింది. అతి త్వరలో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనున్న నేపథ్యంలో అభ్యర్ధులను ఖరారు చేసేపనిలో ఉన్న చంద్రబాబు సదరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేల పట్ల అసహనంతో ఉన్నట్టు భోగట్టా! ఇటీవల చంద్రబాబు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించారు. ఆయా పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాల్సిందిగా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌లకు పిలుపునిచ్చారు. అయితే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళే తీరికలేని స్థితిలో కొందరు ప్రజా ప్రతినిధులున్నారు.

గత నాలుగున్నర సంవత్సరాల్లో ప్రజల వైపు కన్నెత్తిచూడని పలువురు ఎమ్మెల్యేలు గోదావరి జిల్లాల్లో ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో మైనింగ్‌, ఇసుక, మట్టి మాఫియాలకు కొందరు ఎమ్మెల్యేలు సారథ్యం వహిస్తున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు వందలకోట్ల విలువైన కాంట్రాక్ట్‌ పనులను బినామీల పేరున హస్తగతం చేసుకున్నారు. ఇంకొందరు ఎమ్మెల్యేలు లిక్కర్‌ సిండికేట్లుగానూ, భూ సెటిల్‌మెంట్స్‌ చేయడంలో సిద్ధహస్తులుగా మారారు. పలుచోట్ల ప్రభుత్వ, ప్రైవేటు భూములను కొల్లగొట్టిన ఘనత అధికార టీడీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలకు దక్కింది.

ఇటువంటి అక్రమ భూలావాదేవీలు, మట్టి, ఇసుక సిండికేట్‌ మాఫియాల్లో కొందరు ప్రతిపక్ష నేతలకూ వాటాలందుతున్నట్టు తెలుస్తోంది. ఇటువంటి అక్రమ వ్యవహారాలపై అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం ఇక్కడి ప్రత్యేకత! అయితే అధికారంలో ఉన్న టీడీపీ ప్రజా ప్రతినిధుల్లో చాలామంది ఇటీవలి కాలంలో పెద్దఎత్తున దందా సాగించినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేల అవినీతిపై ఇటు మీడియాలోనూ, అటు సోషల్‌ మీడియాలోనూ పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

సదరు అక్రమార్కులు నిస్సిగ్గుగా దోపిడికి పాల్పడుతున్నా పట్టించుకునే తీరికలేని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎన్నికలు ముంచుకొస్తుండటంతో పార్టీ ప్రయోజనాల రీత్యా స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో ప్రజా వ్యతిరేతను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు శ్రీముఖం తప్పదన్న ప్రచారం జరుగుతోంది. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇచ్చేందుకు నిర్ణయించుకున్న చంద్రబాబు ఇప్పటికే ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం!

అంటే సిటింగ్‌లందరికీ సీట్లు దక్కవని, ఆయా నియోజకవర్గాల్లో ప్రజల్లో విశ్వాసం చెక్కుచెదరని వారికే టిక్కెట్లు కేటాయిస్తామని చంద్రబాబు పార్టీ కీలకనేతల వద్ద స్పష్టం చేసినట్టు సమాచారం! ఈ విధంగా చూస్తే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సుమారు 10 మంది సిటింగ్‌లకు సీట్లు లభించే అవకాశం లేన్నట్టు తెలుస్తోంది. ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ఫిరాయింపునకు రంగం సిద్ధం చేసుకుంటున్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల చిట్టా సైతం చంద్రబాబు చేతిలో ఉన్నట్టు తెలుస్తోంది.

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇరువురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ, నలుగురు మాజీ ప్రజాప్రతినిధులు తెలుగుదేశం నుండి ఫిరాయించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. సదరు నేతలు వైకాపా, జనసేన పార్టీల్లో చేరేందుకు సంప్రదింపుల్లో ఉన్నట్టు సమాచారం! ఇటువంటి జంప్‌ జిలానీల స్థానే కొత్త అభ్యర్ధులను ఎంపిక చేసేందుకు చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నట్టు భోగట్టా!

బాబు పాలనపై గ్రేట్ ఆంధ్ర సర్వే ఫలితాలు!

ప్రజాస్వామ్యానికే పెనుముప్పుగా మారిన వైనం!