cloudfront

Advertisement


Home > Politics - Political News

చీకట్లో ఈవీఎం: ఫిర్యాదులన్నీ ఇలానే.!

చీకట్లో ఈవీఎం: ఫిర్యాదులన్నీ ఇలానే.!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నేటి ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ కొనసాగుతోంది. కొన్నిచోట్ల కాస్త ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమయ్యింది. పలుచోట్ల ఓటర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా ఈవీఎంలు చీకట్లో పెట్టారంటూ ఓటర్లు ఆరోపిస్తున్నారు. 'ఎవరికి ఓటేశామో అర్థం కావడంలేదు..' అంటూ ఫిర్యాదు చేస్తున్నవారే ఎక్కువ. 'అన్ని ఏర్పాట్లూ పక్కాగా చేశాం..' అని ఓ పక్క అధికార యంత్రాంగం చెబుతోంటే, ఏర్పాట్లలో లోపాలు సుస్పష్టంగా కన్పిస్తున్నాయి.

ప్రతిసారీ 'ఓట్ల గల్లంతు'పై ఆరోపణలు వస్తున్నా, ఆ దిశగా ఎన్నికల కమిషన్‌ తగుచర్యలు చేపట్టడంలేదనడానికి ఈసారీ ఓట్ల గల్లంతుపై ఆరోపణలు వెల్లువెత్తుతుండడమే నిదర్శనం. ప్రత్యేకించి కొన్నిచోట్ల మాత్రమే ఎక్కువ ఓట్లు గల్లంతవుతుండడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఆయా పార్టీల నేతల మధ్య గొడవలు.. అవి ముదిరి ఉద్రిక్త పరిస్థితులు.. ఇవన్నీ షరామామూలు వ్యవహారాలుగా మారిపోయాయి.

ఇదిలావుంటే, పోలింగ్‌ బూత్‌కి కాస్త దూరంలో ఆయా రాజకీయ పార్టీలు చివరి ప్రయత్నాల్లో భాగంగా, ఓటర్లకు డబ్బులు పంచేందుకు ప్రయత్నిస్తున్నారు. రూరల్‌ ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కన్పిస్తోంది. అర్బన్‌ ప్రాంతాల్లో ఓటింగ్‌ ఒకింత మందకొడిగానే సాగుతోంది. మధ్యాహ్నం 4 గంటల సమయానికిగానీ మొత్తంగా ఎంతశాతం ఓటింగ్‌ నమోదవుతుందన్న దానిపై ఓ స్పష్టత వచ్చే అవకాశంలేదు.

4 గంటలకు కొన్ని ప్రాంతాల్లో (సమస్యాత్మక) పోలింగ్‌ ముగియనుండగా, 5 గంటలకు అన్నిచోట్లా పోలింగ్‌ ముగుస్తుంది. 5 గంటల సమయానికి లైన్‌లో ఎంతమంది వుంటే, అంతమందికీ ఓటు హక్కు కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. మొత్తమ్మీద, కనీవినీ ఎరుగని రీతిలో పోలింగ్‌ కోసం అధికారులు ఏర్పాట్లు చేశామని ఊదరగొట్టేసినా, ఏర్పాట్లలో లోపాలు సుస్పష్టంగానే కన్పిస్తున్నాయి.