cloudfront

Advertisement


Home > Politics - Political News

చిక్కోలులో జన ఉప్పెన: ఇదీ జగన్ సత్తా..

చిక్కోలులో జన ఉప్పెన: ఇదీ జగన్ సత్తా..

12 జిల్లాల్లో ఇప్పటికే ప్రజాసంకల్ప యాత్ర పూర్తిచేసిన వైఎస్‌ జగన్‌, 13వ జిల్లా.. అదీ చివరి జిల్లాలో ప్రజాసంకల్ప యాత్రను నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ప్రజాసంకల్ప యాత్ర ముగియనున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో 'చిక్కోలు' (శ్రీకాకుళం జిల్లానే..) వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజాసంకల్ప యాత్రను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రస్తుతం జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర ఎచ్చెర్ల నియోజకవర్గంలో జరుగుతోంది.

తాజాగా, ఎచ్చెర్ల నియోజకవర్గంలోని చిలకపాలెంలో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. వైఎస్‌ జగన్‌ ఏం మాట్లాడారన్న విషయం పక్కన పెడితే, ఈ సభకి జనం పోటెత్తడం చూసి వైసీపీ అధినేత ఆశ్చర్యపోవడం విశేషంగానే చెఫ్పుకోవాలి. సొంతజిల్లా కడపలో కావొచ్చు, రాయలసీమలోని ఇతర జిల్లాల్లో కావొచ్చు.. ఉభయ గోదావరి జిల్లాల్లో కావొచ్చు.. మొత్తంగా ఇప్పటిదాకా ప్రజాసంకల్ప యాత్ర నిర్వహించిన 13 జిల్లాల్లో కావొచ్చు.. జగన్‌ చాలా బహిరంగ సభలు నిర్వహించారు. వాటన్నిటినీ మించి, ఎచ్చెర్ల - చిలకపాలెంలో నిర్వహించిన బహిరంగ సభకు జనం పోటెత్తడం గమనార్హం.

ఓ దశలో పోలీసులు, జనాన్ని కంట్రోల్‌ చేయలేకపోయారంటే పరిస్థితి ఎలావుందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల చిక్కోలు జిల్లాను తితిలీ తుపాను వణికంచింది. జిల్లాలోనే వుండి తితిలీ తుపానుతో యుద్ధం చేశామనీ, ప్రజల్ని ఆదుకున్నామనీ చంద్రబాబు సర్కార్‌ చేసిన పబ్లిసిటీ స్టంట్ల గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఆ పబ్లిసిటీ స్టంట్లను వైఎస్‌ జగన్‌ ఎండగట్టారు. జనం బాధల్లో వుంటే, వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం, తితిలీ తుపానుని కూడా పబ్లిసిటీ కోసం వాడుకుందని ఎద్దేవా చేశారు వైఎస్‌ జగన్‌.

ఇక, తెలంగాణలో ఎన్నికల ప్రచారం పేరుతో.. రాష్ట్ర సమస్యల్ని గాలికొదిలేశారని చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై తెలంగాణలో మొసలి కన్నీరు కార్చుతున్న చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఎలా ఇచ్చారని జగన్‌ నిలదీశారు. జగన్‌ చెప్పిన ప్రతిమాటకీ జనం నుంచి పెద్దయెత్తున స్పందన లభించింది. కాగా, ఈ స్థాయి జన సంద్రం, ప్రజాసంకల్ప యాత్రలో ఇప్పటిదాకా తాము చూడలేదని వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు అంటున్నారు.

సుజనా ఏమార్చేది ఇలాగేనా చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్