Advertisement


Home > Politics - Political News
మరీ ఇంత దారుణమేంటి చిరంజీవి?

తమ్ముడి కొడుకు సినిమా హిట్టైందని.. దానికి మరింత పబ్లిసిటీ ఇవ్వడానికి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టడానికి మాత్రం చాలా తీరిక ఉంటుంది. తన సినిమాటిక్ పొగడ్తలో ప్రెస్ మీట్లో కూడా తెగ యాక్ట్ చేసేస్తూ... అబ్బురాన్ని చూసినట్టుగా చెప్పడానికి అయితే సమయం ఉంటుంది. మీ కుటుంబం, మీ హీరోలు, మీ సినిమాలు.. వీటి కోసం సమయం కేటాయించడంలో ఎలాంటి తప్పు లేదు.

అది చిరంజీవి బాధ్యత అయితే అయి ఉండవచ్చు. కానీ చిరంజీవికి అంతకు మించిన బాధ్యత లేదా? ఎంపీగా అయితే కొనసాగుతున్నారు కదా? ఏపీ కోటాలో రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు కదా? ఆ బాధ్యతతో ఒక్కసారి అయినా ఈ మెగాస్టార్ స్పందించాడా? అవతల నాలుగు సంవత్సరాలనుంచి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తూనే ఉంది, ఈ సారి బడ్జెట్లో కూడా అదే అన్యాయమే జరిగింది.

ప్రత్యేకహోదా పోయింది, ప్రత్యేక ప్యాకేజీ ఊసు కనిపించడం లేదు.. ఇలాంటి సమయంలో... ఏపీ పరిస్థితి మరీ దయానీయంగా మారింది. ఈ అంశం గురించి చాలా మంది స్పందిస్తున్నారు. పక్క రాష్ట్రాల వారు కూడా స్పందిస్తున్నారు. అయితే.. చిరంజీవికి మాత్రం స్పందించే తీరిక కనిపించడం లేదు. రాజ్యసభలో నిరసన తెలపలేదు.. ఆఖరికి కాంగ్రెస్ పార్టీలోని ఎంపీలు నిరసన తెలుపుతున్నా చిరంజీవికి మాత్రం అంత తీరిక కనిపించడం లేదు.

ఇంత జరుగుతుంటే మారు మాట్లాడని ఈ మెగాస్టార్.. తొలిప్రేమ సినిమా ప్రమోషన్ కు మాత్రం ముందుకు వచ్చాడు. ఎవరైనా అనొచ్చు.. చిరంజీవి రాజకీయాల నుంచి తప్పుకున్నాడు, అందుకే స్పందించడం లేదు. మరి అంతేనా మెగాస్టార్ అంటే? సీఎం పీఠం కలలతో వచ్చినప్పుడు, రాజకీయంగా లాభాలు పొందడానికి పార్టీ పెట్టినప్పుడు తెగ రియాక్ట్ అయిపోయి, తెగ చలించిపోయి, రాష్ట్రం స్థితి గురించి తెగ ఆందోళన వ్యక్తం చేసి.. ఇప్పుడు మాత్రం రాజకీయాల నుంచి తప్పుకున్నాడు.. అంటే, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు, తర్వాత నాలుగేళ్ల పాటు చేసిందంతా నటనేనా? అంతకు మించి ఏమీ లేదా?

ఒకవేళ చిరంజీవి రాజకీయాలకు దూరం కాదలుచుకుంటే.. రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాల్సింది. అదీ సన్యాసం అంటే. ఎంపీ పదవి కావాలి, ఎంపీ హోదా కావాలి, దాంతో వచ్చే బేసిక్ గౌరవాలు, అలవెన్సులు కావాలి.. ఆ హోదాతో మాత్రం స్పందించే తీరిక ఉండదు. ఇదేనా హీరోయిజం? సినిమాల్లో విలన్లు చూపే విలనిజానికీ దీనికా తేడా లేదేమో!