cloudfront

Advertisement


Home > Politics - Political News

సెలవులోనే రిటైర్మెంట్‌.. పాలిటిక్స్‌కు గుడ్ బై..!

సెలవులోనే రిటైర్మెంట్‌.. పాలిటిక్స్‌కు గుడ్ బై..!

రాజకీయాల్లో సుదీర్ఘకాలం కొనసాగుతాడని, ఉన్నత స్థానం (సీఎం పదవి) అధిరోహిస్తాడని ఆశించిన మెగాస్టార్‌ చిరంజీవి కనీసం పార్లమెంటు ముఖం చూడకుండానే అనామకుడిలా రిటైర్‌ కాబోతున్నారు. మాజీ కేంద్ర మంత్రి అనిపించుకున్న ఈ హీరో విఫల నేతగా ఇంటిదారి పడుతున్నారు. పడుతున్నారని అనడం తప్పు. ఆల్రెడీ పట్టేశారు.

రాజ్యసభ సభ్యుడిగా ఏప్రిల్‌ 2వ తేదీన రిటైర్‌ కావల్సిన చిరంజీవి పార్లమెంటుకు రాక చాలా కాలమైపోయింది. దానికి తగినట్లు మార్చి 5వ తేదీ నుంచి ఏప్రిల్‌ రెండో తేదీ వరకు సెలవు పెట్టేశారు. అంటే పార్లమెంటుకు రాకుండానే సెలవులోనే పదవీ విరమణ జరిగిపోతుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేశాక ఇక పార్లమెంటు మొహం చూడలేదు. పార్లమెంటునే కాదు, కాంగ్రెసునూ వదిలేశారు. ఇంకా చెప్పాలంటే సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌నూ వదిలేశారు. రాజకీయ పరిణామాలపై స్పందించడం ఏనాడో మానేశారు.

ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న పోరాటాన్ని ఏనాడూ పట్టించుకోలేదు. ఎంపీగా ఉండి కూడా అది తనకు సంబంధించిన సమస్య కాదనుకున్నారు. ఎంపీ అనే విషయం పక్కన పెడితే కనీసం ఓ తెలుగువాడిగా కూడా ఆయనలో కనీస స్పందన లేదు. ఎంపీగా తన బాధ్యతను పూర్తిగా విస్మరించిన చిరంజీవి తన సినిమాలను మాత్రం జనం విరగబడి చూసి విజయవంతం చేయాలని (భారీ కలెక్షన్లు రావాలని) కోరుకుంటున్నారు. అరవై ఏళ్లు దాటిపోయాక తాను కుర్ర హీరోయిన్లతో చేస్తున్న 'కుమ్ముడు' టైపు డ్యాన్సులు చూసి జనం చప్పట్లు కొట్టాలని, ఎంజాయ్‌ చేయాలని ఆశిస్తున్నారు.

ఆయన రిటైర్మెంటు తరువాత రాజకీయాల్లో ఉంటారని ఎవ్వరూ అనుకోవడంలేదు. మనసు మార్చుకుంటాడని భావించడంలేదు. రాజకీయాల్లో ఉండాలని సీరియస్‌గా అనుకుంటే వ్యవహారశైలి ఇలా ఉండదు. రాజ్యసభ సభ్యత్వం ముగిశాక చిరంజీవిని దొరకబుచ్చుకోవాలని (పార్టీలో చేర్చుకోవాలని) టిడిపి, వైకాపా ఆలోచిస్తున్నట్లు గతంలో వార్తలొచ్చాయి.

ఊరికే చేర్చుకోవడం కాదు, రాజ్యసభకు పంపే యోచన చేశాయట...! టిడిపిగాని, వైకాపాగాని చిరంజీవి మీద కన్నేయడానికి కారణం.. వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే కాపు సామాజిక వర్గం ఓట్లు. మెగాస్టార్‌ది ఆ సామాజిక వర్గమే కాబట్టి ఆయన వస్తే ఆ వర్గం ఓట్లు కొల్లగొట్టవచ్చనే ఆలోచన చేశాయని కొందరు నేతలు చెప్పిన సమాచారం. ఇంతకూ చిరంజీవిని లాక్కురావాలనే ఆలోచన ఎవరు  చేశారు?

టిడిపిలో, వైకాపాలో ఉన్న ఒకప్పటి ప్రజారాజ్యం నాయకులు. అప్పట్లో వీరు చిరంజీవితో కలిసి ఆ పార్టీ అంతమయ్యేదాకా పనిచేశారు. ఆ తరువాత కాంగ్రెసులోకి పోగా మిగిలినవారిలో కొందరు టిడిపిలో చేరగా, కొందరు వైకాపాలో చేరారు. వీరు ఇప్పటికీ చిరంజీవితో టచ్‌లోనే ఉన్నారు. చిరు కోసం మంత్రి గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్‌ (ప్రస్తుతం మాజీ మంత్రి) ప్రయత్నాలు చేసినట్లు గతంలో మీడియా కోళ్లు కూశాయి.

చిరు కుటుంబానికి గంటా చాలా సన్నిహితుడనే విషయం తెలిసిందే. కామినేని బిజెపి నాయకుడైనా చంద్రబాబుతో అంటకాగుతున్నారనే అభిప్రాయముండేది. ఇక వైకాపా తూర్పు గోదావరి అధ్యక్షుడు కన్నబాబు ఒకప్పుడు ప్రజారాజ్యం ఎమ్మెల్యే. చిరంజీవిని వైకాపాలోకి ఆహ్వానించాల్సిందిగా ఆయన వైఎస్‌ జగన్‌కు సలహా ఇచ్చినట్లు సమాచారం. దీంతో చిరంజీవి అభిప్రాయం తెలుసుకోవల్సిందిగా కన్నబాబుకు జగన్‌ చెప్పారని ఓ ఆంగ్ల పత్రిక రాసింది.

చిరంజీవిని లాగే ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది? అని బీజేపీ కేంద్ర నాయకత్వం ఇదివరకు ఆలోచించింది. ఆయన్ని రాజ్యసభకు పంపేందుకు ఏపీలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచీ బిజెపికి అవకాశం ఉంది. స్థిరమైన అభిప్రాయాలు, నిలకడైన మనస్తత్వం లేని పవన్‌ కంటే అన్నయ్య బెటరని అప్పట్లో కమలం పార్టీ అభిప్రాయపడింది. చిరంజీవికి ఇప్పటికీ ప్రజాదరణ ఉందని, ఆయన్ని పార్టీలోకి తీసుకుంటే గ్లామర్‌ ఉన్న నాయకుడు లభించినట్లవుతుందని అనుకున్నారు.

చిరంజీవి నిరాశతో కాంగ్రెసు ప్రలోభాలకు లొంగిపోయి ప్రజారాజ్యం పార్టీని దాంట్లో విలీనం చేశారని, వాస్తవానికి 2009 ఎన్నికల్లో పిఆర్‌పికి వచ్చిన సీట్లు, ఓట్లు మరీ తీసిపారేయదగినవిగా లేవని బీజేపీ నాయకులన్నారు. కాపులు పవన్‌ కళ్యాణ్‌ కంటే చిరంజీవిని ఎక్కువ అభిమానించే అవకాశం ఉందని కూడా ఒకరిద్దరు నేతలు వాఖ్యానించారు. ఏది ఏమైనా చిరంజీవి రాజకీయ జీవితం ముగిసింది. సినిమాలకు పునరంకితమైంది.