cloudfront

Advertisement


Home > Politics - Political News

పవన్.. ఈ పాఠాలు అన్నకు చెప్పరాదే..!!

పవన్.. ఈ పాఠాలు అన్నకు చెప్పరాదే..!!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి హాజరు కావాలి.. అసెంబ్లీకి గైర్హాజరు కావడం తగదు.. ఇదీ పవన్ కల్యాణ్ ప్రవచించిన సూక్తి ముక్తావళి. మొన్నటి ఆవిర్భావ సభలోనూ అదే మాటే మాట్లాడాడు, నిన్న గుంటూర్లో తిరుగుతూ అదే మాట మాట్లాడాడు. అయితే వైకాపా అసెంబ్లీకి రావడాన్ని తప్పు పడుతున్న పవన్ కల్యాణ్.. ఫిరాయింపుల విషయంలో మాత్రం ఇంత వరకూ మాట్లాడలేదు.

23మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వైకాపా నుంచి తెలుగుదేశంలోకి ఫిరాయించారు. వారిపై చర్యలు తీసుకోవాలని వైకాపా అనేక మార్లు స్పీకర్ ను కోరింది. కోర్టుకు వెళ్లింది. అయినా ప్రయోజనం లేదు. ఈ నేపథ్యంలో ఇక చేసేది లేక.. ప్రజాస్వామ్యాన్ని ఉప్పు పాతర వేసిన అసెంబ్లీకి తాము రావడం ఎందుకు? అనే ప్రశ్నతో సభకు రానని ప్రకటన చేసింది.

అయినప్పటికీ చంద్రబాబుకు లెక్క లేదు. వాళ్లు రాకపోవడమే మేలన్నట్టుగా సాగిపోతూ ఉన్నాడు. మధ్యలో పవన్ కల్యాణ్ కు విషయం అర్థంకావడం లేదో లేక అర్థమై నటిస్తున్నాడో.. కానీ హితబోధలు చేస్తూ ఉన్నాడు జగన్ సీఎం అయ్యే వరకూ అసెంబ్లీకి రానన్నాడని తనకు తోచినట్టుగా.. కామెంట్లు చేస్తూ ఉన్నాడు జనసేన అధిపతి.

మరి ఇలా మాట్లాడటానికి ఏమీ అనిపించదు ఏమోకానీ.. ఇక్కడ మరో విషయాన్ని గ్రహించాలి. అదేమిటంటే.. శ్రీమాన్ చిరంజీవి వర్యులు రాజ్యసభకు సెలవు చీటీ ఇచ్చారట. ఈ విషయాన్ని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య ప్రస్తావించాడు. తను వేరే పనుల మీద ఉన్నాను అని, హాలిడేలో ఉన్నాను అని.. అందుకే రాజ్యసభకు రాలేకపోతున్నాను అని చిరంజీవి లెటర్ ఇచ్చాడని రాజ్యసభ చైర్మన్ ప్రకటించాడు.

ఒకవైపు ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో పార్లమెంటులో అంత రచ్చ జరుగుతూ ఉంటే.. చిరంజీవి తాపీగా సెలవు పెట్టాడట. హాలీడేలో ఉన్నాను సభకు రాలేకపోతున్నాను అని చెప్పాడట. అయినా ఇన్నాళ్లూ సభలో చిరంజీవి చేసింది ఏమీలేదు. సాధించింది ఏమీలేదు. ఇప్పుడు కొత్తగా సెలవు చీటీ వల్ల రాష్ట్రానికి జరిగే నష్టం కూడా ఏమీ లేదు. అయితే వైకాపా వాళ్లు అసెంబ్లీకి రావాలి.. అంటూ అర్థం పర్థంలేని క్లాసులు పీకుతున్న పవన్ కు.. అన్నగారి సెలువుల విషయం తెలియదేమో పాపం!