cloudfront

Advertisement


Home > Politics - Political News

అభిమానులు చేరితే 'చిరు' వస్తాడా?

అభిమానులు చేరితే 'చిరు' వస్తాడా?

మెగాస్టార్‌ చిరంజీవి రాజకీయాలు పూర్తిగా వదిలేశాడో లేదో తెలియదు. ఆయన కాంగ్రెసు పార్టీ నుంచి బయటకు రాకపోయినప్పటికీ చాలాకాలంగా పార్టీకి దూరంగా ఉంటూ సినిమాల్లో తలమునకలుగా ఉన్నాడు. పార్టీ కార్యక్రమాలపై ఏమాత్రం ఆసక్తి చూపించడంలేదు. ఏపీలో కాంగ్రెసును నడిపించే బాధ్యతను ఆయనకు అప్పగించాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎన్నికలు దగ్గరపడుతున్నందున చిరువంటి ఇమేజ్‌, గ్లామర్‌ ఉన్న నేత కావాలని అధిష్టానం కోరుకుంటోంది. కాని ఆయన నుంచి ఇప్పటివరకు స్పందనలేదు.

తాజాగా మెగాస్టార్‌ అభిమానులు భారీగా పవన్‌ కళ్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్‌ చిరు గురించి ఆవేశంతో, అభిమానంతో, ప్రేమతో ప్రసంగించాడు. ఇంతవరకు బాగానేవుంది. కాని చిరు అభిమానులు భారీగా జనసేనలో చేరడానికి కారణం చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తుండటమేనని ఓ సమాచారం. తమ్ముడికి అండగా ఉండేందుకుగాను ఆయన కాంగ్రెసుకు వీడ్కోలు పలికి జనసేనలో చేరతాడని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

ఆయన పార్టీకి గౌరవాధ్యక్షుడిగా వ్యవహరిస్తూ తమ్ముడిని గైడ్‌ చేస్తాడట!  చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు కలిస్తే జనసేన దూసుకుపోతుందని, ఇద్దరి సినిమా గ్లామర్‌ కారణంగా పార్టీ రేంజ్‌ పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు సమాచారం. నిజానికి చిరంజీవి జనసేనలోకి వస్తాడనేందుకు ఇప్పటివరకు ఆధారాలేమీ లేవు. ఆయన అలాంటి సంకేతాలు ఇచ్చిన దాఖలాలు లేవు. చిరు పార్టీలోకి రావచ్చని మెగా ఫ్యామిలీ అభిమానులు వేస్తున్న అంచనా మాత్రమే.

అభిమానులు జనసేనలో చేరిన సందర్భంగా చిరంజీవికి అనుకూలంగా నినాదాలు చేశారు. దానికి తగ్గట్లుగానే పవన్‌ కళ్యాణ్‌ అన్నయ్య గురించి గొప్పగా మాట్లాడాడు. జనసేన చిరంజీవి అభిమానులది అని పవన్‌ అన్నాడు. చిరు అభిమానులు భారీగా జనసేనలో చేరడం, పవన్‌ ఆయన్ను గురించే మాట్లాడటంతో చిరు రావచ్చని అనుకుంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేశాక ఇక పార్లమెంటు మొహం చూడలేదు. పార్లమెంటునే కాదు, కాంగ్రెసునూ వదిలేశారు. ఇంకా చెప్పాలంటే సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌నూ వదిలేశారు.

రాజకీయ పరిణామాలపై స్పందించడం ఏనాడో మానేశారు. మళ్లీ సినిమాల్లో బిజీ కావాలని నిర్ణయించుకున్న తరువాత చిరంజీవి ఏపీ రాజకీయాలకు దూరంగా ఉండిపోయాడు. ప్రత్యేకహోదా కోసం జరుగుతున్న పోరాటాన్ని ఏనాడూ పట్టించుకోలేదు. ఎంపీగా ఉండి కూడా అది తనకు సంబంధించిన సమస్య కాదనుకున్నారు. ఎంపీ అనే విషయం పక్కనపెడితే కనీసం ఓ తెలుగువాడిగా కూడా ఆయనలో కనీస స్పందన లేదు. ఎంపీగా తన బాధ్యతను పూర్తిగా విస్మరించిన చిరంజీవి తన సినిమాలను  విజయవంతం చేయాలని (భారీ కలెక్షన్లు రావాలని) కోరుకుంటున్నారు.

రాజ్యసభ సభ్యత్వం ముగిశాక చిరంజీవిని దొరకబుచ్చుకోవాలని (పార్టీలో చేర్చుకోవాలని) టిడిపి, వైకాపా ఆలోచించినట్లు గతంలో ఓ ఆంగ్ల పత్రికలో వార్తలొచ్చాయి. ఊరికే చేర్చుకోవడం కాదు, రాజ్యసభకు పంపే యోచన చేశాయట! ఇందుకు కారణం.. వచ్చే ఎన్నికల్లో కీలకపాత్ర పోషించే కాపు సామాజికవర్గం ఓట్లు.  ఇంతకూ చిరంజీవిని లాక్కురావాలనే ఆలోచన ఎవరు  చేశారు?

టిడిపిలో, వైకాపాలో ఉన్న ఒకప్పటి ప్రజారాజ్యం నాయకులు. అప్పట్లో వీరు చిరంజీవితో కలిసి ఆ పార్టీ అంతమయ్యేదాకా పనిచేశారు. ఆ తరువాత కాంగ్రెసులోకి పోగా మిగిలినవారిలో కొందరు టిడిపిలో చేరగా, కొందరు వైకాపాలో చేరారు. వీరు ఇప్పటికీ చిరంజీవితో టచ్‌లోనే ఉన్నారు. చిరు కోసం మంత్రి గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్‌ (ప్రస్తుతం మాజీమంత్రి) ప్రయత్నాలు చేసినట్లు గతంలో మీడియా కోళ్లు కూశాయి. ఎవరెంత కూసినా చిరంజీవి సినిమా నిర్మాణంలో బిజీగా ఉండిపోయారు. జనసేనలో చేరతాడనే అంచనా నిజమవుతుందా?