cloudfront

Advertisement


Home > Politics - Political News

ఆడు మగాడ్రా బుజ్జీ..

ఆడు మగాడ్రా బుజ్జీ..

వైసీపీ అధినేత వైఎస్ జగన్ 2019 ఎన్నికల్లో పెద్దగా ప్రయోగాలు చేయలేదు. అన్నిచోట్లా బలమైన అభ్యర్థులనే నిలబెట్టారు. ప్రత్యర్థికి గట్టిపోటీ ఇస్తారనుకున్న వారికే టికెట్లు కన్ఫామ్ చేశారు. కానీ హిందూపూర్ విషయంలో మాత్రం జగన్ లెక్క తప్పుతుందని చాలామంది అంచనాలు వేసుకున్నారు. సిట్టింగ్ ఎంపీ నిమ్మల కిష్టప్పపై కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన గోరంట్ల మాధవ్ ని నిలబెట్టారు. అయితే జగన్ అంచనాల్ని నిలబెడుతూ, 1,38,137ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు మాధవ్.

గోరంట్ల మాధవ్ అనంతపురం సీఐగా పనిచేశారు. జేసీ దివాకర్ రెడ్డికి వార్నింగ్ ఇస్తూ మీసం మెలేసిన ఓ వీడియోతో సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్ గా మారారు. అంతే ఆ తర్వాత పరిణామాలన్నీ చకచకా జరిగిపోయాయి. మాధవ్ ధైర్యం జగన్ కి నచ్చింది. ఏకంగా హిందూపూర్ ఎంపీ సీటు కేటాయించారు.

అందులోనూ నామినేషన్ల వేళ తకరారు మొదలైంది. సీఐగా మాధవ్ రాజీనామాకు ఆమోదం లభించలేదని, ఆయన పోటీ చేయడానికి వీళ్లేదని ప్రత్యర్థులు ఆటంకాలు సృష్టించారు. అవన్నీ దాటుకుని ఎట్టకేలకు ఓ సాధారణ పోలీసు సిట్టింగి ఎంపీకి చుక్కలు చూపించారు. ఇదంతా ఆయన వెనక ఉన్న జగన్ బలమే కావొచ్చు కానీ ఇక్కడ పోటీకి వెరవని ధైర్యం అధినేతలో, అభ్యర్థిలో కామన్ పాయింట్.

అప్పటి వరకూ వందలసార్లు ఎంపీ కిష్టప్పకు సెల్యూట్ చేసిన ఆ చేత్తోనే.. ఆయన్ని ఓడించారు. కౌంటింగ్ రోజున జరిగిన మరో అరుదైన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీఐగా ఉండగా.. తన డిపార్ట్ మెంట్ లోని ఉన్నతోద్యోగులకు సెల్యూట్ చేసిన మాధవ్, ఎంపీగా ఎన్నికైన తర్వాత అదే డిపార్ట్ మెంట్ ఉన్నతాధికారుల నుంచి సెల్యూట్ అందుకున్నారు.

హిందూపూర్ కౌంటింగ్ కేంద్రంలో ఈ సెల్యూట్ ఫొటో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. సీఐగా రాజీనామా చేసి, డీఎస్పీతో సెల్యూట్ చేయించుకుంటున్న మాధవ్ కి అందరూ అభినందనలు తెలుపుతున్నారు. బండ్లు ఓడలు , ఓడలు బండ్లు కావడం అంటే ఇదేనేమో..