Advertisement

Advertisement


Home > Politics - Political News

పౌర‌స‌త్వ చ‌ట్టం.. కోర్టులో నిల‌బ‌డ‌దా!

పౌర‌స‌త్వ చ‌ట్టం.. కోర్టులో నిల‌బ‌డ‌దా!

పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ‌ల చ‌ట్టం గురించి మోడీ ప్ర‌భుత్వం గ‌ప్ఫాలు కొట్టుకుంటూ ఉంది. ఇదో చారిత్ర‌క ఘ‌ట్టం అంటూ ఉంది. తామేం చేసినా మొద‌ట్లో చరిత్రాత్మ‌కం, చారిత్ర‌కం అంటూ.. మోడీ అండ్ కో ఊదేస్తూ ఉంటారు. ఆ త‌ర్వాత అందుకు ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇది వ‌ర‌కూ అన్నీ అలాగే జ‌రిగాయి.

ఇక ఇప్పుడు పౌర‌స‌త్వ చ‌ట్టం స‌వ‌ర‌ణ‌ల బిల్లును మోడీ ప్ర‌భుత్వం ఎంచ‌క్కా ఉభ‌య స‌భ‌ల‌నూ దాటించేయ‌గ‌ల‌దేమో కానీ, ఈ బిల్లు కోర్టులో నిల‌బ‌డ‌దు అని విప‌క్షాలు అంటున్నాయి.ఉభ‌య స‌భ‌ల్లో బ‌లాల‌ను బ‌ట్టి ఈ చ‌ట్టం తీసుకొచ్చినా.. దీనిపై కోర్టుకు వెళ్లే అవ‌కాశం ఉంద‌ని కాంగ్రెస్, వామ‌ప‌క్షాలు అంటున్నాయి.

ఇది రాజ్యాంగ స‌వ‌ర‌ణ కాద‌ని, కేవ‌లం బిల్లు-చ‌ట్ట స‌వ‌ర‌ణ మాత్ర‌మే  అని ఆ పార్టీల నేత‌లు గుర్తు చేస్తూ ఉన్నారు. ఆ బిల్లు రాజ్యాంగ నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా ఉంద‌ని వారు ప్ర‌స్తావిస్తూ ఉన్నారు. ఈ బిల్లులో మ‌త ప్రాతిప‌దిక‌ను పేర్కొన్నార‌ని, ఇది రాజ్యాంగ భావ‌న‌కు విరుద్ధం అని వారు వివ‌రిస్తున్నారు.

వివ‌క్షాపూరితంగా, విబేధాల‌ను సృష్టించేలా ఈ బిల్లు ఉంద‌ని, ప్ర‌త్యేకించి మ‌త ప్రాతిప‌దిక‌న పౌర‌స‌త్వాల‌ను ఇచ్చేలా ఇందులో పేర్కొన్నార‌ని, ఇది రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని లాయ‌ర్లు అయిన కాంగ్రెస్ నేత‌లు అంటున్నారు.

న్యాయ‌స‌మీక్ష‌లో ఈ బిల్లు నిలిచే అవ‌కాశ‌మే లేద‌ని వారు ధీమాగా చెబుతున్నారు. మ‌రి మోడీ, అమిత్ షాలేమో అద్భుతం చేశామ‌ని అంటుంటే, కాంగ్రెస్ నేత‌లు మాత్రం ఇది కోర్టులో నిల‌బ‌డే ప్ర‌స‌క్తే లేద‌ని అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?